వ‘రుణం’ తీరలేదింకా…!

మళ్లీ కురిసిన వాన… కుదేలైన రైతన్న

దిశ దశ, హుజురాబాద్:

సాగుకు దోహదపడే నీరే రైతుల పాలిట శాపంగా మారింది. రైతుల జీవితాలతో వాతావరణం ఇంకా చెలగాటమాడుకుంటూనే ఉంది. నమ్ముకున్న ప్రకృతే నట్టేట ముంచుతుండడంతో రైతన్న పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. చేతి కొచ్చిన పంటను అమ్ముకుని అప్పులు తీర్చి కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేసుకోవాలనుకున్న తమ కలలను కళ్లను చేస్తున్న వరుణ దేవుడిని నిందించాలో తమ తలరాతాలు ఇంతేనని చాలించుకోవాలో అర్థం కాని పరిస్థితిలో రైతాంగం కొట్టుమిట్టాడుతోంది. శాంతించినట్టే శాంతించిన వాన దేవుడు అక్కడక్కడ తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉన్నాడు. శుక్రవారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలో కురిసిన వర్షం రైతులను మళ్లీ నష్టాల బారిన పడేసింది. మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన వర్షం ప్రభావంతో మళ్లీ ధాన్యం తడిచిపోయాయి. ఇప్పటికే కురిసిన వానలతో తడిసిపోయిన ధాన్యాన్ని ఎండబెట్టే పనిలో నిమగ్నం అయ్యారు రైతులు. రెండు మూడు రోజులుగా వర్షానికి బ్రేకు పడడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న రైతులపై మరో సారి వరుణుడు పిడుగు పడేశాడు. శుక్రవారం నాటి అకాల వర్షం కారణంగా ఇక్కడి రైతుల దయనీయ స్థితి ఎలా ఉందంటే ఒక్క ఈ రైతు కష్టాన్ని కళ్లారా చూస్తే అర్థమవుతుంది. మండలంలోని సిర్సపల్లికి చెందిన రైతు బాబు రాములు నాలుగు ఎకరాల్లో వరి పంట వేశాడు. చేతికొచ్చిన పంటను ఎండబెట్టేందుకు సమీపంలోని శివాలయంలో ఆరబోశాడు. ఒకట్రెండు రోజుల్లో తేమ శాతం తగ్గిపోయిన తరువాత పంట అమ్ముకుందామని ఆశిస్తున్న క్రమంలో శుక్రవారం సాయంత్రం కురిసిన చెడగొట్టు వాన అతని జీవితంతో చెలగాటమాడింది. ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షపు వరద నీటిలో శివయ్య ఆలయ ప్రాంగణం నుండి సమీపంలోని చెరువులోకి కొట్టుకపోయాయి. వర్షం తగ్గిన తరువాత చెరువులోకి కొట్టుకపోయిన ధాన్యాన్ని సేకరిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టిస్తోంది. ఇలాంటి దయనీయమైన స్థితి ఎవరికీ రాకూడదంటూ రైతు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తీరు అందరిని కలిచివేస్తోంది.

You cannot copy content of this page