జెట్టక్కను సాగనంపుతున్న పల్లె జనం

ఏటా ఈ తంతు నిర్వహిస్తున్న గ్రామాలు

దిశ దశ, జగిత్యాల:

తమ పూర్వీకుల నుండి వస్తున్న ఆచారాన్ని మాత్రం వారు వీడకుండా పాటిస్తున్నారు. ఆధునిక పోకడలతో గత కాలపు నాటి ఆనవాయితీలకు చాలా మంది స్వస్తి పలికినా… నేటికీ కొందరు వాటిని సాంప్రాదాయ బద్దంగా పాటిస్తునే ఉన్నారు. నేటి తరానికి విచిత్రమని అనిపించినా తమ పెద్దల నుండి వారసత్వంగా వచ్చినందున ఖచ్చితంగా పాటించి తీరుతున్నారు వారు. గమ్మత్తుగా అనిపిస్తున్నా ఊరంతా ఏక కాలంలో చేయాల్సిన ఈ తంతును పూర్తి చేశారు.

జెట్టక్కను సాగనంపుడు…

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో తరతరాలుగా సాగుతున్న సాంప్రాదాయం ఇది. ఏటా వర్షాకాలానికి ముందు ఆచారం ప్రకరాం జెట్టక్కను ఊరి నుండి సాగనంపే కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ముందుగా గ్రామ దేవత అయిన పోశమ్మ తల్లికి మొక్కులు తీర్చుకుని చివరన జెట్టక్కను తరిమేసే ప్రక్రియను నిర్వహిస్తారు. గ్రామస్థులంతా కలిసి చీపుర్లు, చాటలు, పాత బట్టలు పట్టుకుని ఒకరిపై ఒకరు చీపుర్లతో రాసుకుంటూ గ్రామ పొలిమేరల వరకూ వచ్చి వాటన్నింటిని పడేస్తారు. అక్కడి నుండి నేరుగా గోదావరి నదికి వెల్లి స్నానాలు ఆచరించి తమ గ్రామంలోకి అడుగు పెడుతుంటారు. తమ పూర్వీకుల నుండి ఆచారంగా వచ్చిన ఈ విధానాన్ని ఏటా ఖచ్చితంగా ఆచరించి తీరుతామని మల్లాపూర్ మండలంలోని పలు గ్రామాల ప్రజలు చెప్తున్నారు. గ్రామానికి పట్టిన జెట్టక్క తొలగిపోయి ఏడాదంతా ప్రజలంతా సుఖ శాంతులతో జీవిస్తారని, దీర్ఘ కాలిక సమస్యలకు తావుండదని నమ్ముతుంటారు. ఇప్పటికీ తెలంగాణ పల్లెల్లోని వయసు పై బడిన వారు ఎవరిపై అయినా తిట్లదండకం మొదలుపెట్టినప్పుడు అందులో జెట్ట పట్టినట్టు పట్టినావు నా పాణానికి అంటూ ఉంటుంటారు. దరిద్రాన్ని, అనారోగ్యాన్ని పంచె జెట్టక్కను ఏటా ఊరి నుండి వెల్లగొడితే మంచి జరుగుతుందని పూర్వ కాలం నుండి నమ్ముతుండడం వల్ల ఇఫ్పటికీ ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు.

విడివిడిగా…

అయితే ఇటీవల కాలంలో ఈ పద్దతిని ఒకటి రెండు గ్రామాల్లో మాత్రమే పాటిస్తున్నారని మిగతా గ్రామాల్లో ఎవరి కులాల వారిగా, కుటుంబాల వారిగా తంతును పూర్తి చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. గతంలో అయితే ఊరంతా ఏక తాటిపై నడుస్తూ ఈ పద్దతిన జీవనం సాగించేందుకు ప్రాధాన్యత ఇచ్చేవారని చెప్తున్నారు. మల్లాపూర్ మండలంలోని పాత దామరాజు పల్లిలో గురువారం ఈ తంతును నిర్వహించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గ్రామమంతా కలిసి చేయడం వల్ల ఐకమత్యం పెరగడంతో పాటు అందరూ కలివిడిగా జీవించే పద్దతి కూడా అలవర్చుకునే వారని పెద్దలు చెప్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణ పల్లెల్లో తరాలుగా వస్తున్న మరో ఆనవాయితీ వెలుగులోకి రావడంతో నేటి తరానికి విచిత్రంగా మారిందనే చెప్పాలి.

You cannot copy content of this page