ఆర్బీఐ కన్నా ముందే బ్యాన్…

రూ. 2వేల నోటు వద్దంటున్న వ్యాపారులు

కొన్ని చోట్ల సామాన్యులకు చుక్కలు

దిశ దశ, మానకొండూరు:

పేదోడి చేతిలో మిగిలిన ఒకటి అరా పెద్ద నోట్లు చిల్లరగా మార్చుకోవడం కష్టంగానే మారింది. రిజర్వూ బ్యాంక్ గడువు విధించినా వ్యాపారులు మాత్రం తాము తీసుకోమని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. దీంతో సామాన్యుడు పెద్ద నోటును మార్చుకునేందుకు ఇబ్బందులు పడకతప్పడం లేదు. ఇటీవల రిజర్వూ బ్యాంక్ రూ. 2 వేల నోట్లను రద్దు చేస్తున్నామని కరెన్సీని ఎక్స్ఛేంజీ చేసుకునేందుకు సెప్టెంబర్ 30 వరకూ గడువు విధించినసంగతి తెలిసిందే. దీంతో సామాన్యుల వద్ద మిగిలిన పెద్ద నోట్లు ఇచ్చి ఏవైనా వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి షాకిస్తున్నారు వ్యాపారులు. ఆర్బీఐ సెప్టెంబర్ 30 వరకూ చెలామణిలో రూ. 2 వేల నోటు ఉంటుందని ప్రకటించినా కొంతమంది వ్యాపారులు మాత్రం వాటిని ముందుగానే బ్యాన్ చేసేశారు.

రూ. 2 వేల నోటు రద్దు తర్వాత…

అయితే భారత రిజర్వూ బ్యాంకును ఇటీవల రద్దు చేసి క్లీన్ నోట్ పాలసీ చేపట్టినట్టు వివరించింది. ఈ నిర్ణయం బ్లాక్ మనీ ఉన్న వాళ్లపై ఎలాంటి ప్రభావం చూపుతున్నదో లేదో తెలియదు కానీ సామాన్యులకు మాత్రం ఇబ్బందుల్లోకి నెట్టేస్తోందని చెప్పక తప్పదు. అత్యవసర సమయాల్లో ఉపయోగపడతాయని, సెంటిమెంట్ గా ఫీలయి కొంతమంది ఒకటి అరా నోట్లను తమ వద్ద దాచిపెట్టుకుంటుంటారు. భవిష్యత్తులో ఈ కరెన్సీ చెల్లవని ఆర్బీఐ ప్రకటించిన తరువాత 2 వేల నోట్లు ఉన్న వారు ఎవైనా వస్తువులు కొనుక్కునేందుకు వెల్తే కొన్ని ప్రాంతాల్లోని వ్యాపారులు వాటిని తీసుకునేందుకు విముఖత చూపుతున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ పద్దతి సరికాదని ఎవరైన వినియోగదారులు అనగానే మా ఓనర్ ఎలా చెప్తే అలా నడుచుకుంటామని నోటు తిరిగి ఇచ్చేస్తున్నారు. దీంతో సామాన్యులు చేసేదేమి లేక వెనుదిరుగుతున్నారు. కొన్ని పెట్రలో బంకుల్లో అయితే 2 వేల నోట్లు ఇచ్చిన వారికి కనీసం రూ. 15 పెట్రోల్ లేదా డిజీల్ కావాలంటనే తీసుకోవాలని లేకుండా తిప్పి పంపించేయాలని చెప్తున్నారు. దీంతో సెప్టెంబర్ 30కి ముందు కొన్ని ప్రాంతాల వ్యాపారులు రూ. 2 నోట్లను అనధికారికంగా బ్యాన్ చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి.

మిగిలివి ఎన్నో..?

దేశంలో డిమానిటైజేషన్ తరువాత 13 వేల కోట్ల వివిధ రకాల నోట్లు చెలామణిలో ఉండగా ఒక్క రూ. 2 వేల నోట్లు మాత్రం 2.14 కోట్ల వరకూ ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా ఈ కరెన్సీ నోట్లలో 90 నుండి 95 శాతం వరకు బ్లాక్ మనీ చేసే పెద్దల చీకటి గదుల్లో బంది అయిపోయాయి. 2016లో చేపట్టిన పెద్ద నోట్ల రద్దు తరువాత పుట్టల్లో దాక్కున్న 2 వేల నోట్ల కట్టలు బయటకు రాకపోవడంతో ఆర్బీఐ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. 2018 నుండి రూ. 2 వేల నోట్లను ముద్రించడం ఆపేసి ఇటీవల వాటిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో లక్షల కోట్లలో నల్ల ధనం దాచుకున్న బడా బాబులను ఇరుకున పెట్టే విధంగా ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నప్పటికీ, సామాన్యుల వద్ద ఉన్న తక్కువ శాతం నోట్లను మార్చుకునేందుకు గడువు ఉన్నా వ్యాపారులు మాత్రం ససేమిరా అంటున్నారు. దీంతో వారు 2 వేల నోట్లను బ్యాంకులకు వెల్లి మార్చుకోవల్సిన పరిస్థితి ఏర్పడగా ఇందు కోసం ఉపాధి కోసం చేస్తున్న పనికి ఓ రోజు సెలవు పెట్టాల్సి వస్తోందన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

You cannot copy content of this page