దిశ దశ, హైదరాబాద్:
సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పొన్నం ప్రభాకర్ కు పార్టీలో సముచిత స్థానం కల్పించాలని కోరుతూ కరీంనగర్ లోకసభ పరిధిలోని నాయకులు గాంధీ భవన్ కు వెళ్లారు. ఆదివారం గాంధీ భవన్ కు చేరుకున్న ఆయా ప్రాంతాల నాయకులు జిల్లాకు చెందిన ముఖ్య నాయకునికి ఎన్నికల కమిటీలో ప్రాధాన్యత కల్పించాలని అభ్యర్థించారు. కరీంనగర్, వేములవాడ, చొప్పదండి, సిరిసిల్ల, హుజురాబాద్, హుస్నాబాద్, మానకొండూరు నియోజకవర్గానికి చెందిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గాంధీభవన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా కొత్త మంది కార్యకర్తలు అర్థనగ్న ప్రదర్శనతో గాంధీ భవన్ ముందు బైఠాయించారు. కరీంనగర్ నాయకులు చేరుకున్న క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా గాంధీభవన్ కు చేరుకోవడంతో ఆయనను కలిసిన కరీంనగర్ నేతలు పొన్నం ప్రభాకర్ కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే విషయంలో దృష్టి సారించాలని అభ్యర్థించారు. తమ నాయకుడిని విస్మరించకుండా పార్టీ పదవులు కట్టబెట్టినట్టయితే పార్టీకి కూడా లాభం చేకూరుతుందని వారు వివరించారు. అనంతరం రాష్ట్ర ఇంఛార్జీ మాణిక్యం ఠాకూర్ ను కూడా కలిసి కాంగ్రెస్ నాయకులు పొన్నం ప్రభాకర్ కు కీలక కమిటీల్లో బాధ్యతలు అప్పగించలేదని దీనివల్ల తమకు గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోనే సీనియర్ నేత అయిన పొన్నం ప్రభాకర్ కు బాధ్యతలు అప్పగించినట్టయితే పార్టీ కూడా బలోపేతం అవుతుందని వివరించారు. పొన్నంకు బాధ్యతలు అప్పగించే విషయాన్ని పరిశీలిస్తామని ఇంఛార్జీ మాణిక్యం ఠాకూర్ హామీ ఇచ్చినట్టుగా జిల్లా కాంగ్రెస్ నాయకులు వివరించారు.
Disha Dasha
1884 posts
Next Post