తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్…
దిశ దశ, హైదరాబాద్:
లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ‘మాదిగ’ సామాజిక వర్గం డిమాండ్ ఇబ్బందికరంగా మారింది. తమ సామాజిక వర్గానికి చెందిన వారికి లోకసభ ఎన్నికల్లో అవకాశం కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి పెట్టడం లేదన్న ఆందోళనలు మొదలయ్యాయి. అభ్యర్థిత్వం ఖరారుకు ముందే ఆయా లోకసభ నియోజకవర్గాల్లో ‘మాదిగ’ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులుగా ప్రకటించాలన్న డిమాండ్ బలంగా వినిపించింది. కొన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించిన తరువాత ఈ ఆందోళన న్యూ ఢిల్లీని కూడా తాకడం గమనార్హం. ఏఐసీసీ కార్యాలయం వద్ద మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకులు నిరసనలు చేపడ్తున్నారు. రెండు రోజులుగా వీరు ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తున్నారు. ముఖ్యంగా పెద్దపల్లి, వరంగల్ లోకసభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా తమ సామాజిక వర్గానికి చెందిన వారికే అవకాశం ఇవ్వాలంటున్నారు. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కలిసి తెలంగాణలో తమ సామాజిక వర్గాన్ని విస్మరించిన తీరును వివరించే ప్రయత్నం కూడా చేయాలని భావిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో లోకసభ అభ్యర్థుల మార్పులు చేర్పులు ఉంటాయా లేకపోతే ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులనే కొనసాగిస్తారా అన్న చర్చ సాగుతోంది.
కడియం ఎంట్రీతో..?
అయితే రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల ప్రభావం కొన్ని నియోజకవర్గాలపై పడుతుందన్న నమ్మకంతో తమ పోరాటాన్ని ఉధృతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరంగల్ లోకసభ అభ్యర్థిగా కడియం శ్రీహరికే అవకాశం ఇవ్వనున్నట్టుగా స్పష్టం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్దపల్లి టికెట్ విషయంలో అధిష్టానం పునరాలోచన చేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ‘మాల’ సామాజిక వర్గం వారికే టికెట్లు కెటాయించడం వల్ల రాష్ట్రంలో ‘మాదిగ’ సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ వివక్ష చూపిందన్న అంశాన్ని లేవనెత్తాలని భావిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో మెజార్టీ ఓటర్లు ఉన్న ‘మాదిగ’ సామాజిక వర్గం నుండి ప్రతికూలత ఎదురయ్యే ప్రమాదం ఉంటుందన్న విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకళ్లాలని యోచిస్తున్నారు. తమ వ్యూహం సక్సెస్ అయితే అభ్యర్థులను ఖచ్చితంగా మారుస్తారన్న నమ్మకం పెరగడంతో పాటు ఇదే విషయంపై ప్రచారం కూడా ఊపందుకుంది. మరో వైపున పెద్దపల్లిలోని మెజార్టీ సెగ్మెంట్ల నుండి వంశీకృష్ణకు సానుకూలత లేకపోవడాన్ని కూడా అధిష్టానం ముందు ఉంచినట్టయితే తమ సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యత లభిస్తుందని ఆశిస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందే వివేక్ కుటుంబానికి ఎంపీ టికెట్ ఇస్తామని అధిష్టానం మాట ఇవ్వడంతో పాటు… ఇప్పటికే అభ్యర్థిని కూడా ప్రకటించిన నేపథ్యంలో మరోకరి పేరును ఆమోదించేందుకు నాయకత్వం సాహసిస్తుందా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీ కృష్ణ ప్రచారం కూడా ప్రారంభించడంతో పాటు… ఏఐసీసీ ముఖ్య నాయకుల అండదండలు కూడా వంశీకే ఉన్నట్టుగా స్పష్టం అవుతోంది. గతంలో ఇక్కడి నుండి వంధీ తాత జి వెంకటస్వామి కూడా చాలాసార్లు ప్రాతినిథ్యం వహించినందున ఆయన మనవడికి ఇచ్చామన్న విషయాన్ని లేవనెత్తే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఇతర రిజర్వేషన్ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు ఈ సామాజిక వర్గానికి చెందిన వారు లేరన్న వాదనలు అధిష్టానం ముందు వినిపిస్తున్నట్టుగా సమాచారం. ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత కల్పించలేదన్న నైరాశ్యానికి గురవుతున్న ‘మాదిగ’ సామాజిక వర్గానికి ఎలాంటి ప్రాధాన్యత కల్పించే అవకాశ ఉంది..? వారిని సముదాయించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకుసాగబోతోందన్నదే సవాల్ గా మారింది.