పార్టీ పెట్టాలనుకున్నది నిజమే: పొంగులేటి

దిశ దశ, న్యూఢిల్లీ:

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో కొత్త పార్టీ ఏర్పాటు చేయాలనుకున్న అంశాన్ని పరిశీలించింది నిజమేనని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం న్యూ ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్డే, అధినేత రాహుల్ గాంధీతో పాటు పలువురు ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కొత్త పార్టీ పెట్టాలన్న ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించామని దాదాపు రెండు నెలల పాటు కసరత్తులు కూడా చేశామన్నారు. మేథో మథనం చేసిన సందర్భంగా లాభ నష్టాలు, ప్రజల నుండి ఎలాంటి సానుకూలత రానుంది తదితర అంశాలపై చర్చించామన్నారు. అయితే ఒకే ఒక్క కీలకమైన అంశాన్ని దృష్టిలో పెట్టుకుని తాము కొత్త పార్టీ అవిర్భావం విషయంలో వెనక్కి తగ్గినట్టు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. రాష్టంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక ఓటు చీలినట్టయితే తీరని నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందని, ఇది గులాభి పార్టీకే లాభిస్తుందన్న కారణంతోనే నూతన పార్టీ ఏర్పాటు అంశాన్ని వెనక్కి తీసుకున్నామని ప్రకటించారు.

రెండు పార్టీలు స్వాగతించాయి!

తమను పార్టీలో చేరాలని కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలు కూడా స్వాగతించాయని అయితే తాము మాత్రం కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గుచూపామని వెల్లడించారు. బీజేపీ నాయకులు కూడా సంప్రదింపులు జరిపినప్పటికీ అన్ని విషయాలపై సమాలోచనలు జరిపి చివరకు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాల్సి వచ్చిందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జులై 2న ఖమ్మం జిల్లాలో జరగనున్న భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్సయిందన్నారు.

సోనియమ్మ రుణం తీర్చుకునేందుకే: జూపల్లి

తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకే ఈ సారి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, రాష్ట్రంలో నెలకొన్న అవినీతి పాలనను అంతమొందించేందుకు కాంగ్రెస్ పక్షాన నిలబడాలని జూపల్లి పిలుపునిచ్చారు. తాను పార్టీలో చేరేందుకు జులై 14 లేదా 16న పాలమూరు జిల్లాలో నిర్వహించే భారీ బహిరంగ సభలో అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు వివరించారు.

You cannot copy content of this page