టాలీవుడ్‌లో ఐటీ రైడ్స్ కలకలం.. ప్రముఖ నిర్మాణ సంస్థపై దాడులు

టాలీవుడ్‌లో ఐటీ రైడ్స్ కలకలం రేపుతోన్నాయి. ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో ఐటీ దాడులు జరగ్గా.. తాజాగా మరో నిర్మాణ సంస్థలో ఐటీ సోదాలు ప్రకంపనలు రేపుతోన్నాయి. బుధవారం టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్‌ కార్యాలయంలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. హారిక హాసిని సంస్థ నిర్మాత నాగవంశీ ఇళ్లు, కార్యాలయాలతో పాటు సంస్థ కార్యాలయంలో ఐటీ సోదాలు జరిగాయి.

సారథి స్టూడియోలో ఓ సినిమా షూటింగ్‌లో నాగవంశీ ఉన్నారు. ఈ సమయంలో స్టూడియోలోకి వచ్చిన ఐటీ అధికారులు.. నాగవంశీని కారులో ఆయన ఇంటికి తీసుకెళ్లారు. ఆయన ఇళ్లు, కార్యాలయంలో ఐటీ సోదాలు జరిపారు. అలాగే హారిక హాసిని క్రియేషన్స్ ఆఫీసులో కూడా సమాంతరంగా దాడులు చేపట్టారు. హారిక హాసిని క్రియేషన్స్ కార్యాలయంలో ఐటీ సోదాలు జరపడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా ఒకసారి దాడులు జరిపారు. ఇప్పుడు మరోసారి సోదాలు జరపడం టాలీవుడ్‌లో కలకలం సృష్టిస్తోంది.

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ హై హోమ్ గ్రూపుతో హారిక హాసిని క్రియేషన్స్ సంస్థకు లావాదేవీలు ఉన్నాయి. అలాగే ఫోనిక్స్ గ్రూప్ సంస్థతో కూడా ఈ నిర్మాణ సంస్థకు లావాదేవీలు ఉన్నాయి. దీని వల్లనే హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలో ఐటీ సోదాలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ మధ్య హారిక హాసిని క్రియేషన్స్ నుంచి ఎలాంటి సినిమాలు రాలేదు. ప్రస్తుతం కొన్ని చిన్న సినిమాలు ఆ సంస్థ నిర్మిస్తోంది. ఐటీ దాడుల అంశంపై నిర్మాత నాగవంశీ స్పందించడం లేదని తెలుస్తోంది. ఆయన ఫోన్ స్విచ్చాప్ చేసినట్లు చెబుతున్నారు.ఐటీ దాడులపై స్పందించేందుకు నిర్మాణ సంస్థ సిబ్బంది కూడా సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఐటీ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఐటీ దాడుల్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

You cannot copy content of this page