అతికించి… హెచ్చరించి… ముచ్చటగా మూడోసారి…

గ్రానైట్ ఇండస్ట్రీ అసోసియేషన్ సభ్యుల డిమాండ్…

దిశ దశ, కరీంనగర్:

గ్రానైట్ ఇండస్ట్రీ అసోసియేషన్ విబేధాలు ఇంకా సమిసిపోనట్టుగా ఉంది. మాజీ మంత్రి గంగుల కమలాకర్ బావ శంకర్ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న ఈ కమిటీ ఎన్నికలు జరపాలన్న డిమాండ్ వినిపిస్తున్న అసోసియేషన్ సభ్యులు ఈ సారి లేఖను ఏకంగా ఆఫీసులో అతికించారు. ముచ్చటగా మూడోసారి తమ డిమాండ్ వినిపిస్తున్న అసోసియేషన్ మెంబర్లు మరోసారి అధ్యక్షుని తీరును తప్పు పట్టారు. మంగళవారం కరీంనగర్ జిల్లా గ్రానైట్ ఇండస్ట్రీ అసోసియేషన్ సమావేశంలో ఫ్యాక్టరీల యజమానులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు జరిగిన రెండు సమావేశాల్లో కూడా సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతున్నా అధ్యక్షుడు పట్టించుకోవడం లేదని సభ్యులు ఆరోపించారు. ఫిబ్రవరి 15న, మార్చి 4న జరిగిన సమావేశాల్లో జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను పెడచెవిన పెడుతున్నారని సభ్యులు వ్యాఖ్యానిస్తున్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు వాట్సప్ ద్వారా కూడా స్పందించడం లేదని గత సమావేశంలోనే సభ్యులు విమర్శించారు. మార్చి 4న జరిగిన సమావేశంలో డెడ్ లైన్ విధించినప్పటికీ జనరల్ బాడీ సమావేశం మాత్రం ఏర్పాటు చేయకపోవడంపై వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మంగళవారం జరిగిన సమావేశంలో మరో వారం రోజుల పాటు అధ్యక్షుకుడు శంకర్ కు సభ్యులు గడువు విధించారు. ఈ నెల 20న జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఇందుకు సంబంధించిన లేఖను కూడా వారు అసోసియేషన్ కార్యాలయంలో అతికించడం గమనార్హం. అయితే గత ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలోనే సభ్యులు పలు అంశాలను లేవనెత్తడంతో పాటు ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్ కూడా వినిపించారు. ఆ తరువాత నుండి కమిటీ అధ్యక్షుని నుండి ఎలాంటి స్పందన రాకపోవడంపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసోసియేషన్ కు సంబంధించిన నిధుల ఖర్చుతో పాటు ఇతరాత్ర అంశాలపై అప్పుడు నిలదీసిన తరువాత జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ నెల రోజులు కావస్తున్నా అసోసియేషన్ సమావేశం ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం లేదని సభ్యులు వాపోతున్నారు. ముచ్చటగా మూడో సారి సభ్యులు అధ్యక్షునికి లేఖ రాసి అతికించడం సంచలనంగా మారింది. అసోసియేషన్ ప్రసిడెంట్ నుండి ఎలాంటి స్పందన వస్తుందోనన్నదే ప్రశ్నార్థకంగా మారింది. జనరల్ బాడీ సమావేశం ఎందుకు పెట్టడం లేదన్నదే అర్థం కాకుండా పోతోందని సభ్యులు వ్యాఖ్యానిస్తున్నారు.

You cannot copy content of this page