దిశ దశ, హైదరాబాద్:
రికమండేషన్లకు మంగళం పాడి… పని తీరే ప్రామాణికంగా బదిలీల ప్రక్రియ కొనసాగిస్తే ఎలా ఉంటుంది..? పారదర్శకమైన విధానాన్ని అమలు చేసినట్టయితే రేవంత్ రెడ్డి సర్కార్ చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయే అవకాశం ఉంటుంది కదా..? ఉద్యోగుల్లో నెలకొన్న నైరాశ్యానికి కూడా ఈ విధానంతో పుల్ స్టాప్ పెట్టే అవకాశం కూడా తెలంగాణ ప్రభుత్వానికి వస్తుంది కదా అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
బలవంతుడిదే రాజ్యం…
ఇప్పటి వరకు బలవంతుడు, పలుకుబడి ఉన్న వారిదే రాజ్యం అన్నట్టుగా సాగుతోంది కొన్ని ప్రభుత్వ శాఖల్లో. ఈ విధానం వల్ల మారమూలన ఉండే వారు అక్కడికే పరిమితం అవుతుంటే అర్బన్ ఏరియాల చుట్టే తిరుగుతూ విధులు నిర్వర్తిస్తున్న వారు తమ ఇమేజ్ పెంచుకుంటూ అలాగే కొనసాగుతున్నారు. దీనివల్ల వివిధ ప్రభుత్వ శాఖల్లో సమ న్యాయం పాటిండచడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేవలం టీచర్లకు మాత్రమే అమలవుతున్న కౌన్సిలింగ్ విధానాన్ని ఇతర శాఖల్లో కూడా అమలు చేస్తే ఆయా విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికి న్యాయం జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా పోలీసు విభాగంలో ఈ విధానం అమలు చేసినట్టయితే శాంతి భద్రతల్లో నిరంతరం తలమునకలయ్యే పోలీసులకు వెసులుబాటు దొరుకుతుందని అంటున్న వారూ లేకపోలేదు. అలాగే రెవెన్యూతో పాటు పంచాయితీ రాజ్ శాఖలలో పాటు ఇతర శాఖల్లో కూడా కౌన్సిలింగ్ విధానంతో బదిలీ ప్రక్రియను కొనసాగిస్తే క్షేత్ర స్థాయిలో పనిచేసే అధికారులు, ఉద్యోగులకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీనివల్ల పారదర్శకమైన విధానం అమలయి అన్ని ప్రాంతాల్లో పని చేసే ప్రభుత్వ యంత్రాంగానికి న్యాయం చేకూర్చినట్టు అవుతుంది.
గత ప్రభుత్వం ఎఫెక్ట్…
స్వరాష్ట్ర కల సాకారం అయిన తరువాత ప్రధానమైన శాఖల్లో సిఫార్సు లేఖలకే ప్రాధాన్యం ఇవ్వడంలో ఇబ్బందులు తలెత్తాయి. పోలీసు శాఖలో అయితే కొంతమంది అధికారులు 10 ఏళ్లుగా లూప్ లైన్ విభాగాల్లోనే మగ్గిపోయిన పరిస్థితి ఎదురైంది. ప్రధానమైన శాఖల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొందన్నది వాస్తవం. దీంతో లైమ్ లైట్ పోస్టింగుల్లో ఉన్న వారు అధికార పార్టీ ముఖ్య నాయకులకు దగ్గరై బదిలీలు జరిగినప్పుడల్లా అర్బన్ ఏరియాలో డిమాండ్ ఉన్న పోస్టింగులతో సంబరపడిపోతే ఇమేజ్ అంతగా లేని వారు మాత్రం గ్రామీణ ప్రాంతాలకు పరిమితం కావల్సి వచ్చింది. టీచర్ల బదిలీల్లో అమలు చేస్తున్నట్టుగానే ఇతర శాఖల్లో కూడా కౌన్సిలింగ్ విధానం ఖచ్చితంగా అమలు చేసినట్టయితే అన్నింటా మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అధికార యంత్రాంగంలో అతి తక్కువ పర్సంటేజీ ఉండే వారి కోసం రికమండేషన్లకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మెజార్టీ అధికారయంత్రాగంలో వ్యతిరేకతను ప్రభుత్వం ముటగట్టుకుంటోంది. పని తీరు, గ్రామీణ ప్రాంతాల్లో పని చేయడం, లూప్ లైన్ విభాగాల్లో ఉంటున్న వారు, లైమ్ లైట్ పోస్టింగులతో సరిపెట్టిన వారు ఇలా పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని పాయింట్లు అలాట్ చేసి ఆన్ లైన్ కౌన్సిలింగ్ తో బదిలీల ప్రక్రియ కొనసాగిస్తే అన్ని వర్గాల ఉద్యోగుల్లోనూ ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కౌన్సిలింగ్ విధానాన్ని ముందుగా పోలీసు విభాగంలో అమలు చేయాల్సిందేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గత ప్రభుత్వంలా రికమండేషన్లకు ప్రాధాన్యత ఇచ్చినట్టయితే ఇప్పుడు కూడా శాంతి భద్రతల్లో ఉన్న వారు అలాగే కొనసాగుతూ… లూప్ లైన్లలో ఉన్న వారు ఆయా విభాగాలకే పరిమితయ్యే పరిస్థితి వస్తుంది. దీంతో శాంతి భద్రతల పరిరక్షణలో ఉపయోగించే చట్టాల అమలు, లాఠీలు, తుపాకుల వినియోగాన్ని కూడా లూప్ లైన్ విభాగంలోని వారు మర్చిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు. అత్యవసర పరిస్థితుల్లో వీరిని ఉపయోగించుకోవాలన్నా కూడా వారు అంతా యక్టివ్ గా పనిచేసే పరిస్థితులు కూడా ఉండవు. తెలంగాణ ప్రభుత్వం సమాజంపై ప్రభావితం చేసే శాఖల్లో పారదర్శకత కోసం కౌన్సిలింగ్ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేసినట్టియతే అటు ప్రభుత్వానికి ఇటు అధికర యంత్రాంగానికి అన్నింటా మేలు జరుగునుంది.