నేటి నుంచి ఎన్ఐఏ కోర్టులో కోడి కత్తి కేసు విచారణ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే కోడి కత్తి కేసు నిందితుడు శ్రీను విజయవాడ ఎన్ఐఏ కోర్టుకు వెళ్లారు. విశాఖ ఎయిర్‌పోర్టు అసిస్టెంట్ దినేష్ కుమార్ ప్రత్యక్ష సాక్షిగా ఇవాళ హాజరు కావాలని కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే దినేష్ కుమార్ హాజరు కాలేదు. తండ్రి మరణించడంతో కోర్టుకు హాజరు కాలేదని.. దినేష్ తరుపు న్యాయవాది తెలిపారు. దీంతో తదుపరి విచారణ ఫిబ్రవరి 15కు వాయిదా వేసింది. కాగా, తదుపరి విచారణకు బాధితుడు సీఎం జగన్ సైతం విచారణకు హాజరు కావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
2019 ఎన్నికలకు ముందు నాటి ప్రతిపక్ష నేత జగన్‌పై కోడి కత్తితో దాడి జరిగింది. ఈ ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. 2018లో జగన్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్నారు. ఆయన హైదరాబాద్‌లోని కోర్టుకు హాజరవ్వాల్సి ఉండటంతో దానికి ముందు రోజు మధ్యాహ్నమే విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆయన వీఐపీ లాంజ్‌లో ఉండగా.. వెయిటర్ సెల్ఫీ తీసుకుంటానని వచ్చి కోడి కత్తితో దాడి చేశాడు.
ఈ క్రమంలోనే జగన్ భుజానికి గాయమైంది. ఆయన హైదరాబాద్‌కు వచ్చి అక్కడ ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. కానీ తన గాయానికి 12 కుట్లు పడ్డాయి. ఈ దాడి కేసులో మొదటి ముద్దాయిగా జనిపల్లి శ్రీనివాసరావును పేర్కొన్నారు. ఎన్‌ఐఏ 2019లోనే చార్జిషీటు దాఖలుచేసింది. కానీ ఈ కేసు కోర్టు మెట్లెక్కేందుకు నాలుగేళ్లు పట్టింది. కోడికత్తితో తనపై దాడి చేయించారంటూ టీడీపీ ప్రభుత్వంపై జగన్‌తో పాటు వైసీపీ నేతలంతా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. మరోవైపు టీడీపీ నేతలు ఎన్నికల్లో విజయం సాధించేందుకు కోడికత్తి గేమ్ ఆడారంటూ ఆరోపించారు.