పీఎల్జీఏలో మరో హిడ్మా..!

అరన్‌పూర్ బ్లాస్టింగ్ స్కెచ్ ఈయనదే

దిశ దశ, దండకారణ్యం:

పీపుల్స్ గెరిల్లా ఆర్మీలో హిడ్మా వారసుడు చేరాడా..? అరన్‌పూర్ ఘటనలో కీలక భూమిక పోషించిన ఆయన్ను మావోయిస్టులు మరో అస్త్రంగా తీర్చిదిద్దారా..? పెడ్కా ఏరియాలో 11 మందిని మందుపాతరలో మట్టుబెట్టిన తరువాత ఈయన పేరు ప్రముఖంగా వినిపిస్తుండడంతో పీఎల్జీఏలో హిడ్మా వారసుడిని మావోయిస్టు పార్టీ రంగంలోకి దింపిందన్న చర్చ మొదలైంది.

సంచలనాలకు కేరాఫ్…

దండకారణ్య అటవీ ప్రాంతంలో తిరుగులేని పట్టు సాధించిన మావోయిస్టు పార్టీకి యుద్ద తంత్ర మెలుకువల్లో ఆరి తేరిన హిడ్మా సంచలనాకు కేరాఫ్ గా మారాడానే చెప్పాలి. అక్కడి అడవులపై అణువణువు పట్టున్న హిడ్మా బలగాలను మట్టబెట్టే స్కెచ్ వేయడంలో ఆరి తేరడమే కాకుండా లక్ష్యాలను ఛేదించడంలో కూడా దిట్ట. బాలల సంఘం సభ్యుడి నుండి పీఎల్జీఏ కమాండర్ స్థాయికి ఎదిగిన హిడ్మానే ఇప్పటి వరకు జరిగిన దాడులకు నేతృత్వం వహించాడు. పూర్వ బస్తర్ జిల్లాలో బలగాలను నిలవరించడంలో కీలక భూమిక పోషించిన హిడ్మా క్రాంతీకారీ జనతన్ సర్కార్ కు ఆయువు పట్టుగా నిలిచాడు. దండకారణ్యంలో ఏ దాడి జరిగినా హిడ్మా స్కెచ్ తోనే ఇది సాధ్యమైందన్న ప్రచారం జరిగింది. తాజాగా అరన్‌పూర్ బ్లాస్టింగ్ తో మరో పేరు తెరపైకి రావడం సంచలనం కాగా, హిడ్మా వారసున్ని మావోయిస్టు పార్టీ రంగంలోకి దింపినట్టుగా స్పష్టమవుతోంది.

జాగరగుండ జగదీష్..!

ఈ నెల 26న దంతెవాడ జిల్లా అరన్‌పూర్ సమీపంలోని పెడ్కా వద్ద పేల్చిన మందుపాతర ఘటనతో ఇప్పుడు మరో పేరు వెలుగులోకి వచ్చింది. మావోయిస్టు పార్టీ అమ్ముల పొదిలో తయారైన మరో అస్త్రాన్ని ఈ ఘటనలో వినియోగించినట్టుగా ప్రచారం జరుగుతోంది. దండకారణ్య అటవీ ప్రాంతంలో బలగాలను మట్టు బెట్టడమే లక్ష్యంగా ప్లాన్ వేసి అమలు చేయడంలో దిట్టగా పేరున్న హిడ్మా బాటలోనే ఈ పీఎల్జీఏ మెంబర్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అరన్‌పూర్ పేళుల్లలో జాగరగుండ జగదీష్ కీలక సూత్ర, పాత్ర ధారిగా చత్తీస్ గడ్ పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. బస్తర్ అటవీ ప్రాంతంలో చురుకైన మావోయిస్టుగా పని చేస్తున్న జగదీష్ ఇటీవలే పీఎల్జీఏకు బదిలీ అయ్యాడు. మొదట కాటే కళ్యాణ్ ఏరియా కమిటీలో యాక్టివ్ రోల్ పోషించిన ఈయన జాగరగుండ తూర్పు ప్రాంతం గ్రామానికి చెందిన వాడిగా పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. కాటే కళ్యాణ్ ఏరియా కమిటీలో పని చేసినప్పుడు జాగరగుండ జగదీష్ ముఖ్య భూమిక పోషించడం. భారీ లక్ష్యాలను ఛేదించడంలో సక్సెస్ అయ్యాడని ఇతనిపై రూ. 5 లక్షల రివార్డు కూడా ప్రభుత్వం ప్రకటించింది. జగదీష్ పీఎల్జీఏకు ప్రమోట్ అయిన తరువాత ముఖ్యమైన ఘటనలకు సూత్ర, పాత్రధారిగా వ్యవహరిస్తున్నట్టుగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అరన్‌పూర్ బ్లాస్టింగ్ తరువాత పోలీసులు నమోదు చేసిన కేసులో జగదీష్ తో పాటు 12 మందిపై కేసు నమోదు చేశారు. వీరందరిపై యూఏపీఏ యాక్ట్ సెక్షన్లలో కూడా ఎఫ్ఐఆర్ జారీ చేశారు.

ప్రత్యామ్నాయ అన్వేషణలో…?

అయితే అరన్‌పూర్ ఘటనలో జాగరగుండ జగదీష్ పేరు వెలుగులోకి రావడంతో మరో కొత్త చర్చకు కూడా తెర తీసినట్టయింది. గత కొంత కాలంగా పీఎల్జీఏ కమాండర్ హిడ్మా అనారోగ్యంతో బాధపడుతున్నాడన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఈ క్రమంలో హిడ్మాకు మెరుగైన చికిత్స అందించేందుకు మావోయిస్టు పార్టీ అగ్ర నాయకత్వం ప్రయత్నిస్తోందని, ఆయనను తెలంగాణాకు కూడా తీసుకొచ్చే అవకాశం కూడా ఉందన్న చర్చ కూడా జరిగింది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర, చత్తీస్ గడ్ సరిహద్దు ప్రాంతాల్లో తెలంగాణ పోలీసులు హై అలెర్ట్ అయ్యారు. కూంబింగ్ ఆపరేషన్లను ముమ్మరం చేసి పొరుగు రాష్ట్రాల నుండి వచ్చే ప్రతి ఒక్కరిపై నిఘా వేశారు. మరో వైపున గోదావరి పరివాహ ప్రాంతాలకు వలస వచ్చిన గొత్తి కొయల గూడెలపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. హిడ్మా పట్టుబడితే పీఎల్జీఏ పూర్తి స్థాయిలో బలహీన పడుతుందన్న వాదనలు కూడా ఉన్న నేపథ్యంలో చత్తీస్ గడ్ పోలీసులు కూడా అతని కోసం వేట మొదలు పెట్టారు. కానీ హిడ్మా ఆచూకి మాత్రం లభ్యం కాలేదు. కొన్ని నెలల క్రింత హిడ్మా తీవ్ర అనారోగ్యం పాలయ్యడన్న ప్రచారం కూడా జరిగినప్పటికీ మావోయిస్టు పార్టీ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ తాజాగా అరన్‌పూర్ సమీపంలో మందుపాతర పేల్చిన ఘటనకు ముఖ్య కారకుడు జాగరగుండా జగదీష్ అని తేలడంతో హిడ్మా ప్లేస్ ను భర్తీ చేసే పనిలో మావోయిస్టు పార్టీ నాయకత్వం నిమగ్నం అయినట్టుగా అనిపిస్తోంది. హిడ్మా లాంటి అతి చురుకైన నాయకుడిలా యాక్టివ్ రోల్ పోషించేందుకు జగదీష్ ను సిద్దం చేస్తున్నట్టుగా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే హిడ్మాకు చేదోడుగా ఉండేందుకు మరోకరిని సిద్దం చేసుకున్నట్టయితే పీఎల్జీఏ మరింత పటిష్టమవుతుందని మావోయిస్టు పార్టీ భావిస్తోందేమోనన్న చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా అరన్‌పూర్ ఘటనతో జగదీష్ పేరు వెలుగులోకి రావడం మాత్రం అటు మావోయిస్టు పార్టీ ఓ సంకేతాన్ని పంపించినట్టు కాగా… ఇటు నిఘా వర్గాలు కూడా అప్రమత్తం చేసినట్టయింది.

You cannot copy content of this page