జీవన్ రెడ్డి అభ్యర్థనను మన్నించిన చిన్నారి…

దిశ దశ, జగిత్యాల:

జగిత్యాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి జీవన్ రెడ్డి అభ్యర్థనను ఓ చిన్నారి మన్నించారు. నెల రోజుల క్రితం ఆయన ఇచ్చిన పిలుపునకు స్పందించిన వారే లేరు కానీ ఓ చిన్నారి మాత్రం తనవంతు సాయాన్ని అందించారు. తాతయ్య నా కిడ్డి బ్యాంకు డబ్బులు నీ ప్రచారం కోసం తీసుకో అంటూ గిఫ్ట్ ఇచ్చేశారా చిన్నారి. చిన్న వయసులోనే పెద్ద మనసు చేసుకుని తనకు ఆర్థిక సాయం చేసిన చిన్నారిని జీవన్ రెడ్డి అక్కున చేర్చుకుని సంభ్రమాశ్యర్యానికి గురయ్యారు. అసలు విషయంలోకి వెల్తే… ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం జగిత్యాల సమీపంలోని చల్ గల్ గ్రామానికి చేరుకున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. జీవన్ రెడ్డి వద్దకు చేరుకున్న చిన్నారి తన కిడ్డి బ్యాంకును ఇచ్చి ఎన్నికల ఖర్చు కోసం వినియోగించుకోవాలని సూచించారు. గ్రామానికి చెందిన శ్రీనిత్య ఇచ్చిన కిడ్డి బ్యాంకును చూసిన ఆయన ఒక్కసారిగా ఆనందంలో తేలియాడారు. కిడ్డి బ్యాంకును ఓపెన్ చేసి అందులోని డబ్బులు లెక్కించగా రూ. 4791లు ఉన్నాయి. తన ఎన్నికల ప్రచారం కోసం కిడ్డి బ్యాంకులో దాచుకున్న డబ్బును తనకు సాయంగా ఇచ్చిన శ్రీనిత్యను ఎత్తుకుని అభినందించారు. చిట్టి చేతులతో తనకు అందించిన సాయం కన్నా పెద్ద మనసు చేసుకున్న శ్రీనిత్య అందిస్తున్న సాయాన్ని ప్రత్యక్ష్యంగా చూసిన కాంగ్రెస్ నాయకులు కూడా ఆశ్యర్యానికి గురయ్యారు.

నాడు జీవన్ రెడ్డి అభ్యర్థన…

అయితే దాదాపు నెల రోజుల క్రితం జీవన్ రెడ్డి గ్రామాల్లో తిరుగుతూ ప్రజలతో మమేకం అయ్యే కార్యక్రమంలో నిమగ్నం అయ్యారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి టీఆర్ నగర్ లోని మైనార్టీలతో మాట్లాడుతూ… తనకు ఓటు వేసి రూ. వంద ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఆర్థిక వనరుల విషయంలో తాను వెనకబడి ఉన్నందున జగిత్యాల ప్రజలకు తనకు ఓటువేసి రూ. వంద చొప్పున సాయం చేయాలని అభ్యర్థించారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో జీవన్ రెడ్డి ఊరు వాడ కలియ తిరుగుతూ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోజు టిఆర్ నగర్ లో చేసిన అభ్యర్థనకు అనుగుణంగా నియోజకవర్గ ప్రజల నుండి సానుకూల స్పందన రాలేదు కానీ చల్ గల్ గ్రామానికి చెందిన శ్రీనిత్య మాత్రం తనవంతు సాయం అందించింది.

You cannot copy content of this page