ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి షాకిచ్చిన బల్దియా: ఫ్లెక్సీల తొలగింపుపై ఆగ్రహం

దిశ దశ, జగిత్యాల:

జగిత్యాల నియోజకవర్గంలో ప్రధాన నాయకుల వర్గ పోరు అప్పుడే తెరపైకి వస్తోంది. ఎమ్మెల్యే చేరికపై కినుక వహించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని అధిష్టానం బుజ్జగించినప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఆయనకు మధ్య ఇంకా సయోధ్య కుదరనట్టుగానే కనిపిస్తోంది. తాజాగా జగిత్యాల పట్టణంలో చోటు చేసుకున్న ఘటన ప్రత్యక్ష్య ఉదాహరణగా మారింది. పట్టణంలోని ఎనిమిదో వార్డులో బేడ బుడగ జంగాల కాలనీల బోనాల పండు సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫోటోలు ముద్రించిన ఫెక్సీలను గురువారం ఏర్పాటు చేశారు. అయితే అనూహ్యంగా జగిత్యాల మునిసిపల్ సిబ్బంది ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న సీనియర్ నేత జీవన్ రెడ్డి అక్కడకు చేరుకుని సిబ్బందిని నిలదీశారు. మూడు రోజుల తరువాత ఉన్న కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలు ఈ రోజు ఉదయమే ఏర్పాటు చేస్తే వెంటనే ఎలా తొలగిస్తున్నారంటూ ప్రశ్నించారు. దీంతో మునిసిపల్ అధికారులతో జీవన్ రెడ్డి ఫోన్లో మాట్లాడుతున్న క్రమంలో ఫ్లెక్సీలు ఎవరు తొలగించమన్నారని అడగగా టీపీఓ తేజస్విని చెప్పారని మునిసిపల్ సిబ్బంది వెల్లడించారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్సీ తాను కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఆ తరువాత జీవన్ రెడ్డి అనుచరులు, స్థానికులు కూడా ఈ అంశంపై మునిసిపల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఫోటో లేనందుకే తొలగించారా అంటూ ప్రశ్నించారు.

వెల్లగొట్టేదట్టే కనబడుతున్నారు… 

జగిత్యాల అంటే జీవన్ రెడ్డి… జీవన్ రెడ్డి అంటే జగిత్యాల అన్న బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్న సీనియర్ కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. అసలు జగిత్యాల కెల్లి వెల్లగొట్టేదట్టే కనబడుతున్నరంటూ స్థానికులు, మునిసిపల్ సిబ్బందితో జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో ఆయన ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలు కావాలనే తీయించారని స్ఫష్టం అవుతోందని స్థానికంగా చర్చించుకుంటున్నారు.

వైరమే కారణమా..?

ఇంతకాలం జీవన్ రెడ్డి ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలకు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కానప్పటికీ తాజాగా ఆయన ఏర్పాటు చేసిన వాటిని తొలగించడం వెనక ఆంతర్యం ఏంటన్నదే అంతు చిక్కకుండా పోయింది. ఒకే గూటికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు చేరిరనప్పటికీ ఇద్దరి మధ్య ఇంకా కమ్యునికేషన్ గ్యాప్ ఉందా అన్న చర్చ సాగుతోంది. ఫ్లెక్సీలను తొలగించిన క్రమంలో స్థానికులు ఎమ్మెల్యే ఫోటో లేదన్న అంశాన్ని ప్రస్తావించడంతో జగిత్యాల పట్టణ వాసుల అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది.

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫ్లెక్సీలకు సంబంధించిన పూర్తి వివరాలకు ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి

You cannot copy content of this page