రాజీవ్ జీ సారీ..!

జెండాలు లేకుండానే వర్థంతి

మునిసిపల్ తీరుపై ఎమ్మెల్సీ ఫైర్

దిశ దశ, జగిత్యాల:

భారత ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన స్వర్గీయ రాజీవ్ గాంధీ విషయంలో ఆ మునిసిపల్ యంత్రాంగం వ్యవహరించిన తీరు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆగ్రహం తెప్పించింది. అట్టహాసంగా ఆయన వర్థంతి చేపట్టాలని ప్రత్యేక ఏర్పాట్లు చేసిన కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చింది. దీంతో ఎమ్మెల్సీ మునిసిపల్ తీరుపై మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఇంతకీ ఏం జరిగిందంటే..?

స్వర్గీయ రాజీవ్ గాంధీ 32వ వర్థంతి పురస్కరించుకుని జగిత్యాల శివార్లలోని ఆయన విగ్రహాన్ని ముస్తాబు చేశారు అక్కడి కాంగ్రెస్ పార్టీ నాయకులు. శనివారం రాత్రే చమన్ కు కాంగ్రెస్ పార్టీ జెండాలను ఏర్పాటు చేసి ఆదివారం ఉదయం వర్థంతి నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆదివారం ఉదయం అనూహ్యంగా రాజీవ్ గాంధీ విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన జెండాలన్ని అదృశ్యం అయ్యాయి. దీంతో అసలేం జరిగిందని కాంగ్రెస్ నాయకులు ఆరా తీయగా మునిసిపల్ సిబ్బంది తొలగించారని తెలుసుకున్నారు. ఆదివారం ఉదయం ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు విగ్రహం వద్దకు చేరుకుని పరిస్థితిని గమనించి మునిసిపల్ అధికారుల తీరుపై మండిపడ్డారు. భారత మాజీ ప్రధాని వర్థంతి సందర్భంగా జెండాలు పెడితే వాటిని తొలగించడం ఎంతవరకు సమంజసమంటూ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి పెట్టిన జెండాలు తెల్లవారే సరికి తీసేస్తే రాజ్యం ఎందుకంటూ ప్రశ్నించారు. జెండాలను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

You cannot copy content of this page