దర్జా దందాకు బ్రేకులు పడేనా..?
దిశ దశ, జగిత్యాల:
‘‘అద్దాల అంగడి మాయ… దాని చూపుకు నరుని బ్రతుకు బొంగరమై పాయరా’’ అని గోరేటి వెంకన్న ఆన్ లైన్ మార్కెటింగ్ ను ఉద్దేశించి రాసిన ఈ పాట అచ్చుగుద్దినట్టుగా సరిపోతుంది క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ దందాలకు. అసలు నిర్వాహకులు ఎవరో తెలియదు… దాని అడ్మినిస్ట్రేషన్ యంత్రాంగం గురించి చెప్పరు… అంతా ఆన్ లైన్ లోనే నిర్వహిస్తున్న ఈ అక్రమ వ్యాపారం ఇప్పుడు సామాన్యుని పాలిట శాపంగా పరిణమించింది. ఆర్థిక నేరగాళ్లు నెట్ వర్క్ దందా స్టార్ట్ చేసి అమాయకుల అవసరాలను ఆసరగా చేసుకుని చీటింగుకు పాల్పడుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఇంతకాలం పట్టణ ప్రాంతాలకే పరిమితం అయిన ఈ దందా నేడు పల్లెలకు కూడా పాకింది. అధిక ఆదాయం వస్తోందన్న ఆశ చూపిస్తున్న ఏజెంట్లు గ్రామీణ ప్రాంతాల్లోని అమాయకులను ఈ ఊబిలోకి దింపుతూ కోట్లాది రూపాయల లావాదేవీలు చేస్తున్నారు. అంతా అకౌంటబులిటీగానే ఉంటుంది ఎక్కడా మోసం ఉండదని నమ్మిస్తున్న నిర్వాహకుల వలలో చిక్కుకుని గొలుసు కట్టు దందాలో ఇరుక్కుంటున్నారు అమాయకులు.
జగిత్యాల పోలీసుల దర్యాప్తు…
క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ దందాపై జగిత్యాల టౌన్ సీఐ వేణుగోపాల్ ఆధ్వర్యంలోని బృందం ఈ దందాపై కొరడ ఝులిపించడం మొదలు పెట్టింది. అక్రమంగా సాగుతున్న ఆర్థిక లావాదేవీల మూలాలను పట్టుకునేందుకు కొద్ది రోజులుగా జగిత్యాల పోలీసులు ఆరా తీశారు. ఇందులో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన గుమ్మిడల్ల నర్సయ్య, కోయల్కార్ వేణు, అరె రాజేశ్, కురెల బాబు, కొట్టె మారుతిలతో పాటు పలువురిపై క్రిమినల్ కేసులు నమెదు చేశామని సీఐ వేణుగోపాల్ మీడియాకు వివరించారు. జగిత్యాల పట్టణంలోని అరవింద్ నగర్ కు చెందిన గుమ్మిడల్ల నర్సయ్య అనే వ్యక్తి మల్టిలెవల్ మార్కెటింగ్ వ్యాపారాన్ని “ RIXOS TRADE APP ” ఆన్ లైన్ ట్రేడింగ్ యాప్ ద్వారా “ USDT BEP20” పేరిట ఉన్న క్రిప్టో కరెన్సీని పెట్టుబడి పెట్టాలని, డాలర్ల రూపంలో ఆదాయం వస్తుందని ఆశ చూపించారు. ఇందు కోసం ట్రస్ట్ వాలెట్ అప్లికేషన్ కూడా డౌన్ లోడ్ చేసుకువాలని, పెట్టుబడి పెట్టేవారికి తాము ష్యూరిటీగా ఉంటామని చెప్పి నమ్మించారు. పెట్టిన పెట్టుబడికి 18 నెలల్లో 5 నుండి 10 రెట్ల ఆధాయం వస్తుందని, రోజుకు ఒక శాతం చొప్పున కమిషన్ వస్తుందని కూడా చెప్పారు. కమిషన్ రూపంలో కానీ ఇతరాత్ర ఆదాయం అంతా కూడా డాలర్ల రూపంలో ట్రస్ట్ వాలెట్ అప్లికేషన్ లో జమ అవుతాయని కూడా నమ్మించారు. అంతేకాకుండా ఇందులో జాయిన్ అయిన వారు మరింత మందిని చేర్పించినట్టయితే భారీగా లాభాలు వస్తాయని కూడా ఆశ చూపించారు. ఈ దందాలో ఉద్యోగులను, చిన్న, మధ్య తరగతికి చెందిన వారిని జాయిన్ చేసి నెలకు కొంత సొమ్ము చెల్లిస్తూ వ్యాపారాన్ని విస్తరించారు. ఎలాంటి పర్మిషన్లు లేకుండా సాగించిన ఈ వ్యాపారం వల్ల పెద్ద సంఖ్యలో బాధితులపై ప్రభావం చూపుతోందన్న విషయాన్ని గుర్తించిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేయడం ఆరంభించారు.
మొదటి వారికే…
అయితే ఈ దందాలో మొదట చేరిన వారికే లాభాలు వస్తాయని, చివరన చేరిన వారికి ఎలాంటి భరోసా ఉండదని, నెట్ వర్క్ దందా వల్ల సామాన్యులే సమిధలుగా మారుతారన్న విషయాన్ని జగిత్యాల పోలీసులు తమ విచారణలో గుర్తించారు. ఆదాయం గడించిన వారిని బూచిగా చూపిస్తూ కొత్త వారిని ఈ వ్యాపారంలో చేర్పించేలా ప్రోద్భలం చేస్తూ అక్రమ ఆర్థిక దందాను గ్రామ స్థాయికి కూడా తీసుకెళ్లారు ఏజెంట్లు. ఇందులో జాయిన్ అయిన వారు $ 3,000 పెట్టుబడి పెట్టించాలని ఒత్తిడి చేస్తూ, వారి కింద ఉండే నెట్ వర్క్ ఎంత పెరిగితే అంతే స్థాయిలో లాభం వస్తుందని చెప్పి ఈ ఊబిలోకి చాలా మందిని దింపారు.
వాట్సప్ గ్రూపులు…
క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ దందాల్లో అమాయకులను చేర్పించేందుకు ప్రత్యేకంగా వాట్సప్ గ్రూపులను క్రియేట్ చేసి అక్రమ వ్యాపారాన్ని విస్తృతం చేస్తున్నారు. అయితే ఈ వాట్సప్ గ్రూపులు కూడా తమ పేరిట కాకుండా అమాయకుల పేరిట క్రియేట్ చేయించినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న ఈ అక్రమ దందా అంతా కూడా లీగల్ గా సాగుతోందని, మీ అకౌంట్లలో డబ్బులు యాడ్ అవుతున్నాయి కదా అని చెప్తూ ఓ వ్యాపార సామ్రాజ్యాన్నే నిర్మించారు. ఈ అక్రమ వ్యాపారంపై మరిన్ని కోణాల్లో ఆరా తీస్తున్న జగిత్యాల టౌన్ సీఐ వేణు గోపాల్ బాధితులు తమను ఆశ్రయించాలని కూడా పిలుపునిచ్చారు. అమాయకుల ఆశలే పెట్టుబడిగా పెట్టి కోట్లాది రూపాయల్లో జరిగిన దందాపై సమగ్రంగా ఆరా తీసే పనిలో కూడా జగిత్యాల టౌన్ పోలీసులు నిమగ్నం అయ్యారు.