ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొత్త అధికారులే…

జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ కొనసాగింపు

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని ముగ్గురు పోలీసు అధికారులు స్థానచలనం కాగా ఒక్క జగిత్యాల ఎస్పీ మాత్రం యధావిధిగా కొనసాగనున్నారు. రాష్ట్రంలో ఐపీఎస్ ఆఫీసర్ల బదిలీ అంశం తెరపైకి వచ్చినప్పుడల్లా జగిత్యాల ఎస్పీ పేరు ప్రముఖంగా వినిపించేది. కానీ ఆయనను మాత్రం ఇక్కడే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ దీర్ఘకాలంగా కొనసాగుతున్నారని బదిలీ ఖాయమని ప్రచారం జరిగింది. అయితే అఖిల్ మహాజన్ ను కరీంనగర్ సీపీగా నియమించే అవకాశాలు ఉన్నాయని చాలా రోజులుగా ప్రచారం జరిగినప్పటికీ ప్రభుత్వం మాత్రం గౌస్ ఆలంను నియమించింది. కరీంనగర్ నూతన సీపీగా రానున్న గౌస్ ఆలం ఇంతకు ముందు ఉత్తర తెలంగాణాలోని పలు జిల్లాల్లో ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ప్రాంతంపై సమగ్ర అవగాహన కూడా ఉన్న గౌస్ ఆలంను కరీంనగర్ సీపీగా నియమించడం వెనక బలమైన కారణాలు ఉండి ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రామగుండం సీపీ శ్రీనివాస్ స్థానంలో వరంగల్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాను నియమించింది. కార్మిక క్షేత్రం అయిన రామగుండం సరిహద్దుల్లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు కూడా ఉన్నాయి. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ వంటి పరిశ్రమలు కూడా విస్తరించిన రామగుండం కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ అంశం అత్యంత ప్రధానమని భావించిన ప్రభుత్వం డీఐజీ హోదాలో ఉన్న అండర్ కిషోర్ ఝాను నియమించినట్టుగా తెలుస్తోంది. కరీంనగర్ సీపీ అభిషేక్ మోహంతి పదోన్నతి పొందినప్పటికీ ఆయనను ఇక్కడే యథావిధిగా ఇక్కడే కొనసాగించే అవకాశాలు ఉంటాయన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తెలంగాణలో ఉన్న ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారులను సొంత రాష్ట్రానికి వెళ్లాలని కేంద్రం ఆదేశించింది. ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత ఆయన రిలీవ్ కానున్నారని అధికారవర్గాలు చెప్పాయి. ఎన్నికల తరువాత కూడా కరీంనగర్ సీపీగానే అభిషేక్ మోహంతిని కొనసాగిస్తారన్న వాదనలు వినిపించినప్పటికీ స్థానచలనం కావడం గమనార్హం. తెలంగాణ ప్రభుత్వం. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు కమిషనరేట్ల సీపీలను, ఓ జిల్లా ఎస్పీని, డీసీపీని బదిలీ చేయగా, పెద్దపల్లి డీసీపీగా కరుణాకర్ ను నియమించింది.

You cannot copy content of this page