ఉగ్ర మూలాలకు కేరాఫ్ జగిత్యాల..?

దిశ దశ, జగిత్యాల:

అంతర్జాతీయ ఉగ్ర వాదుల కార్యకలాపాల లింకులు జగిత్యాల జిల్లాలోనే ఎక్కువగా వెలుగులోకి వస్తుండడం సంచలనంగా మారింది. అసాంఘీక కార్యకలాపాలతో పాటు టెర్రర్ మూలాలతో ఈ జిల్లా సంబంధాలు వెలుగులోకి వస్తుండడం కలకలం సృష్టిస్తోంది. కొన్నేళ్లుగా జగిత్యాల జిల్లాలోనే టెర్రర్ లింక్స్ వెలుగులోకి వస్తున్న తీరు ఆందోళన కల్గిస్తోంది. ఉగ్ర సంస్థలు ఈ జిల్లాను సేఫ్ గా భావించడం వల్లే ఇక్కడ ఎక్కువగా మూలాలు వెలుగులోకి వస్తున్నాయా మరేదైనా కారణమా అన్న విషయంపై నిఘా వర్గాలు ఆరా తీయనున్నట్టు సమాచారం.

ఘోరీ నుండి నేటి వరకు…

1998-1999 ప్రాంతంలో ఐఎస్ఐ ఉగ్రవాది ఆజం ఘోరీ జగిత్యాల నడి బొడ్డున ఎన్ కౌంటర్ లో మరణించాడు. అంతకుముందు ఆజం ఘోరీ రీపిల్స్ రీఫిల్లింగ్ చేస్తూ ఉపాధి పొందుతున్నట్టుగా జిల్లాలో షెల్టర్ తీసుకున్నాడు. అయితే ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఆజం ఘోరీని వెంటాడుతున్న క్రమంలో ఎన్ కౌంటర్ ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ లింక్ తో ఏర్పాటయిన ఈ ఉగ్ర సంస్థకు చెందిన ముఖ్య నాయకుడు జగిత్యాల జిల్లాలో షెల్టర్ తీసుకోవడం వెనక కారణాలు ఏంటన్న చర్చ అప్పట్లో సంచలనంగా మారింది. 2002లో జగిత్యాలలో నిర్వహిస్తున్న శ్రీ రామయాగం కార్యక్రమానికి అప్పటి కేంద్ర మంత్రి సిహెచ్ విద్యాసాగర్ రావు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే టార్గెట్ ఛేదించేందుకు లష్కర్ ఏ తోయిబాకు చెందిన ఆజీజ్ అలియాస్ ఆజం జగిత్యాలకు వెలుతున్న క్రమంలో కరీంనగర్ శివార్లలోని రేకుర్తి వద్ద ఎన్ కౌంటర్ లో హతం అయ్యాడు. 2013లో కరీంనగర్ జిల్లా చొప్పదండి స్టేట్ బ్యాంక్ రాబరీ జరిగింది. మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జైలు నుండి తప్పించుకుని వచ్చిన వీరు చొప్పదండి బ్యాంకు రాబరీకి ముందు కొడిమ్యాల మండల కేంద్రంలో పిన్నిసులు, రబర్లు అమ్మే వారి వేషం కట్టి సంచరించారు. వీరిపై అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవడంతో వారిని విచారించి వదిలేయడంతో వారి డెన్ చొప్పదండికి మార్చారు. బ్యాంకు రాబరీ ఘటన తరువాత కూడా వీరెవరో తెలియకపోగా ఫశ్చిమ బెంగాల్ లోని బురద్వాన్ సమీపంలోని ఓ డెన్ లో పేళుల్లు సంభవించడంతో అందులో షెల్టర్ తీసుకున్న టెర్రరిస్టులు తప్పించుకున్నారు. ఈ ఘటనపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రంగంలోకి దిగి విచారణ చేపట్టడంతో డెన్ లో దొరికిన కరెన్సీ బెండల్స్ లేబుళ్లపై చొప్పదండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ కు సంబంధించిన స్టాంపు ఉండడంతో అసలు విషయంలో వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత నల్గొండ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఈ టెర్రరిస్టు ముఠాకు సంబంధించిన ఒకరు హతం కూడా అయ్యారు. నాలుగేళ్ల క్రితం రక్షణ విభాగానికి చెందిన అధికారులు జిల్లాలోని మల్లాపూర్ మండలంలో ఓ వ్యక్తిని విచారించాయి. పాకిస్తాన్ కు చెందిన ఓ మహిళ ట్రాప్ లో పడిన ఆర్మీ అధికారి వ్యవహారంపై ఆరా తీస్తున్న క్రమంలో ఆర్థిక లావాదేవీలు జరిపినట్టుగా గుర్తించిన విచారణ అధికారులు రంగంలోకి దిగడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఏడాది క్రితం పీఎఫ్ఐ మూలాలు కూడా జిల్లాలోనే వెలుగులోకి రావడం గమనార్హం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కోచింగ్ సెంటర్ల ముసుగులో పీఎఫ్ఐ రిక్రూట్ మెంట్ చేస్తున్నారని వెలుగులోకి రావడంతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ లోతుగా దర్యాప్తు చేపట్టింది. జగిత్యాలకు చెందిన ఒకరిని కరీంనగర్ లో అదుపులోకి తీసుకోగా మరోకరు పరార్ అయ్యారు. ఎన్ఐఏ దాడుల్లో పరారీలో ఉన్న పీఎఫ్ఐకి చెందిన సలీంను ఇటీవలే ఏపీలో అరెస్ట్ చేసింది ఏన్ఐఏ. ఇతనిది జగిత్యాల జిల్లా కేంద్రమే కావడం గమనార్హం.

రామేశ్వరం కేఫ్ లింక్..?

దేశ వ్యాప్తంగా సంచలనం కల్గించిన బెంగుళూరు రామేశ్వరం కేఫ్ బ్లాస్టింగ్ కేసులో దర్యాప్తు సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యుడిగా పేర్కొంటు అనుమానితుడి ఫుటేజీ, ఫోటోలు, ఊహా చిత్రాలను కూడా ఎన్ఐఏ విడుదల చేసింది. ఈ వ్యవహారంతో జగిత్యాలకు చెందిన సలీంకు సంబంధాలు ఉన్నాయన్న కోణంలో ఎన్ఐఏ విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో మరోసారి జగిత్యాల జిల్లా ఉనికి వెలుగులోకి వచ్చినట్టయింది. టెర్రర్ సంబంధిత వ్యవహారాలు ఏదో ఓ సారి జగిత్యాల జిల్లాకు సంబంధించిన లింకులు వెలుగులోకి వస్తుండడం కలకలం సృష్టిస్తోంది.

You cannot copy content of this page