దిశ దశ, హుజురాబాద్ కరస్పాండెంట్:
హుజురాబాద్ లో అధికార పార్టీకి భారీ షాక్ తగలనుందని, పార్టీ క్యాడర్ గులాభి జెండా వీడేందుకు సమాయత్తం అవుతోందని ‘దిశ దశ’ శుక్రవారమే వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అధిష్టానం పెద్దలు బుజ్జగింపుల పర్వం మొదలు పెట్టినా వారు మాత్రం ఉద్యమ పార్టీలో ఉండేందుకు మనసొప్పడం లేదని తేల్చి చెప్పారు. దీంతో హుజురాబాద్ ప్రాంత బీఆర్ఎస్ నాయకులు తమకు నచ్చిన పార్టీలను ఎంచుకుని తమదారి తాము చూసుకునే పనిలో పడ్డారు. తాజాగా కాకతీయ యూనివర్శిటీ విద్యార్థి జేఏసీ బాధ్యతలు నిర్వర్తించిన, జమ్మికుంట జడ్పీటీసీ సభ్యుడు శ్రీరాం శ్యాం గులాభి పార్టీకి బైబై చెప్పేశారు. శనివారం ఉదయం శ్యాం బీజేపీ మాజీ ఎమ్మెల్యే ధర్మారావును కలిసి కాషాకం కండువా కప్పుకున్నారు.
మానసిక సంఘర్షణకు గురై…
ఉద్యమ ప్రస్థానంలో లాఠీ దెబ్బలు, కేసులు ఎదుర్కొన్నప్పటికీ సరైన గుర్తింపు రాలేదన్న వేదన శ్యాంను వెంటాడుతోంది. జడ్పీటీసీ సభ్యుడిగా అవకాశం ఇచ్చి చేతులు దులుపుకున్నారు కానీ ప్రాధాన్యత లేకుండా పోయిందని శ్యాం మదనపడిపోతున్నారు. అంతేకాకుండా ఉద్యమ సమయంలో ఉస్మానియా స్టూడెంట్స్ చేపట్టిన ఆందోళనలను మరిపించే విధంగా హన్మకొండ కాకతీయ విశ్వవిద్యాలయంలో శ్యాం నేతృత్వంలో ఆందోళనలు చేశారు. కాకతీయ యూనివర్శిటీలో ఉద్రిక్తత పరిస్థితులతో అట్టుడికిపోయిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి. తనతో పాటు ఎంతో మంది విద్యార్థులు కూడా కాకతీయ యూనివర్శిటీ ఆవరణలో స్వరాష్ట్ర కల సాకారం కోసం పోరుబాట పట్టినప్పటికి ఉద్యమ పార్టీ నుండి సరైన గుర్తింపు మాత్రం రావడం లేదని కేయూ స్టూడెంట్స్ చర్చించుకునే వారు. ఉస్మానియాలో ఉద్యమాలు చేపట్టిన విద్యార్థి నేతలకు రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవులు, చట్ట సభల ఎన్నికల్లో టికెట్ల కెటాయించానా కాకతీయ విద్యార్థుల విషయంలో మాత్రం పూర్తిస్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆవేదన వారిలో వ్యక్తం అవుతోంది. ఇటీవల కాలంలో ఉద్యమ ప్రస్థానంలో కేయూలో పోరాటాలు జరిపిన విద్యార్థులంతా కూడా చర్చించిన సందర్భాలు కూడా లేకపోలేదు. కేయూ ఉద్యమకారులను గుర్తించడంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చొరవ చూపించడం లేదని దీంతో కేసుల పాలై కుటుంబాలకు దూరమై అన్నింటా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పూర్వ విద్యార్థి ఉద్యమకారులు డిస్కషన్ చేసుకున్నారు. ఈ సమయంలో తమకు గుర్తింపు వచ్చే పరిస్థితులు లేవని తమకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగందన్న భావనకు వచ్చేశారు.
పార్టీ మారడమే…
భవిష్యత్తులో కూడా తమకు అంతగా గుర్తింపు లభించే అవకాశం లేదని భావించిన శ్రీరాం శ్యాం గులాభి జెండాను వీడాలని నిర్ణయించుకున్నారు. ఉద్యమ ప్రస్థానంలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వెన్నంటి నడిచిన శ్యాం ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీ వైపే అడుగులు వేయడం గమనార్హం. అయితే జమ్మికుంట జడ్పీటీసీ శ్యాం బీఆర్ఎస్ పార్టీని వీడడంతో రానున్న కాలంలో కేయూ విద్యార్థి జేఏసీ నాయకులు కూడా ఆయన వెంట పార్టీ మారే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రభావం పలు నియోజకవర్గాల్లో ఉండే అవకాశం లేకపోలేదు.