దిశ దశ, హైదరాబాద్:
పుష్కర కాలానికి పైగా ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఉద్యమంలో స్వరాష్ట్ర కల సాకారం కోసం ఎన్నెన్నో పాటలు జీవం పోసుకున్నాయి. ధూంధాం వంటి కార్యక్రమాలతో తెలంగాణ పల్లె నుండి పట్నం వరకు ఊర్రూతలూగించిన పాటలు ఎన్నెన్నో. అందులో అన్ని వర్గాలను ఆకర్షించుకుని తెలంగాణ ప్రజలు పులకించిపోయిన పాట మాత్ర ఇదొక్కటే. తెలంగాణ సంస్కృతి, సాంప్రాదాయాలు, సహజ వనరుల తీరును వివరించే విధంగా అందె శ్రీ కలం నుండి జాలువారిందే ఈ పాట. జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం అంటూ రచించిన ఈ పాట ప్రతి ఒక్కరి హృదయాలను తట్టి లేపింది. తెలంగాణ గీతంగా వెలుగొందాలని ప్రతి ఉద్యమ కారుడు ఆకాంక్షించారు నాడు. స్వ రాష్ట్ర కల సాకారం అయిన తరువాత కూడా చాలా కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో వినిపించింది. అయితే ప్రభుత్వం మాత్రం అధికారిక పాటగా మాత్రం గుర్తించలేదు. అందరి హృదయాల్లో బలంగా నాటుకోపోయిన ఈ పాట క్రమ క్రమంగా అధికారం నుండి తెరమరుగైపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన క్యాబినెట్ మీటింగ్ జయ జయహే తెలంగాణ జననీ జయకేతం పాటను రాష్ట్ర గీతంగా పరిగణించాలని నిర్ణయించింది. రాష్ట్ర అధికారిక గీతంగా గుర్తిస్తున్నట్టుగా క్యాబినెట్ తీర్మానం చేసింది. దీంతో తెలంగాణ గొప్పతానాన్ని చాటుతూ రచించిన ఈ పాటకు మల్లీ జీవనం పోసినట్టయింది. నాడు ఉద్యమ కాలంలో అందరి నోట వినిపించిన ఈ పాట తెలంగాణ సర్కార్ తాజా నిర్ణయంతో తరతరాలు అనభందం పెనవేసుకోనుంది.