జేసీబీ బ్యాచ్ అరెస్ట్… జ్యుడిషియల్ రిమాండ్ కు తరలింపు…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ కమిషనరేట్ లో జేసీబీ బ్యాచ్ ఒకటి అరెస్ట్ అయింది. అధికార పార్టీలోని ముఖ్య నాయకుల దివ్య ఆశీస్సులతో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన మరో గ్యాంగ్ ఎట్టకేలకు అరెస్ట్ అయింది. కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రేకుర్తిలోని ఓ ఇంటికి నకిలీ డాక్యూమెంట్లు సృష్టించి ఇల్లు కూల్చి ప్రబుద్దులను మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చగా వీరికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం… కరీంనగర్ ఆదర్శ్ నగర్ కు చెందిన మహ్మద్ లతీఫ్ (38) 2017లో రేకుర్తిలోని 194 సర్వేనెంబర్ ప్లాట్ నంబర్ 61లో 248 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశాడు. సిద్దిపేటలోని ప్రశాంత్ నగర్ కు చెందిన సయ్యద్ జైనాబా వద్ద కొనుగోలు చేసిన ఈ ఇంటి స్థలంలో నిర్మాణం కోసం గ్రామ పంచాయితీ కూడా పర్మిషన్ ఇచ్చింది. ఇంటి నంబర్ 10-19/1/6/A /1ను కూడా పంచాయతి కెటాయించగా అదే ఇంట్లో లతీఫ్ నివసిస్తున్నాడు. 2023 మే 13న బారాజు రత్నాకర్ రెడ్డి, చందా శంకర్ రావు, బకిట్ సాయి, పిట్టల మధు, షాహిద్ ఖాన్ లతో పాటు మరికొంతమంది ఇంట్లోకి చొరబడి లతీఫ్ కుటుంబ సభ్యులను బయటకు నెట్టేశారు. అనంతరం TS21E 5399 జేసీబీతో లతీఫ్ తో పాటు కాలనీలోని మరికొందరి ఇండ్లను కూడా కూల్చి వేశారు. నకిలీ పత్రాలనూ చూపించి అక్కడి ఇండ్లలో నివాసం ఉంటున్న వారికి ఎలాంటి హక్కులేదని స్పష్టం చేశారు. అలాగే సయిద్ ఖాన్ వారసులతో డెవలప్ మెంట్ అగ్రీమెంట్ అయిందని దానికి సంబంధించిన నకీలీ జీరాక్స్ డాక్యూమెంట్ చూపించి ఇండ్లు ఖాళీ చేయాలని లేనట్టయితే చంపేస్తామని బెదిరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులపై ఐపీసీ 452, 448, 427,506, 467, 468, 120-B, r/w 34 సెక్షన్లలో కేసు నమోదు చేసి మంగళవారం కరీంనగర్ కోర్టులో హాజరు పరిచారు. వీరిని జ్యుడిషియల్ రిమాండ్ కు విధించినట్టు కోర్టు ఆదేశిండచంతో కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు.

You cannot copy content of this page