దిశ దశ, న్యూ ఢిల్లీ:
బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేరికపై గుర్రుగా ఉన్న ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి న్యూ ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన వెంట ప్రభుత్వ విఫ్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా ఉన్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టు నుండి తెలంగాణ భవన్ శబరి గెస్ట్ హౌజ్ కు చేరుకున్నారు. బుధవారం ఉదయం ఢిల్లీ చేరుకున్న మంత్రి శ్రీధర్ బాబు, తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి దీప్ దాస్ మున్షితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సంజయ్ కుమార్ వైఫల్యాలను ఎత్తి చూపినట్టుగా తెలుస్తోంది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న తనను సంప్రదించకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేను చేర్పించుకోవడం సరైన నిర్ణయం కాదని చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే వీరితో చర్చలో అనంతరం జీవన్ రెడ్డి అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకా గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తో కూడా బేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల సమాచారం. జీవన్ రెడ్డిని సముదాయించడంతో పాటు ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామన్న భరోసా కల్పించేందుకే పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది.