దిశ దశ, భూపాలపల్లి:
మేడిగడ్డ బ్యారేజీ వద్ద నీటి నిలువ చేసే అవకాశం లేదని తేలిపోయింది. ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక ప్రకారం వరద నీటిని అంతా కూడా దిగువకు వదిలేయాల్సిందే. దీంతో నీటిని ఎగువ ప్రాంతాలకు ఎత్తిపోయడమెలా అన్న విషయంపై కొత్త ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. కన్నెపల్లి పంప్ హౌజ్ కు నీటిని మళ్లించి ఎగువ ప్రాంతాలకు ఎత్తిపోసే ప్రక్రియకు శ్రీకారం చుడితే ఎలా ఉంటుంది అన్న యోచన చేస్తోంది అధికార యంత్రాంగం. కన్నెపల్లి పంప్ హౌజ్ సమీపంలో నీటిని నిలువ చేసే విధంగా చర్యలు తీసుకుని ఎగువ ప్రాంతాలకు లిఫ్ట్ చేసినట్టయితే ఎలా ఉంటుంది..? ఇందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న ప్రతిపాదనలపై చర్చిస్తున్నట్టుగా సమాచారం. అయితే కన్నెపల్లి పంప్ హౌజ్ నుండి నీటి ఎత్తిపోసే విధానంపై సఫలం అవుతుందా అన్నదే పజిల్ గా మారింది.
జియో ట్యూబ్ సిస్టం…
చెక్ డ్యాం మాదిరిగా కన్నెపల్లి సమీపంలో గోదావరి నదిపై జియో ట్యూబ్ సిస్టం ద్వారా నీటిని నిలువ ఉంచే ప్రక్రియ చేయాలని భావిస్తున్నారు. గోదావరి నదిలో నీటిని నిలువ చేసేందుకు ఇరువైపులా భారీ సైజు పిల్లర్లను నిర్మించి ప్రవాహానికి అడ్డుకట్ట వేసేవిధానం ఇది. నీటి ప్రవాహంలో భారీ సైజూ ట్యూబ్ ఏర్పాటు చేసి ఇసుక, రాళ్లు, కాంక్రీట్ లతో నిర్మాణం చేస్తారని తెలుస్తోంది. కన్నెపల్లి పంప్ హౌజ్ దిగువన నీటిమట్టం లోపల నుండి 9 నుండి 12 మీటర్ల ఎత్తులో, నీటిపై 2.5 మీటర్లు ఉండేవిధంగా జియో ట్యూబ్ సిస్టంను సిద్దం చేసినట్టయితే నీటిని స్టోర్ చేసుకుని ఎగువకు ఎత్తిపోసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. గ్యాబియన్ వాల్ అని కూడా పిలిచే ఆ విధానం ద్వారా వాటర్ స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుందని, మేడిగడ్డ బ్యారేజీపై వరద ప్రభావం పడకుండా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే జియో ట్యూబ్ విధానం అనేది నీటి ప్రవాహం ఉధృతంగా ఉండే గోదావరి నదిపై నిర్మించడం సాధ్యం అవుతుందా లేదా అన్నదే పజిల్ గా మారింది. సాధారణ నీటి ప్రవాహం ఉండే నదులపై నిర్మిస్తే జియో ట్యూబ్ విధానం సఫలం అవుతుంది కానీ లక్షల క్యూసెక్కుల వరద నీటి ఉధృతి కొనసాగే గోదావరి నదిలో అసాధ్యమన్న అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకండా గోదావరి నదిలో ప్రాణహిత నీరు కలిసిన తరువాత కొద్ది దూరంలోనే జియో ట్యూబ్ సిస్టం ఏర్పాటు చేయడం వల్ల వరద ధాటిని తట్టుకునే అవకాశం ఉండదన్న వాదనలే వినిపిస్తున్నాయి.
పంప్ హౌజ్ సిద్దమేనా..?
ఇకపోతే కన్నెపల్లి పంప్ హౌజ్ నీటిని ఎగువ ప్రాంతానికి ఎత్తిపోసేందుకు సిద్దంగా ఉందా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. రెండేళ్ల క్రితం భారీ వరదల కారణంగా సేఫ్టీ వాల్ కొట్టుకపోవడంతో ఈ పంప్ హౌజ్ అంతా కూడా ముంపునకు గురైంది. ఇందులో ఏర్పాటు చేసిన 17 మోటార్లు కూడా నీట మునిగిపోగా అక్కడ అంతా ఛిన్నాభిన్నంగా మారింది అక్కడి పరిస్థితి. మోటార్లను పునరుద్దరించేందుకు అధికారులు ప్రయత్నాలు చేయగా ఆరు మోటార్లు మాత్రమే పనిచేస్తున్నాయని, 11 మోటార్లను బాగు చేయాల్సి ఉందని తెలుస్తోంది. దీంతో జియో ట్యూబ్ సిస్టం ద్వారా మళ్లీంచే నీటిని ఎప్పటికప్పుడు ఎగువ ప్రాంతానికి ఎత్తిపోసే అవకాశం ఉంటుందా అన్నది కూడా అనుమానమే. వాటర్ లెవల్ కన్నా కింది ప్రాంతంలో మోటార్లను ఏర్పాటు చేయడం వల్ల భారీ నష్టం వాటిల్లిందని కూడా తెలుస్తున్న క్రమంలో ఈ సారి వచ్చే వరద వల్ల నష్టం కాకుండా జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంది. అంతేకాకుండా కన్నెపల్లి సమీపంలోనే జియో ట్యూడ్ సిస్టం అమర్చినట్టయితే కన్నెపల్లి పంప్ హౌజ్ పై గతంలో కంటే ఎక్కవ ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు ముందుగా పంప్ హౌజ్ వద్ద పటిష్టమైన సేఫ్టీ వాల్ నిర్మించడం… నీరు లోపలకు రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యం.
అన్నారం… సుందిళ్ల…
ఒక వేళ కన్నెపల్లి పంప్ హౌజ్ ద్వారా అనుకున్న మేర నీటిని ఎత్తిపోసే ప్రక్రియను విజయవంతం చేసినా అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణులు మేడిగడ్డ తరహాలోనే ఈ రెండు బ్యారేజీలు డిజైన్ చేసి నిర్మించారని వాటివద్ద కూడా నీటిని నిలవ ఉంచకూడదని దిగువకను నీటిని వదిలేయాలని స్ఫస్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ రెండు బ్యారేజీల్లో నీటిని స్టోర్ ఎలా చేస్తారన్నదే మిస్టరీగా మారింది. ఒక వేళ అన్నారం బ్యారేజ్, సుందిళ్ల బ్యారేజీలను వినియోగించుకోవాలని ఎన్డీఎస్ఏ అనుమతి ఇచ్చినా ఎగువ ప్రాంతానికి ఎత్తిపోసే ప్రక్రియపై మీమాంస నెలకొంది. కన్నెపల్లి పంప్ హౌజ్ డ్యామేజీ అయినప్పుడే అన్నారం బ్యాక్ వాటర్ ను ఎత్తిపోసేందుకు ఏర్పాటు చేసిన సిరిపురం పంప్ హౌజ్ మోటార్లు కూడా నీట మునిగాయి. అక్కడ ఏర్పాటు చేసిన మోటార్లలో ఎన్ని పనిచేస్తున్నాయి అవి ఎంతమేర నీటిని ఎగువకు ఎత్తిపోస్తాయి అన్న విషయంపై స్పష్టత రావల్సి ఉంది. సుందిళ్ల బ్యాక్ వాటర్ గోలివాడ పంప్ హౌజ్ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు తరలించి అక్కడి నుండి నందిమేడారం అండర్ టన్నెల్ కు తరలిస్తారు. అప్రోచ్ కెనాల్ ద్వారా నీటిని తరలించేందుకు నిర్మాణం చేశారు. అక్కడి నుండి లక్ష్మీపూర్ అండర్ టన్నెల్ కు, అక్కడి నుండి వై జంక్షన్ ద్వారా జగిత్యాల ప్రాంతానికి కొంత మిడ్ మానేరు ప్రాజెక్టుకు కొంత నీటిని తరలించాల్సి ఉంటుంది. మిడ్ మానేరు నుండి ఎల్ఎండీ, అనంతగిరి ప్రాజెక్ట్, రంగ నాయకసాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాంతాలకు తరలించే విధంగా నిర్మాణం చేశారు. మరో వైపున రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీకి లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌజ్ వై జంక్షన్ నుండి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
వర్షాకాలంలో అసాధ్యం…
కాళేశ్వరం లిఫ్ట్ ద్వారా ఎగువ ప్రాంతాలకు ఎత్తిపోసే ప్రక్రియ వర్షాకాలంలో అయితే మాత్రం అసాధ్యమని ఇప్పటి వరకు ఎదురైన అనుభవాలు తేల్చిచెప్తున్నాయి. 2019 నుండి ఇప్పటి వరకు ప్రతి సీజన్ లో కూడా గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలాల్సిన పరిస్థితులే ఎదురయ్యాయి. ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వరద కారణంగా మిడ్ మానేరు నుండి మేడిగడ్డ వరకు ప్రతి బ్యారేజ్ గేట్లు ఎత్తాల్సిన పరిస్థితులే ఎదురయ్యాయి. దీంతో ప్రతి వర్షాకాలంలోనూ వేలాది క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి వదలాల్సి వచ్చింది. సీజన్ ముగిసిన తరువాత ఎగువ ప్రాంతాల నుండి వచ్చే నీటిని ఒడిసి పట్టుకుని ఆ తరువాత ఎగువకు నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. గతంలో వర్షాకాలానికి ముందు ఎత్తిపోసిన నీరు తిరిగి గోదావరి నదిలోకే వదిలేయాల్సి వచ్చింది. కాబట్టి వర్షాకాలం ముగిసిన తరువాత ఎగువ ప్రాంతాల్లోని బ్యారేజీల నీటి సామర్థ్యాన్ని బట్టి ఎప్పటికప్పుడు నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. అయితే జియో ట్యూబ్ సిస్టం ద్వారా ఎంత నీటిని నిలువ చేస్తారు వాటిని ఎగువ ప్రాంతానికి ఎప్పుడు ఎత్తిపోయాల్సి ఉంటుంది అన్న విషయాలపై కూడా స్పష్టత రావల్సి ఉంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులోని వివిధ బ్యారేజీలు, పంప్ హౌజుల్లో ఎదురైన సమస్యలతోనే రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం భారీగా పడింది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ప్రయోగాలు చేసేప్పుడు సాధ్యాసాధ్యాలపై సమగ్రంగా అధ్యయనం చేసిన తరువాతే ముందుకు సాగితే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.