దిశ దశ, సినిమా:
కొరియో గ్రాఫర్ షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్ అసిస్టెంట్ కొరియో గ్రాఫర్ ను వేధింపులకు గురి చేయడమే కాదు… మతం మార్చుకోవాలని కూడా ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం సంచలనంగా మారింది. మతం మార్చుకుని తనను వివాహం చేసుకోవాలని బాధితురాలిని హింసించడమే కాకుండా, షేక్ జానీ తన భార్యను తీసుకుని బాధితురాలి ఇంటికి వెల్లి కూడా ఈ మేరకు ఒత్తిడి చేశాడు. ఓ మహిళను వేధింపులకు గురి చేయడమే కాకుండా ఆమెను మతం మార్చుకోవాలని ఒత్తిడి చేయడం వెనక కారణం ఏంటన్నదే మిస్టరీగా మారింది. ఇందుకు కొరియో గ్రాఫర్ జానీ భార్య కూడా వత్తాసు పలకడం కూడా విచిత్రం. ఈ కేసులో అసలేం జరిగింది అన్న కోణంలో దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అసిస్టెంట్ కొరియో గ్రాఫర్ గా అవకాశం ఇచ్చినట్టయితే తనకు ఉపాధి దొరకడంతో పాటు భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని ఆశించిన బాధితురాలిపై కొరియో గ్రాఫర్ ఇలా వ్యవహరించడం ఏంటన్న చర్చ సాగుతోంది. మత మార్పిడి గురించి జానీ అతని భార్య కూడా ఒత్తిడి చేయడం, బాధితురాలిని చెప్పుతో కొట్టడం వెనక ఏదో మర్మం దాగి ఉన్నట్టుగా స్పష్టం అవుతోంది. వెండితెరపై కొరియో గ్రాఫర్ గా, బుల్లితెరపై పలు షోల్లో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న జానీ ఓ మహిళ పట్ల వ్యవహరించిన తీరు టాలివుడ్ లోనే సంచలనంగా మారింది. ఇప్పటి వరకు బాధితురాలిని వేధింపులకు గురి చేస్తున్న విషయమే వెలుగులోకి వచ్చింది కానీ… జానీ ఆయన భార్య కూడా మత మార్పిడి కోసం బాధితురాలిపై ఒత్తిడి చేయడంపై లోతుగా ఆరా తీయాల్సిన అవసరం ఉంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా కేసుకు సంబంధించిన వాస్తవాలను కోర్టుకు వివరించేందుకు ఎఫ్ఐఆర్ లో వివరించారు. అయితే పోలీసులు కోర్టుకు ఈ విషయాన్ని విన్నవించారు కానీ…జానీపై మాత్రం 376(2)(n), 506, 323 IPC సెక్షన్లలో కేసు నమోదు చేశారు. మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసిన సెక్షన్లలో కేసు నమోదు చేయనట్టు స్పష్టం అవుతోంది.