మావోయిస్టు పార్టీ సబిత ప్రకటన
దిశ దశ, దండకారణ్యం
దండకారణ్య అటవీ ప్రాంతంలో బలగాలు జరుపుతున్న క్రూరమైన దాడులకు నిరసనగానే అరన్‌పూర్ ఘటనకు పాల్పడ్డామని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. సౌత్ సబ్ జోనల్ బ్యూరో అధికార ప్రతినిధి సమత పేరిట చత్తీస్ గడ్ లో విడుదల చేసిన ఆ ప్రకటనలో ఈ దాడికి పూనుకుంది పీఎల్జీఏనేని వెల్లడించారు. ఈ ఘటనకు ఒక రోజు ముందు జవాన్లు విచక్షణా రహితంగా అటవీ ప్రాంతంలో కాల్పులు జరిపి, 17 మంది గ్రామస్తులను కొట్టి అరెస్ట్ చేశారని సమత వివరించారు. ఇలాంటి ఘటనలను నిలువరించేందుకే అరన్‌పూర్ వద్ద జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చివేసినట్టు వివరించారు.
ఇతర శాఖల్లో చేరండి…
మరో వైపున మావోయిస్టు పార్టీ కొత్త నినాదాన్ని ఎత్తుకుంది. తమ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న పోలీసుల వ్యూహాలకు చెక్ పెట్టే విధంగా వ్యవహరిస్తోంది. అటవీ ప్రాంత వాసులకు కీలక సూచన చేశారు. పోలీసు ఉద్యోగాలు తప్ప ఇతర ఏ శాఖాల్లో అయినా జాబ్ చేసుకోవాలని సమత విజ్ఞప్తి చేశారు. ఇతర శాఖల్లో నియామక ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేసి పోలీస్ రిక్రూట్ మెంట్ మాత్రమే నిర్వహిస్తోందని ఆరోపించారు. దీంతో తమ కుటుంబాల పోషణ కోసం నిరుద్యోగులు పోలీసు విభాగంలో చేరుతున్నారని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తరుపున ప్రజలకు వ్యతిరేక పోరాటం యువత పాల్గొనకూడదని, ప్రజల పక్షాణ నిలబడాలని సమత కోరారు.
కారణం అదేనా..?
అయితే ఇటీవల కాలంలో చత్తీస్ గడ్ లో డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్ పేరిట దండకారణ్య అటవీ ప్రాంత యువతకు ఉపాధి కల్పించే పనిలో చత్తీస్ గడ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో బస్తర్ అటవీ ప్రాంతంలో ఉండే ఆదివాసీ యువత ఉపాది పొందేందుకు సర్కారు చూపిస్తున్న మార్గాల వైపు అడుగులు వేస్తోంది. ఇటీవల కాలంలో పూర్వ బస్తర్ లోని ఏడు జిల్లాల్లో రిక్రూట్ మెంట్ ప్రకియ పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ క్రమంలో మావోయిస్టులకు, బలగాలకు మధ్య జరుగుతున్న ఎదురు కాల్పుల ఘటనలు, మందుపాతర పేల్చివేతలప్పుడు ఇదే అటవీ ప్రాంతంలోని ఆదివాసీలు కూడా మరణిస్తున్నారు. అటు మావోయిస్టుల తరుపున, ఇటు ప్రభుత్వం తరుపున ప్రత్యక్ష్య యుద్దం చేస్తూ చనిపోతున్న వారిలో ఎక్కువ మంది ఆదివాసీ బిడ్డలే ఉంటున్నారు. తాజాగా బుధవారం దంతోవాడ జిల్లా అరన్‌పూర్ సమీపంలోని పెడ్కా వద్ద జరిగిన మందుపాతర పేల్చివేతలో 11 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో చనిపోయిన 10 మంది డీఆర్జీ జవాన్లు అంతా కూడా ఆదీవాసీ బిడ్డలే కావడంతో మావోయిస్టు పార్టీ అప్రమత్తం అవుతున్నట్టుగా అర్థమవుతోంది. బస్తర్ అటవీ ప్రాంతానికి చెందిన ఆదివాసీలే మరణిస్తుండడం ఇబ్బందికరంగా మారనుందని గమనించిన మావోయిస్టు పార్టీ వ్యూహాత్మకంగా పోలీసు విభాగంలో ఇక్కడి యువత చేరవద్దని పిలుపునిస్తున్నట్టు తెలుస్తోంది.