రేషన్ రైస్ దందాపై జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తే…?

దిశ దశ, దండకారణ్యం:

తెలంగాణాలో ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ హోల్డర్స్ కోసం సరఫరా అవుతున్న బియ్యం సరిహధ్దులు ఎలా దాటుతున్నాయి..? ఇటీవల సివిల్ సప్లై విజిలెన్స్ అధికారులు దాడులు చేయడంతో పాటు భూపాలపల్లి జిల్లా పోలీసు యంత్రాంగం ఆరా తీస్తున్నప్పటికీ గోదావరి దాటి బియ్యం ఆ ‘డెన్’కు ఎలా చేరుతున్నాయి..? టన్నుల కొద్ది బియ్యాన్ని అక్రమంగా తరలించేంత సాహసం చేయడానికి కారణమేంటీ..? ఇటీవల అధికార యంత్రాంగం కట్టడి చర్యలు చేపట్టినా అక్కడికి భారీ మొత్తంలో బియ్యం ఎలా చేరుతున్నాయన్నదే పజిల్ గా మారింది. ఇఫ్పటికీ సిరొంచ ప్రాంతం నుండి మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు బియ్యం రవాణా అవుతున్నట్టుగా తెలుస్తోంది.

విజిలెన్స్ అధికారుల ఎంట్రీ…

సివిల్ సప్లై విజిలెన్స్ అధికారులు ఎంట్రీ ఇచ్చి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరిహద్దుల్లో రెండు లారీలు, మరో రెండు వాహనాల్లో తరలిస్తున్న 700 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నట్టు వెల్లడించారు. ఈ కేసును స్థానిక పోలీసులకు అప్పగించడంతో ఆయా వాహనాల డ్రైవర్లతో పాటు యెల్లంకి వీరయ్య అలియాస్ వీరన్ అనే వ్యాపారిపై కూడా కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే రేషన్ బియ్యం అక్రమ రవాణా తీరుపై స్పెషల్ ఆపరేషన్ చేపట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది. రేషన్ బియ్యం ఇతర రాష్ట్రాలకు తరలి వెల్లకుండా కఠినంగా వ్యవహరించాలని యంత్రాంగాన్ని ఆదేశించినట్టు సమాచారం. అయితే బియ్యం దందాతో సంబంధం ఉందన్న అనుమానంతో కరీంనగర్ కు చెందిన ఓ రైస్ మిల్లు యజమానిని కూడా భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన పోలీసు అధికారులు విచారించి వదిలేసినట్టు తెలుస్తోంది. అయితే విజిలెన్స్ అదికారులు బియ్యం తెలంగాణ సరిహద్దుల్లో పట్టుకోలేదని… మహారాష్ట్రకు వచ్చి స్వాధీనం చేసుకున్నారంటూ సదరు వ్యాపారులు వాదనలు తెరపైకి తీసుకొచ్చినట్టుగా విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకు సంబందించిన సీసీ ఫుటేజీని కూడా పోలీసు అధికారుల ముందు ఉంచి… అధికారులు తమ లిమిట్స్ దాటుతున్నారని కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది.

ఇలా అయితే బెటర్…

అయితే సదరు డెన్ కేంద్రంగా సాగుతున్న రేషన్ బియ్యం అక్రమ దందా వ్యవహారంలో రాష్ట్ర సరిహద్దు సమస్యను తీవ్రంగా చూపుతున్న వ్యాపారులపై కఠినంగా వ్యవహరించేందుకు బార్డర్ జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం జాయింట్ ఆపరేషన్ చేపట్టినట్టయితే వాస్తవాలు కూడా వెలుగులోకి వస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు రాష్ట్రాలకు చెందిన రెవెన్యూ, పోలీసు విభాగాల నేతృత్వంలో తనిఖీలు చేపట్టి లీగల్ సమస్యలు ఉత్పన్నం కాకుండా జాగ్రత్త పడితే భారీ దందాకు చెక్ పెట్టవచ్చు. అధికారులు పరిధులు దాటారన్న అంశాన్ని ఎత్తి చూపుతూ మహారాష్ట్ర కోర్టులను ఆశ్రయించి లీగల్ ఫైట్ జరుపుతామని చెప్తున్నట్టుగా ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సదరు డెన్ నుండి లారీల కొద్ది బియ్యం రవాణా అవుతున్న తీరుతో పాటు అక్కడకు బియ్యం చేరుకుంటున్న విషయాలు కూడా సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యే అవకాశం లేకపోలేదు. దీంతో అదే డెన్ లోని సీసీ ఫుటేజీని ఆధారం చేసుకుని అక్కడి న్యాయ వ్యవస్థ ముందు ఉంచడం, అక్కడ దొరికిన బియ్యాన్ని ల్యాబ్ టెస్ట్ కు పంపించడం వంటి చర్యలకు శ్రీకారం చుట్టినట్టయితే అసలు కథ అంతా కూడా బట్టబయలు కానుంది. దీంతోపాటు సరిహధ్దులు దాటించి అక్కడి చట్టాల్లో బియ్యం దందాపై ఆంక్షలు లేవన్న బూచిని చూపిస్తూ అక్రమ దందాకు తెరలేపి… తెలంగాణాలో పేదలకు సరఫరా చేస్తున్న బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారన్న విషయంతో పలు చట్టపరమైన విషయాలను మహారాష్ట్ర కోర్టుల ముందు ఉంచినట్టయితే స్మగ్తింగ్ దందాకు మూల కారుకులకు శిక్ష కూడా పడే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది. నిత్యం రూ. కోట్ల విలువ చేసే సబ్సిడీ బియ్యం సరిహధ్దులు దాటించి చేస్తున్న దందా వళ్ళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యానికి భారీగా తూట్లు పడుతున్నాయని దీనివల్ల ప్రభుత్వ ధనం కూడా కోట్లలో దారి మల్లుతోందన్న విషయాన్ని కూడా అక్కడి కోర్టుల ముందు ఉంచినట్టయితే కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు. అంతేకాకుండా ఈ బియ్యం దందాలో భాగస్వాములైన వారితో పాటు వెన్నుదన్నుగా వ్యవహరిస్తున్న వారిని కూడా వేటాడి పట్టుకునేందుకు కోర్టుల నుండి అనుమతులు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది.

You cannot copy content of this page