ట్రాజెడీగా మారిన జర్నలిస్ట్ మిస్సింగ్…

బీజాపూర్ జిల్లాలో విషాదం…

న్యూఈయర్ రోజునే కిడ్నాప్…

దిశ దశ, దండకారణ్యం:

దండకారణ్యంలో మావోయిస్టులు, బలగాలకు మధ్య సాగుతున్న పోరు మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలస్తోంది. కానీ అక్కడి జర్నలిస్టులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవల్సి వస్తుందన్న విషయం ఎవరికీ తెలియదు. పోలీసులు, నక్సల్స్ మధ్య సమిధలుగా నలిగిపోతున్న జర్నలిస్టులను టార్గెట్ చేయడంతో సరిపెట్టుకుండా హత్య చేసే స్థాయికి చేరుకుంది  మాఫియా. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పెద్ద ఎత్తున అభివృద్ది పనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంగా మారిన తీరును వెలుగులోకి తెచ్చిన పాపానికి ఓ జర్నలిస్టును అతి దారుణంగా హత్య చేశారు.

ఒకటిన మిస్సింగ్…

చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా కేంద్రానికి చెందిన జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్ జనవరి 1వ తేది రాత్రి అదృశ్యం అయ్యాడు. ఇంటి వద్ద ఉన్న ముఖేష్ చంద్రకర్ మొబైల్ స్విచ్ఛాప్ చేయగా అతని కారు ఇంటివద్దే ఉంది. ముఖేష్ చంద్రకర్ సోదరుడు జర్నలిస్ట్ యుకేష్ చంద్రకర్ మరునాడు బీజాపూర్ తో పాటు సమీప ప్రాంతాల్లో ఆరా తీశారు. అతని ఆచూకి లభిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సోషల్ మీడియా ద్వారా కూడా అభ్యర్థించారు. ముఖేష్ చంద్రకర్ మిస్సింగ్ విషయంలో అతని కుటుంబ సభ్యులతో పాటు బస్తర్ పూర్వ జిల్లాలకు సంబంధించిన జర్నలిస్టు సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. యుకేష్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని ముఖేష్ చంద్రకర్ కోసం ఆరా తీయడం ఆరంభించారు. ఓ బృందాన్ని ఢిల్లీకి కూడా బస్తర్ ప్రాంత పోలీసు అధికారులు పంపించినట్టుగా సమాచారం. ముఖేష్ మొబైల్ స్విచ్ఛాప్ కావడంతో ఏ టవర్ లోకేషన్ లో ఉన్నాడన్న విషయాన్ని గుర్తించడం పోలీసులకు ఇబ్బంది కరంగడా మారింది. దీంతో ముఖేష్ చంద్రకర్ స్నేహితులతో పాటు అనుమానితులను విచారించేందుకు పోలీసులు కార్యరంగంలోకి దిగారు. బస్తర్ ఐజీ సుందర్ రాజ్ పి కూడా జర్నలిస్ట్ ముఖేష్ మిస్సింగ్ గురించి ఎప్పటికప్పుడు సంబంధిత పోలీసు అధికారులతో చర్చించారు.

సెప్టిక్ ట్యాంకులో..?

అయితే అనుమానిత వ్యక్తలను విచారిస్తున్న క్రమంలో పోలీసులకు కీలకమైన సమాచారం అందినట్టుగా తెలుస్తోంది. ఈ క్లూ ఆధారంగా ముఖేష్ చంద్రకర్ ఏమయ్యాడన్న విషయం తెలుసుకునేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకు సంబంధించిన వారిని ఇంటరాగేషన్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆయన ఇంటికి 2 కిలో మీటర్ల దూరంల, బీజాపూర్ పోలీస్ స్టేషన్ కు 5 కిలోమీటర్ల దూరంలోని చట్టన్‌పరా ఓ ఇంటి ఆవరణలో ఉన్న సెప్టిక్ ట్యాంక్ లో ముఖేష్ చంద్కర్ ను చంపి పాతిపెట్టారని పోలీసులు గుర్తించారు. సెప్టిక్ ట్యాంకులో చంద్రకర్ మృతదేహాన్ని వేసిన హంతకులు కాంక్రీట్ మిక్స్ ను కూడా వేసి శవం ఆనవాళ్లు బయటకు తెలియకుండా ఉండేందుకు జాగ్రత్త పడినట్టుగా తెలుస్తోంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకుని జేసీబీలతో కాంక్రీట్ తొలగించే పనిలో నిమగ్నం అయ్యారు. ఈ ప్రాంతంలో బలగాలను నియమించి ప్రత్యేక బందోబస్తు చర్యలు చేపట్టారు.

కారణం అదేనా..?

నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన బీజాపూర్ ప్రాంతంలో వందల కోట్లు వెచ్చించి రహదారులు, వంతెనల నిర్మాణం చేపడుతోంది ప్రభుత్వం. నక్సల్స్ ఏరివేత కోసం కెటాయిస్తున్న ఈ నిధుల ద్వారా జరుగుతున్న పనుల్లో అవకతవకలను వెలికి తీయడంలో ముకేష్ చంద్రకర్ దూకుడుగా వ్యవహరిస్తారని బీజాపూర్ ప్రాంత రిపోర్టర్లు చెప్తున్నారు. గత డిసెంబర్ 30న సహచర జర్నలిస్ట్ నీలేష్ జీతో కలిసి ఓ న్యూస్ ప్రజెంట్ చేశారు ముఖేష్ చంద్రకర్. మిర్టూర్, హిరోలి రోడ్డుకు రూ. 56 కోట్లు మంజూరు కాగా 120 కోట్లకు అంచనాలు పెంచి రివైజ్ చేశారు అధికారులు. అంత పెద్ద ఎత్తున నిధులు కెటాయించినప్పటికీ నిర్మాణంలో  అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని న్యూస్ ప్రజెంట్ చేశారని బీజాపూర్ జర్నలిస్టులు తెలిపారు.  ఈ వార్త కథనానికి స్పందించిన మంత్రి అరుణ్ సావ్ జీ విచారణ కోసం ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించి దర్యాప్తు చేయాలని ఆదేశించారని తెలిపారు. నిర్మాణాల విషయంలో జరుగుతున్న అక్రమాలను వెలికి తీసినందుకే కాంట్రాక్టర్ ముఖేష్ చంద్రకర్ ను హత్య చేయించి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన శవం ఉందని సమాచారం అందుకున్న ఇల్లు కూడా కాంట్రాక్టర్ కు సంబంధించిన వారిదేనని కూడా తెలుస్తోంది. బీజాపూర్ జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో చేపట్టిన అభివృద్ది పనుల్లో జరుగుతున్న అవినీతిని వెలుగులోకి తీసుకొచ్చినందుకే ముఖేష్ చంద్రకర్ ను హత్య చేసేందుకు కుట్ర పూరితమైన వ్యూహం రచించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాంట్రాక్టర్ సురేష్ చంద్రకర్ భారీ స్కెచ్ వేసి ముఖేష్ చంద్రకర్ ను హత్య చేయించాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఆత్మీయతను పంచి…

ముకేష్ చంద్రకర్ జర్నలిస్టుగా సమాజ హితమే లక్ష్యంగా పనిచేసేవాడు. ఆయన అన్ని వర్గాల వారితోనూ ఆత్మీయునిగా ఉంటారని ఇతర ప్రాంతాల నుండి వచ్చే జర్నలిస్టు సహచరులకు ఆతిథ్యం ఇవ్వడంలో ముందుంటారని బీజాపూర్ వాసులు తెలిపారు. దేశం నలు మూలల నుండి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కవరేజ్ కోసం వచ్చే జర్నలిస్టులను ఆదరించే వాడని తెలిపారు. బీజాపూర్ కు వెల్లినట్టయితే ముఖేష్ చంద్రకర్ ను కలిస్తే చాలు అన్న నమ్మకంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వెల్లే సీనియర్ జర్నలిస్టులు ఉంటారంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. మావోయిస్టులు పలుమార్లు బలగాలను కిడ్నాప్ చేసినప్పుడు కూడా ముఖేష్ చంద్రకర్ చొరవ తీసుకుని వారిని చెర విడిపించారు. నక్సల్స్ కిడ్నాప్ చేసిన పోలీసు బలగాలను కాపాడే విషయంలో కూడా ప్రాణాలకు తెగించి మావోయిస్టు నేతలతో చర్చలు జరిపిన సందర్భాలు ఉన్నాయని బీజాపూర్ జర్నలిస్టులు వివరించారు. అటువంటి జర్నలిస్టును హతం చేసే పరిస్థితి వచ్చిందంటే బీజాపూర్ లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చని స్థానిక జర్నలిస్టు సమాజం అంటోంది. సహచర జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ మర్డర్ అయ్యాడన్న విషయాన్ని సహచర జర్నలిస్టులు జీర్ణించు  కోలేకపోతున్నారు. 

You cannot copy content of this page