కలం కార్మికుల కష్టాలు…

మహాప్రభో సాయంచేయండంటూ యాచించిన జర్నలిస్టులు

దిశ దశ, జగిత్యాల:

జర్నలిస్టులు జనులికిస్టులుగా సమాజంలో గుర్తింపు పొందినా కుటుంబ పోషణ భారమై జీవనం సాగిస్తున్న వారెందరో..? కష్టాల సుడిగుండాల్లో చిక్కుకున్న జర్నలిస్టుల కుటుంబాల ధైన్యం తెలిస్తే కన్నీటి పర్యంతం కావల్సిందే. సమాజంలో గొప్పగా బ్రతుకుతున్నారన్న ఒక్ ఫీలింగ్ మాత్రమే వారి సొంతం కానీ అసలు నిజం తెలియాలంటే కొందరి కుటుంబాల వైపు తొంగి చూస్తే లోపలి కోణం కనిపిస్తుంది. కలమే ఊపిరిగా కాలం వెల్లదీసిన జర్నలిస్టులు కానరాని లోకాలకు చేరినా ఆ కుటుంబాలకు బాసటనిచ్చే వారే లేకుండా పోయారు. మరణించిన క్షణం వినే సానుభూతి మాటలు తప్ప చేతలకు దూరంగా ఉండే సమాజంలో జర్నలిస్టు సమాజం కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో స్వరాష్ట్ర కాల సాకారం అయిన తరువాత తమ జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరిస్తాయన్న కొంగొత్త ఆలోచనలతో ముందుకు సాగింది తెలంగాణ జర్నలిస్టు సమాజం. ఇందుకు అనుగుణంగానే తెలంగాణ ప్రెస్ అకాడమీకి ఆర్థిక పరిపుష్టి కల్పించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి నిధులు కూడా అలాట్ చేసింది. కానీ ఆరంభ శూరత్వమే అన్నట్టుగా కొంతకాలం జర్నలిస్టులకు అవసరమైన ఆర్థిక సాయం సకాలంలో అందినా ఇటీవల కాలంలో మాత్రం ఎందుకనో సాయం కోసం పెట్టుకున్న దరఖాస్తు తాలుకూ ఫెళ్లు నత్తలకే నడకలు నేర్పుతున్నట్టుగా మారింది. కారణం ఏదైనా కష్టాల కడలిలో కుటుంబాన్ని అర్థాంతరంగా వదిలేసి వెల్లిన జర్నలిస్టుల కుటుంబాలు మాత్రం ఆ సాయమైనా అందితే బాగుండు అని కళ్లల్లో వత్తులేసుకుని మరీ ఎదురు చూస్తున్నాయి. చేసేదేమి లేక జర్నలిస్ట్ యూనియన్ యాచించే పనిలో పడిపోయింది. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు బాసట ఇవ్వాలన్న లక్ష్యంతో జగిత్యాల జిల్లా టీయూడబ్లుజే (ఐజేయూ) బిక్షాటన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు బాసటగా విరాళాల యాచన పేరిట జర్నలిస్టు సంఘం జిల్లాలోని వివిధ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగించింది. జిల్లాలోని బీర్పూర్, వెల్గటూర్, పెగడపల్లి, ధర్మపురి, మల్యాల, కొడిమ్యాల తదితర మండలాల ప్రెస్ క్లబుల ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. జగిత్యాల జిల్లాలో దాదాపు పది మంది జర్నలిస్టు లు మరణించగా వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాతున్నాయి. వీరి కుటుంబాలకు ప్రెస్ అకాడమీ ద్వారా లక్ష ఆర్థిక సాయం, నెల 3000/- పెన్షన్, వారి వారసులు చదుకునేందుకు ఫీజు చెల్లించే విధానం అమలు చేశారని అయితే వీరిని ఆదుకునేందుకు దరఖాస్తు చేసుకున్నా ప్రెస్ అకాడమీ నుండి సాంక్షన్ కావడం లేదని ఐజేయూ నాయకులు అంటున్నారు. 14 నెలల క్రితమే సాయం కోసం అర్జీలు పెట్టుకున్నా ఆమోదం కాక పోవడం విస్మయం కల్గిస్తోందని అంటున్నారు. యూనియన్ ప్రతినిధులు కూడా పలుమార్లు ప్రెస్ అకాడమీకి వినతి చేసినా ఫలితం మాత్రం కానరావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు బిక్షాటన కార్యక్రమం చేపట్టాల్సి వచ్చిందని, ఇకనైనా ప్రెస్ అకాడమీ జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకునే దిశగా చర్యలు తీసుకోవాలని ఐజెయూ డిమాండ్ చేస్తోంది. ఈ పరిస్థితి ఒక్క జగిత్యాల జిల్లాలోనే లేదని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని అంటున్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్లు (ఐజేయు) జగిత్యాల జిల్లా అధ్యక్ష్య కార్యదర్శులు చీటీ శ్రీనివాసరావు,
మోరేపల్లి ప్రదీప్ కుమార్, జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎండి ఇమ్రాన్, జె సురేందర్ కుమార్, వివిధ ప్రెస్ క్లబ్ ల అధ్యక్ష, కార్యదర్శులతో జర్నలిస్టులు పాల్గొన్నారు.

వెల్గటూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో
కొడిమ్యాల ప్రెస్ క్లబ్ ఆద్వర్యంలో
బీర్పూర్ ప్రెస్ క్లబ్

You cannot copy content of this page