టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌పై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తనదైన రీతిలో కామెంట్లు చేశారు. ఎన్టీఆర్ పేరు పది కాలాలపాటు వినిపించాలంటే పార్టీ బాధ్యతలు జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాలని సూచించారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్‌ను లోకేష్ ఆహ్వానించడమేంటీ? అని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్‌కు విశ్వసనీయత లేదని మండిపడ్డారు. టీడీపీని కాపాడడం తమ వల్ల కాదని చంద్రబాబు, లోకేష్‌కు అర్ధమైందని చెప్పారు.
టీడీపీ జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగిస్తే.. పార్టీ ప్రతిపక్షంలోనైనా ఉంటుందని కొడాలి నాని వ్యాఖ్యానించారు. టీడీపీ ఊబి లాంటిది.. ఆ పార్టీని కాపాడేందుకు ఎవరెళ్లినా కూరుకుపోవడం ఖాయమని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం పామర్రు, చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరి, లోకేష్ పోటీ చేసిన మంగళగిరిలో పార్టీని గెలిపించలేని వాళ్లు.. టీడీపీని ఏం రన్ చేస్తారని అడిగారు. మార్పు కావాల్సింది టీడీపీలోనే.. రాష్ట్రంలో కాదని తెలిపారు.
మంగళగిరిలో నారా లోకేష్ తరపున బ్రహ్మాణి ప్రచారం చేసినా ఓడిపోయాడని కొడాలి నాని తెలిపారు. కానీ, బ్రాహ్మణినే పోటీ చేసుంటే గెలిచేవారని తెలిపారు. లోకేష్‌కు విశ్వసనీయత లేదని.. తనను వాడుకుని ఆ తర్వాత ఎలా అవమానించారో జూనియర్ కు తెలీదా అని వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికల్లో గెలిచాక ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో జూ.ఎన్టీఆర్‌ను గ్యాలరీలో కూర్చొబెట్టి అవమానించారని తెలిపారు. చంద్రబాబు ఎలాంటి వాడో తన తాత, తండ్రి, మేనత్తలు చెప్పింది ఆయన వినే ఉంటాడని అన్నారు.