దిశ దశ, హైదరాబాద్:
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ కు మరో షాక్ ఇచ్చేలా ఉన్నారు హైదరాబాద్ సిటీ పోలీసులు. అతని బెయిల్ రద్దు కోరుతూ హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. చిన్న యాక్సిడెంట్ కేసులో నిందితునిగా తప్పించుకునేందుకు వేసిన తప్పటడుగుల ఫలితంగా రాహిలపై నాన్ బెయిలబుల్ సెక్షన్లలో కేసు నమోదు అయింది. అయితే ఈ కేసులో కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేయడంతో హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ వేయనున్నట్టుగా తెలుస్తోంది.
మరో ట్విస్ట్…
పంజాగుట్టలోని ప్రజా భవన్ వద్ద డివైడర్లను ఢీ కొట్టిన సంఘటనలో తన స్థానంలో మరోకరిని నిందితునిగా చూపించి తప్పించుకున్న కేసు తరువాత పోలీసులు గతంలో జరిగిన యాక్సిడెంట్ ఘటనల గురించి కూడా ఆరా తీసినట్టుగా సమాచారం. 2022లో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసుపై కూడా పోలీసు అధికారులు ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. ఈ కేసును రీ ఓపెన్ చేసి మళ్లీ దర్యాప్తు చేయాలని అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. ఈ కేసులోనూ రాహిల్ ను తప్పించి మరోకరిని నిందితునిగా చేర్చినట్టుగా పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఛార్జిషీట్ కూడా దాఖలు చేసినప్పటికీ మళ్లీ విచారించి బాధితుల వాంగ్మూలం తీసుకోనున్నారు. ఈ ఘటనలో చిన్నారి మి చెందింది. ఈ యాక్సిడెంట్ కేసును మళ్లీ విచారించిన తరవుతా నిందితుడిని మార్చినట్టుగా తేలితే మాత్రం అప్పటి పోలీసు అధికారులపై కూడా క్రమ శిక్షణా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో రాహిల్ విషయంలో చేసిన తప్పిదమే జూబ్లిహిల్స్ రోడ్ యాక్సిడెంట్ విషయలోనూ చేసి ఉంటారని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు.