అద్భుత ఆవిష్కరణ జరనుందా..?

సౌత్ పోల్ పరిశోధనలకు మరో అడుగు దూరంలో

సరికొత్త అధ్యాయానికి కొన్ని గంటలే నిరీక్షణ…

దిశ దశ, న్యూ ఢిల్లీ:

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ పరిశోధనల్లో మరో అద్భుత ఆవిష్కరణకు కొన్ని గంటలే సమయం ఉంది. చంద్రుడి దక్షిణ ధృవం వైపు సూర్యుడు తన కిరణాలను ప్రసరించే ప్రక్రియ మొదలు పెట్టగానే మన శాస్త్రవేత్తల అంచనాలు అందుకుంటే చరిత్ర తిరగరాసినట్టే. ఇప్పటికే ప్రపంచమంతా మనవైపు చూసే పరిస్థితి తీసుకొచ్చిన మన అంతరిక్ష పరిశోధకులు వేయనున్న మరో అడుగు కూడా సక్సెస్ అయితే సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన వారం అవుతారు. బుధవారం తెల్లవారు జాము నుండి చంద్రుని దక్షిణ ధృవంలో ఉన్న చంద్రయాన్ మాడ్యూళ్లు పనిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు మన శాస్త్రవేత్తలు. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు ల్యాండ్ చేసిన ప్రాంతంలో -200 డిగ్రీల సెల్సియస్ ఉష్టోగ్రతలు ఉంటాయి. ఇక్కడ స్లీప్ మోడ్ లో ఉన్న మాడ్యూల్స్ ను పునరుద్దించే పనిలో పరిశోధకులు నిమగ్నం అయ్యారు. గురువారం లేదా శుక్రవారం సూర్యరశ్మి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నందున ల్యాండర్, రోవర్ మాడ్యూల్స్ తో పాటు ఆన్ బోర్డు పరికరాలు పునరుద్దరుద్దరించేందుకు ప్రయత్నిస్తున్నామని ఇస్రో అధికారులు ప్రకటించారు. ఈ మాడ్యూల్స్ పనిచేస్తాయన్న అంచనాతో మాత్రమే ముందుకు సాగుతున్నాం కానీ అవి ఖచ్చితంగా పనిచేస్తాయని మాత్రం చెప్పడం లేదని వారు అంటున్నారు. సౌరశక్తితో తయారు చేసిన చంద్రయాన్ 3 మాడ్యూల్స్ భూమిపై దాదాపు 14 రోజుల సమానమైన ఒక చాంద్రమాన దినం వరకు పనిచేసే విధంగా తీర్చిదిద్దారు. అయితే సోలార్ సిస్టం ద్వారా మాడ్యూల్స్ పనిచేస్తున్నందున చాంద్రమానం ప్రకారం సూర్యరశ్మి ఉన్న సమయంలోనే వాటిని ఎక్కడికక్కడ స్లీప్ మోడ్ లోకి పంపించి ఆపరేషన్ విధానానికి బ్రేకులు వేశారు. అయితే సూర్యస్తమయానికి ముందుగానే వీటిని స్లీప్ మోడ్ లోకి పంపించినందున చాంద్రమానం ప్రకారం రాత్రి ముగిసిన తరువాత అంటే 14 ఎర్త్ డేస్ కంప్లీట్ అయిన తరువాత అక్కడ పడుతున్న సూర్య కిరణాల ఆధారంగా పనిచేస్తాయా లేదా అన్న ఉత్కంఠత నెలకొంది. గురు, శుక్రవారాల్లో సూర్యుడు చంద్రుని దక్షిణ ధృవంపై ప్రకాషించనుండడంతో పాటు మరో 14 నుండి 15 రోజుల పాటు అక్కడ పగలుగానే ఉంటుంది. కాబట్టి విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు పునరుద్దరించబడినట్టయితే తమ అంచనాలకు అనుగుణంగా తమ ప్రయోగాలు సక్సెస్ అయినట్టేనని పరిశోధకులు అంటున్నారు. వీటిని రీబూట్ చేసిన తరువాత మరో 15 రోజుల వరకు సౌత్ పోల్ పై మరిన్ని పరిశోధనలు జరిపేందుకు అవకాశం చిక్కినట్టు అవుతుంది. ల్యాండర్, రోవర్ పార్క్ చేసిన శివశక్తి పాయింట్‌లోనే సూర్యుడు ఉదయిస్తాడని ఇస్రో బృందం అంచనా వేస్తోంది. సూర్యుడు ఉదయించగానే పరికరాలు మళ్లీ జీవం పోసుకుంటాయని ఆశిస్తున్నారు. ఇస్రో పరిశోధకుల అంచనా ప్రకారం చంద్రుని సూర్యాస్తమయానికి ముందు, విక్రమ్ మరియు ప్రజ్ఞాన్‌లోని పరికరాలను దశలవారీగా స్లీప్ మోడ్ లోకి వెల్లేలా చేశారు. సెప్టెంబరు 2న ప్రారంభమైన ఈ ప్రక్రియ సూర్యకాంతితో నడిచే మాడ్యూళ్ల బ్యాటరీలు ఛార్జ్ చేసుకుంటూ తెల్లవారుజామున కాంతిని అందుకునే విధంగా సోలార్ ప్లేట్లను అమర్చారు. అయితే చంద్రుని దక్షిణ ధృవంలో ఉన్న ఈ మాడ్యూల్స్ అక్కడ ఉన్న -200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తట్టుకుని సూర్యరశ్మి ప్రారంభం కాగానే ‘ప్రజ్ఞాన్ విక్రమ్’లు పునురుద్దరించబడతాయా అన్నదే సవాలుగా మారింది. ఆన్‌బోర్డ్ సాధనాలు చంద్రునిపై అతి శీతలీకరణ వాతావరణాన్ని తట్టుకున్నట్టయితే మాత్రమే మాడ్యూల్స్ తమ పనిని యథావిధిగా ప్రారంభిస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రణాళిక ప్రకారం పనులు జరిగితే, కమాండ్‌లు రోవర్‌లోకి ఫీడ్ అయిన తర్వాత రోవర్ కదలడం ప్రారంభిస్తుంది. ఆ తరువాత ల్యాండర్ మాడ్యూల్‌పై యథావిధిగా పరిశోధనలు చేయడం మొదలుపెట్టనుంది. దీంతో మరో 14 నుండి 15 రోజుల పాటు దక్షిణ ధృవానికి సంబంధించిన వివరాలు ఇస్రోకు చేరే అవకాశాలు ఉంటాయి. ఇదే జరిగితే మాత్రం భారత అంతరిక్ష పరిశోధనలు సరికొత్త అధ్యాయాన్ని లిఖించినట్టు అవుతుంది.

You cannot copy content of this page