జర్నలిస్టుపై దాడి చేసిన వారిని దండించాలి… నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి…

కేంద్ర మంత్రి బండి సంజయ్ కి డబ్లూజేఐ వినతి

దిశ దశ, కరీంనగర్:

దళిత జర్నలిస్టుపై హత్యయత్నానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో పోలీసు యంత్రాంగం మీనామేషాలు లెక్కిస్తోందని, నిందితులపై నేర చరిత్ర ఉన్న నేపథ్యంలో చట్టాలను అమలు చేయడంలో వెనుకంజ వేస్తున్నారని డబ్లూజేఐ నేతలు ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ని డబ్లూజేఐ నేతల బృందం, బాధితుడు సుదర్శన్ లు కలిశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు విలేఖరి నిట్ట సుదర్శన్ పై కిరాతకంగా దాడి చేసిన విషయంలో అన్యాయం జరుగుతోందని కేంద్ర మంత్రికి వివరించారు. సుదర్శన్ పై దాడి చేసి వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారంటే నిందితులు పైశాచికత్వం ఏస్థాయిలో ఉందో గమనించాలని అభ్యర్థించారు. దళిత జర్నలిస్టు అయినప్పటికీ అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయన్న కారణంతో పోలీసులు నిందితులపై కఠినంగా వ్యవహరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసి జైలుకు పంపించకుండా వారికి నోటీసులు ఇచ్చి పంపించారని, ప్రధాన నిందితులను అరెస్ట్ చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సుదర్శన్ పై ఇప్పటికే పలు మార్లు ఈ గ్యాంగ్ దాడి చేసిందని అందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ లు కూడా ఉన్నప్పటికీ పోలీసు అధికారులు ఒత్తిళ్లకు తలొగ్గి బాధితునికి న్యాయం చేయలేకపోతున్నారని ఆరోపించారు. తనపై జరిగిన హత్యోదంతంలో పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టే విధంగా పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించాలని సుదర్శన్ కేంద్ర మంత్రిని వేడుకున్నారు. ఈ కేసులో భాగస్వాములైన నిందితులకు అధికార పార్టీ నాయకులే కాకుండా పోలీసు అధికారులు కూడా సన్నిహితులు కావడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని బాధితుడు కన్నీటి పర్యంతం అయ్యాడు. తనకు రక్షణ లేకుండా పోయిందని, నిందితులు మళ్లీ దాడి చేసే ప్రమాదం ఉన్నందున తనకు న్యాయం జరిగేలా చొరవ చూపాలని కోరారు. అంతేకాకుండా దళిత సామాజిక వర్గానికి చెందిన తనపై జరిగిన దాడి విషయంలో అట్రాసిటీ కేసు కూడా నమోదయినప్పటికీ విచారణ చేయడంలో జాప్యం ప్రదర్శిస్తున్నారని ఇందుకు సంబంధించిన నివేదికలను కోర్టుకు సమర్పించి నిందితులను అరెస్ట్ చేయించేందుకు కూడా అధికారులను ఆధేశించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను సుదర్శన్ కోరారు.

కఠినంగా వ్యవహరించాల్సిందే: బండి సంజయ్

బాధితుడు సుదర్శన్ కేసు విషయంలో పోలీసు అధికారులు చట్టాలను అమలు చేయడంలో కఠినంగా వ్యవహరించాల్సిందేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి నిందితులకు వత్తాసు పలకకుండా ఉండాలని ఆదేశాలు జారీ చేస్తానన్నారు. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి బాధితుడికి బాసటగా నిలవాలని కూడా సూచిస్తానన్నారు. సుదర్శన్ పై జరిగిన దాడి వివరాలను కులంకశంగా అడిగి తెలుసుకున్న కేంద్ర మంత్రి ఇంత దారుణంగా దాడి చేయడం ఆందోళన కల్గిస్తోందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన వారిలో వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా నాయకులు న్యాలకొండ అనిల్ రావ్, తాడూరు కరుణాకర్, శివనాద్రి ప్రమోద్ కుమార్, టి సత్యనారాయణ, దారం జగన్నాథరెడ్డి, ఆడెపు లక్ష్మీనారాయణ, మొగురం రమేష్ తదితరులు ఉన్నారు.

You cannot copy content of this page