పడిపోతుందన్న పార్టీ కండువానే కప్పుకున్న కడియం…

దిశ దశ, వరంగల్:

ఆరు నెలల్లో అధికార పార్టీ గద్దె దిగడం ఖాయం… సీఎంగా కేసీఆర్ కావడం ఖాయమంటూ ఘంటాపథంగా చెప్పాడా నేత… ఆయన చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ పార్టీ బలం… బలగం ఏంటీ..? ప్రభుత్వాన్ని కూల్చేందుకు గ్రౌండ్ వర్క్ ఏమైనా చేస్తొందా అన్న చర్చ మొదలైంది అన్ని వర్గాల్లో. ఈ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతోందా అన్న తర్జన భర్జనలు కూడా సాగాయి. ఆరు నెలల మాట అటుంచితే ఆ వ్యాఖ్యలు చేసిన నాయకుడే నెలల వ్యవధిలోనే అర్థాంతరంగా పార్టీని వీడడమే సంచలనంగా మారింది. ప్రభుత్వం పతనం ఖాయమని వ్యాఖ్యానించిన కడియం శ్రీహరి ఎట్టకేలకు కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే ఇప్పటికే ఆయన ఆయన కూతురు కావ్యను వరంగల్ లోకసభ అభ్యర్థిగా బరిలో నిలిపేందుకు బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అభ్యర్థిగా ప్రకటించిన తరువాత కడియం కావ్య బీఆర్ఎస్ పార్టీపై వస్తున్న ఆరోపణలను ఊటంకిస్తూ గులాభి పార్టీకి బైబై చెప్పేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తరువాత తన అనుచరులతో సమావేశం అయిన కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే లాంఛనం కూడా పూర్తయిపోయింది.

ఎందుకిలా..?

కడియం శ్రీహరి తీసుకున్న నిర్ణయం వెనక అసలు కారణమేంటన్నదే అంతుచిక్కకుండా పోతోంది. ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో జరిగిన పరిణామాలు ఆయనను క్షోభ పెట్టాయా..? లేక నిజంగానే కవిత అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్ తో పాటు ఇతరాత్రా ఆరోఫణలను అంతర్మథనంలోకి నెట్టేశాయా అన్న విషయంపై మాత్రం క్లారిటీ రావడం లేదు. మరోవైపున కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకున్న నిర్ణయం సంచలనంగానే మారిందని చెప్పాలి. కడియం చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం లేచిన సంగతి అందరికీ తెలిసిందే. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేసిన కడియం చేరిక కోసం ఆ పార్టీ స్పెషల్ ఆపరేషన్ చేపట్టడం వెనక ఆంతర్యం ఏంటోనన్న డిస్కషన్ జోరుగా సాగుతోంది. కడియం కోసమే వరంగల్ లోకసభ కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించ లేదా అన్న విషయంపై కూడా చర్చిస్తున్నారు. మరో వైపున ప్రభుత్వం కూలిపోతుందని ప్రకటించిన నాయకున్నే తమకు అనుకూలంగా మల్చుకుంటే ఎలా ఉంటుంది అని భావించి కాంగ్రెస్ పార్టీ కడియం ఓకే అనేలా పావులు కదిపి ఉంటుందని కూడా భావిస్తున్నారు. మరో వైపున బీఆర్ఎస్ పార్టీలో జరిగిన పరిణామాలు… అంతర్గత భేటీలో చర్చకు వచ్చిన అంశాలు నచ్చక కడియం కాంగ్రెస్ పార్టీలోకి చేరారని కొందరు అంటున్నారు.

కావ్య కోసమేనా..?

మరో వైపున కడియం పక్కాగా తన వారసురాలి భవితవ్యం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరి ఉంటాడన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. చాలా కాలంగా కావ్యను రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న ఆయన అవకాశం కోసం వేచి చూస్తున్నారు. గతంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా వారసురాలివి నీవేనా నీకు భవిష్యత్తు ఉంటుందంటూ వ్యాఖ్యానించారన్న ప్రచారం కూడా ఉంది. కావ్య కూడా వర్దన్నపేట ఆసుపత్రిలో పనిచేస్తున్నప్పటి నుండే జనాలతో మమేకమయ్యే ప్రయత్నాలు చేశారు. కానీ అనుకూలమై వాతావరణం లేకపోవడంతో వెయిట్ అండ్ సీ అన్న ధోరణీలో ఎదురు చూస్తున్నట్టుగా వరంగల్ జిల్లాలో నడుస్తున్న టాక్. ఈ క్రమంలో లోకసభ అభ్యర్థిగా కావ్యకు అవకాశం వచ్చినప్పటికీ గెలుపు అవకాశాలు కనుచూపు మేరలో కనిపించకపోయే సరికి కడియం సడెన్ డెసిషన్ తీసుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. తన కూతురు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే కడియం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు చెప్పకనే చెప్పిన మాటలను బట్టి అర్థమవుతోంది.

You cannot copy content of this page