దిశ దశ, వరంగల్:
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల అయింది తెలంగాణాలోని వరంగల్ స్థానానికి స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం కావ్యను అభ్యర్థిగా ప్రకటించింది అధిష్టానం. బీఆర్ఎస్ పార్టీలో మొదట అభ్యర్థిగా ప్రకటించిన తరువాత ఫోన్ ట్యాపింగ్ తో పాటు ఇతరాత్ర కారణాలను చూపుతు తాను పోటీ నుండి తప్పుకుంటున్నానని కడియం కావ్య ప్రకటించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె అభ్యర్థిత్వానికే ఆమోద ముద్ర వేసింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.
దశాబ్ద కాలంగా…
కడియం కావ్య రాజకీయాల్లోకి అడుగు పెట్టేందుకు దాదాపు దశాబ్ద కాలంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుండే తన కూతురిని వారసురాలిగా ఎంట్రీ ఇప్పించినట్టయితే అన్నింటా మేలనుకుని కడియం శ్రీహరి కూడా పావులు కదిపారు. అవకాశం కోసం తండ్రి తనయలు ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే కనిపించాయి. వర్దన్నపేట ఆసుపత్రిలో పనిచేసినప్పుడు కావ్య డ్యూటీకి వెల్లొచ్చే క్రమంలో ప్రజలతో మమేకం అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. పొలాల్లో పనిచేసే కూలీలతో కలిసిపోవడం… వారితో కలిసి భోజనం చేయడం వంటి చర్యలతో ఆమె తన పొలిటికల్ ఎంట్రీ గురించి చెప్పకనే చెప్పారు. అయితే వర్దన్నపేట సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కడియం శ్రీహరి శిష్యుడే కావడంతో పాటు అధిష్టానం రెండు సార్లు కూడా సిట్టింగులకే అవకాశం ఇచ్చింది. అంతేకాకుండా తాజా ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ అభ్యర్థిగా కడియం శ్రీహరికి ఇవ్వడంతో కావ్య ఎంట్రీకి ఆటంకం ఏర్పడింది. అయితే వరంగల్ లోకసభ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత శ్రీహరి వారసురాలు ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి వచ్చినట్టయింది. కానీ ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తండ్రి కూతర్లు ఇద్దరు కూడా గులాభి జెండాను వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇంట గెలవడమే ముఖ్యం…
వరంగల్ రాజకీయాలను గమనిస్తే మాత్రం కడియం కావ్య తొలి అడుగులోనే కఠినమైన పరీక్ష ఎదుర్కొక తప్పదని స్ఫష్టం అవుతోంది. కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకతను ఎదుర్కొంటుండడమే ఇందుకు ప్రధాన కారణం. ప్రధానంగా కడియం శ్రీహరి ప్రాతినిథ్యం వహిస్తున్న స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో తీవ్రమైన వ్యతిరేక వ్యక్తం అవుతోంది. ఈ సెగ్మెంట్ ఇంఛార్జిగా ఉన్న ఇందిరతో పాటు ఆమె అనుచరవర్గం బహిరంగంగానే వ్యతిరేకిస్తోంది. మరో వైపున కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న లోకసభ స్థానంలో పార్టీతో మమేకమైన వారికి టికెట్ ఇచ్చినట్టయితే బావుండేదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏడు సెగ్మెంట్లకు సంబంధించిన వారందరిని కూడా కావ్య తనకు అనుకూలంగా మల్చుకోవల్సిన ఆవశ్యకత ఉంది. పార్టీకి సానుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకుల్లో నెలకొన్న నైరాశ్యాన్ని పారద్రోలేందుకు తండ్రి, తనయలిద్దిరూ శ్రమించాల్సిన ఆవశ్యకత ఉంది. గతంలో ఇక్కడి నుండి ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన అనుభవం కడియం శ్రీహరికి ఉండడం లాభించడంతో పాటు వరంగల్ జిల్లా పాలిటిక్స్ లో కీరోల్ పోషించే నేతల్లో ఆయన ఒకరు కావడం మరింత బెనిఫిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు మాత్రం కావ్య పట్ల వ్యతిరేకతను తెచ్చిపెట్టాయనడంలో ఎలాంటి సంశయం లేదు. ఒక వర్గం ప్రజల్లో కూడా బేటీ… బాప్ పార్టీ మారిన తీరుపై జరుగుతున్న చర్చను అనుకూలంగా మల్చుకునేందుకు అవసరమైన ఎత్తులు వేయాల్సిన అవసరం ఉంది.
బీజేపీ… బీఆర్ఎస్…
మరో వైపున బీజేపీకి పెరుగుతున్న సానుకూల వాతావరణం కూడా ఓ సవాలేనని చెప్పాలి. బీజేపీ అభ్యర్థి కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెల్చిన వ్యక్తే కావడం… అందునా కడియం శ్రీహరికి శిష్యుడే కావడం మరో విశేషం. అయితే ఇప్పటికే ప్రచారంలో ముందున్న ఆరూరి రమేష్ పై పై చేయి సాధించే దిశగా కావ్య పావులు కదపాల్సిన ఆవశ్యకత ఉంది. మరో వైపున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా కడియం శ్రీహరి లక్ష్యంగా శపథాలు చేస్తున్నారు. ఆయన కూతురు కావ్య ఓటమి కోసం శత విధాల ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని వారు చేసిన ప్రకటనలు తేటతెల్లం చేస్తున్నాయి. మరో వైపున బీజేపీకి మోడీ మానియా కూడా అనుకూలంగా మారిందన్నది వాస్తవం. ఎంపీ ఎన్నికల్లో మోడీకే మద్దతు ఇస్తామన్న రీతిలో ఓటర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముందు ఇంటిని చక్కదిద్దుకుని ఆ తరువాత బయట వాతవారణాన్ని అనుకూలంగా మల్చుకోవల్సి ఆవశ్యకత కడియం ముందు ఉంది. ప్రాక్టికల్ గా ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు కావ్య కూడా స్వతహాగా మానిటరింగ్ చేయాల్సి ఉంటుందన్ని వాస్తవం. అయితే తొలిసారి రాజకీయాల్లోకి వచ్చిన కావ్య తండ్రి చాటు తనయగానే వ్యవహరిస్తారా లేక తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని చెప్పేందుకు ప్రజల్లోకి వెల్తారా అన్నది తేలాలంటే ఎన్నికల ప్రచారం తీరును పరిశీలించాల్సి ఉంటుంది.