ఓ చోట దూకుడు… రెండు చోట్ల బ్రేకులు…

మేడిగడ్డ, సుందిళ్లలో కానరాని వేగం…

అన్నారం ఇంజనీర్ల హై స్పీడ్

సర్కారు టార్గెట్ రీచ్ అయ్యేనా..?

దిశ దశ, భూపాలపల్లి:

కాళేశ్వరం బ్యారేజీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం త్వరితగతిన పూర్తి చేసి ఈ సీజన్ లో నీటిని స్టోర్ చేయాలన్న లక్ష్యం నెరవేరుతుందా..? మూడు బ్యారేజీల కోసం ప్రత్యేకంగా నిధులు కెటాయించిన సర్కారు ఆలోచనలకు అనుగుణంగా క్షేత్ర స్థాయిలో పనులు సాగుతున్నాయా..? నీటిని ఎత్తి పోయాలన్న తలంపుకు అనుగుణంగా బ్యారేజీల వద్ద అసలేం జరుగుతోంది..?

మేడిగడ్డ అలా…

కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలక భూమిక పోషించే మేడిగడ్డ బ్యారేజీ వద్ద పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 2.47 కోట్లు కెటాయించింది. ఈ బ్యారేజీలోని 7వ బ్లాకులో పిల్లర్లు కుంగుబాటుకు గురి కావడంతో వాటిని సవరించేందేుకు అవసరమైన చర్యలు తీసుకుంటోది ప్రభుత్వం. ఈ నిధులతో సమస్య ఎదురైన చోట డ్రిల్లింగ్ చేయడం, అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ లలో కాంక్రీట్ వర్క్స్ చేయాలని భావించింది. ప్రధానంగా డ్రిల్లింగ్ ద్వారా నదిలోపలి ప్రాంతం ఎలా ఉంది..? పిల్లర్లు కుంగుబాటుకు గురి కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న విషయాలపై అధ్యయనం చేయిస్తోంది. ఇరిగేషన్ ఇంజనీర్లు, నిపుణులు స్పెషల్ ఎఫర్ట్స్ ఏర్పాటు చేసి మేడిగడ్డ లోపాలను గుర్తించే పనిలో నిమగ్నం అయ్యారు. అయితే ఈ బ్యారేజీ వద్ద 16 చోట్ల పరీక్షలు పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు ఆరు మాత్రమే పూర్తయ్యాయి. మిగతా పనులు అర్థాంతరంగా ఆగిపోవడంతో ఈ సారి మేడిగడ్డ పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే ప్రాణహిత నుండి వరద నీరు పోటెత్తుతుండడంతో ఈ సీజన్ లో మేడిగడ్డ బ్యారేజీ సమస్యలను గుర్తించి వాటిని సవరించే అవకాశం అయితే కనిపించడం లేదు.

అన్నారంలో…

మేడిగడ్డకు ఎగువ భాగన ఉన్న అన్నారం బ్యారేజీలో మాత్రం దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళికలు వేసుకున్న అన్నారం ఇంజనీర్లు వాటిని పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. ముగ్గురు నిపుణుల పర్యవేక్షణలో అన్నారం లోపాలను సవరించే పనిలో పడ్డారు. మరో పది రోజుల పాటు వాతావరణ: ఇలాగే అనుకూలిస్తే ఈ సీజన్ లోనే అన్నారంలో జలకళ సంతరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నారం ఇంజనీర్లు అనుకున్నట్టుగా పనులు సాగితే నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)కి నివేదిక కూడా పంపించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అన్నారం బ్యారేజీ ఎగువన, దిగువన 42 చోట్ల సామర్థ్య పరీక్షలు చేయాలని భావించగా ఇప్పటికే 33 చోట్ల టెస్టులు కంప్లీట్ అయ్యాయి. ఈ బ్యారేజీ వద్ద పూణేకు చెందిన సెంట్రల్ వాటర్ పవర్ రిసెర్చ్ స్టేషన్ (సీడబ్లూపీఆర్ఎస్) నిపుణులు పర్యవేక్షణ చేస్తుండగా డిజిటల్ సర్వేయింగ్ ప్రోగ్రాం కోసం రూ. కోటి.13 లక్షలు ప్రభుత్వం కెటాయించింది. ఈ బ్యారేజీలో 13 మీటర్ల వరకు నీరు నిలువ చేయాల్సి ఉంటుందని, 36 నుండి 46 మీటర్ల లోతున ఇసుక ఉంటుందని అంచనా వేశారు. పరీక్షలు నిర్వహించేందుకు 28 మీటర్ల లోతు వరకూ డ్రిల్లింగ్ చేస్తూ షాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. వీటిని నిపుణులు ఎనలైజ్ చేసిన తరువాత మరమ్మత్తులు ఎలా చేయాలో దిశానిర్దేశం చేస్తుండగా అందుకు అనుగుణంగా ముందుకు సాగుతున్నారు. అయితే బ్యారేజీకి దిగువన రాతి కట్టడం లేకపోవడంతో వర్షాకాలంలో వచ్చే వరద వల్ల నది లోపలి భాగంలో మార్పులు సాధారణంగా సంభవిస్తుంటాయని వాటిని గుర్తించి బాగు చేయాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని కూడా తేల్చినట్టు సమాచారం. 2020లో నాలుగు పిల్లర్ల వద్ద ఇలాగే లీకేజీలు ఎదురయినప్పడు అప్పటికప్పుడు కెమికల్ గ్రౌటింగ్ చేసి బాగు చేయించినట్టుగా కూడా తెలుస్తోంది.

సుందిళ్లలో…

ఇకపోతే మంథనికి ఎగువ ప్రాంతంలో నిర్మించిన సుందిళ్ల బ్యారేజీ ఇన్వెస్టిగేషన్ కు కూడా రూ. కోటి 13 లక్షలు కెటాయించింది ప్రభుత్వం. ఇక్కడ మొత్తం 42 చోట్ల సమస్యలను గుర్తించి అక్కడ పరీక్షలు నిర్వహించి వాటిని అధిగమించేందుకు చర్యలు తీసుకోవల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఇక్కడ కేవలం నాలుగు చోట్ల మాత్రమే ఈ పనులు పూర్తయ్యాయని తెలుస్తోంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినట్టయితే ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లిల మీదుగా భారీగా వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసినా కూడా పనులు చేయడం అసాధ్యమేనన్నది వాస్తవం. అయితే సుందిళ్లలో మాత్రం పనులు నత్తనడకన సాగుతుండడంతో సర్కారు అనుకున్న లక్ష్యం చేరుకునే అవకావాలు లేవని స్పష్టం అవుతోంది.

అడ్వాన్స్ పేమెంట్…

ఈ మూడు బ్యారేజీల్లో నెలకొన్న సమస్యలను గుర్తించేందుకు కెటాయించిన నిధులు కూడా ప్రభుత్వం ముందస్తుగానే పేమెంట్ చేసినట్టుగా సమాచారం. అయితే పనులు మాత్రం అనుకున్న మేర సాగకపోవడం ఇబ్బందికరంగా మారినట్టుగా తెలుస్తోంది. మూడు బ్యారేజీల్లోను ఏర్పడిన సమస్యలు పరిష్కరించుకున్నట్టయితే వాటిని సవరించుకుని ముందుకు సాగాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే అన్నారం మినహా మిగతా రెండు చోట్ల మాత్రం వేగంగా పనులు సాగడం లేదని తెలుస్తోంది.

అన్నారం నింపినా…

మూడు బ్యారేజీల్లో ఒక్క అన్నారమే ఈ సీజన్ లో సర్వం సిద్దం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్డీఎస్ఏ ఇచ్చే నివేదికల ఆధారంగా బ్యారేజీలో నీటిని నిలువ చేసే విషయంలో నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఒక వేళ అన్నారంలో బ్యాక్ వాటర్ స్టోరేజీ చేసినా ఎగువ ప్రాంతానికి నీటిని తరలించడం ఎలా అన్నది కూడా అర్థం కాకుండా పోతోంది. ఈ బ్యారేజీ నుండి సుందిళ్లకు నీటిని ఎత్తిపోస్తే కాని ఎల్లంపల్లికి అక్కడి నుండి నందిమేడారం, లక్ష్మీపూర్ టన్నెల్స్ కు, మిడ్ మానేరు, అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని తరలించే అవకాశం ఉంటుంది. అయితే సుందిళ్లలో ఇంకా పనులు అసంపూర్తిగానే మిగలడంతో అన్నారం నీటిని ఎగువ ప్రాంతానికి తరలించేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్నది పజిల్ గా మారింది.

You cannot copy content of this page