దిశ దశ, భూపాలపల్లి:
కోటి ఎకరాల మాగాణికి నీరందించే సంకల్పంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తీరుపై విచారణ జరుగుతున్న క్రమంలో ఇరిగేషన్ ఇంజనీర్లు కొంతమంది అంతర్మథనానికి గురవుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో అట్టహాసంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు అక్రమాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన పిల్లర్లు కుంగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో కాళేశ్వరం నిర్మాణంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగా విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం మేడిగడ్డ బ్యారేజికి సంబంధించిన అవకతవకలపై క్షేత్ర స్థాయి విచారణ చేసింది. ఇందుకు సంబంధించిన మధ్యంతర నివేదికను విజిలెన్స్ విభాగం అడిషనల్ డీజీ సివి ఆనంద్ జస్టిస్ ఘోష్ కమిటీకి మధ్యంతర నివేదిక ఇచ్చారు. ఈ నివేదికలో 21 మంది ఇంజనీర్లు వైఫల్యాలను ఎత్తిచూపినట్టుగా ప్రచారం జరుగుతోంది. దీంతో కాళేశ్వరం ఇంజనీరింగ్ వర్గాల్లో బాధ్యులెవరు..? బాధితులు ఎవరో అన్న చర్చ సాగుతోంది.
అప్పుడలా…
ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుకు రీ డిజైన్ చేసిన కేసీఆర్ సర్కార్ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద మూడు బ్యారేజీలు, కన్నెపల్లి, సిరిపురం, గోలివాడల వద్ద మూడు పంప్ హౌజుల నిర్మాణం చేపట్టింది. అయితే అప్పుడు క్షేత్ర స్థాయిలో ఉంటూ వేగవంతంగా పనులు చేసిన ఇంజనీర్లకు సరైన గుర్తింపు రాలేదన్న ఆవేదన వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. సీఎంతో పాటు ఉన్నతాధికారుల వద్ద కొంతమంది సీనియర్ ఇంజనీర్లు క్రెడిట్ తమదేనని చెప్పుకున్నారని దీంతో అప్పుడు నిర్విరామంగా శ్రమించిన తమకు ఎలాంటి గుర్తింపు రాకుండా పోయిందన్న వేదన వ్యక్తం అయింది. రాత్రనక, పగలనక కష్టపడ్డ చాలామంది ఇంజనీర్ల శ్రమకు తగినట్టుగా గుర్తించలేదన్న ఆవేదన కనిపించింది. అయితే తాజాగా విజిలెన్స్ విభాగం అధికారులు జస్టిస్ ఘెష్ కమిటీకి ఇచ్చిన నివేదికలో 21 మంది ఇంజనీర్ల వైఫల్యాలే కారణమని తేల్చినట్టుగా వెలుగులోకి రావడంతో ఈ ఉచ్చులో తాము ఇరక్కుంటున్నామన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. సకాలంలో పని పూర్త చేసినప్పుడు బాగా పనిచేశారన్న కితాబు అందుకోకపోగా, ఇప్పుడు మాత్రం తమలోని కొంతమంది ఇంజనీర్ల తప్పిదాలు ఉన్నాయని గుర్తించడంతో రెంటికి చెడ్డా రేవడిలా తమ పరిస్థితి మారిపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. సర్కారు లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయడంలో కృతార్థులమైనప్పటికీ ఫలితం లేకపోగా… నిర్మాణంలో జరిగిన అవకతవకల విషయంలో మాత్రం తమనే నిందించే పరిస్థితి వస్తోందా అన్న భయం ఇంజనీర్లను వెంటాడుతోంది.
ఆ రెండింటి పైనా…
మరో వైపున జస్టిస్ ఘోష్ కమిషన్ అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన నివేదికలు ఇవ్వాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించడంతో ఇప్పటి వరకు మేడిగడ్డకే పరిమితం అయిన విచారణ నివేదిక త్వరలో ఆ రెండు బ్యారేజీలపై కూడా సిద్దం కాక తప్పేలా లేదు. దీంంతో మరికొంతమంది ఇంజనీర్లు కూడా ఈ వ్యవహారంలో ఇరుక్కునే ప్రమాదం ఉంటుందేమోనన్న చర్చ కూడా సాగుతోంది. దీంతో ఎటువైపు తమకు ఉపధృవం ముంచుకొస్తుందోనన్న ఆందోళన కాళేశ్వరం ఇంజనీరింగ్ వర్గాలను వెంటాడుతోంది.