దిశ దశ, కాళేశ్వరం:
దేశంలో త్రివేణి సంగమ క్షేత్రాల్లో రెండు మాత్రమే ప్రాచూర్యంలో ఉన్నాయి. ఒకటి ప్రయాగ్ రాజ్, మరోకటి కాళేశ్వరం. అయితే రెండు కూడా ప్రాశస్త్యం కలిగిన ప్రాంతాలు కావడం విశేషం. ప్రయాగ్ రాజ్, కాళేశ్వరంలలో సరస్వతి అంతర్వాహిని నది కలుస్తుందని ప్రతీతి. అయితే ఈ రెండు క్షేత్రాలు కూడా త్రివేణి సంగమాలు మాత్రమే కాదు ఇతిహాసాల్లో ఘనమైన చరితను లిఖించుకున్నాయి.
ప్రయాగ్ రాజ్…
గంగా, యమునా, సరస్వతి నాడుల సంగమంగా ప్రసిద్ధిగాంచిన ప్రయాగ్ రాజ్ లో అష్టాదశ శక్తి పీఠాలలో ఓ పీఠం వెలిసింది. ప్రయాగ మాధవేశ్వరీ దేవి (అలోపీ మాత) ఆలయం త్రివేణి సంగమ తీరంలో ఉంది. ఇక్కడ కుంభమేళా, పుష్కరాలు జరుగుతుంటాయి. ఉత్తరాదిన ఉన్న ఈ ప్రయాగ్ రాజ్ లో పుణ్య స్నానాలు, పితృ కర్మలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
కాళేశ్వరం…
ఉత్తర భారతావనిలో ఉన్న ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమ క్షేత్రం గురించి ప్రపంచ వ్యాప్తంగా ప్రాచూర్యంలో ఉంది. కానీ ప్రయాగ్ రాజ్ వద్ద కుంభమేళాను మినహాయిస్తే అంతకన్నా ఎక్కువ ప్రాశస్త్యం తనలో ఇముడ్చుకున్న మరో క్షేత్రమే కాళేశ్వరం. ప్రయాగ్ రాజ్ తర్వాత దక్షిణ భారతదేశంలోనే ఏకైక త్రివేణి సంగమం కాళేశ్వరం మాత్రమే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాళేశ్వరం సమీపంలో గోదావరి, ప్రాణహిత, సరస్వతి(అంతర్వాహిని) నదులు కలుస్తున్నాయి. అయితే ప్రయాగ్ రాజ్ లో శక్తి పీఠం వెలిసినట్టుగానే… కాళేశ్వరంలో అత్యంత అరుదైన సరస్వతి దేవి ఆలయం వెలిసింది. దేశంలో మూడు చోట్ల మాత్రమే ప్రత్యేకతలు సంతరించుకున్న సరస్వతి దేవి ఆలయాల్లో కాళేశ్వరం ఒకటి. కశ్మీర్ లో బాల సరస్వతి, తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసరలో జ్ఞాన సరస్వతి, కాళేశ్వరంలో మహా సరస్వతి(ప్రౌడ) దేవి ఆలయాలకు ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఈ మూడు ఆలయాలు అనుసంధానంగా వెలిసినవి కావడం విశేషం. ఇకపోతే కాళేశ్వరం త్రివేణి సంగమంలో పితృ కర్మలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. యూపీలోని ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమానికి అదే రాష్ట్రం మాత్రమే విస్తరించి ఉంది. కానీ కాళేశ్వరం వద్ద మూడు నదుల సంగమానికి ఓ వైపున తెలంగాణ, మరో వైపు మహారాష్ట్రలు విస్తరించి ఉన్నాయి. ఈ త్రివేణి సంగమానికి ఎగువన మంచిర్యాల జిల్లా చెన్నూరు సమీపంలోని గోదావరి ఉత్తర వాహినిగా ప్రవహించింది కూడా మరో ప్రత్యేకతను సంతరించుకుంది. త్రిలింగ క్షేత్రాల్లో ఒకటైన కాళేశ్వరంలో దేశంలోని ప్రత్యేకతలతో వెలిసిన మూడు సూర్యాలయాల్లో ఒకటి కావడం మరో విశేషం. ఒరిస్సాలోని కోణార్క్, ఏపీలోని శ్రీకాకుళం జిల్లా అరిసెవెల్లి, కాళేశ్వరంలో ఆవిర్భవించిన సూర్యాలయాలకు ప్రత్యేకమైన చరిత్ర ఉంది. మహా సరస్వతి అవతరించిన కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు జరుగుతుండడం మరో ప్రత్యేకతగా చెప్పవచ్చు. దేశంలో ఏ త్రివేణి సంగమంలో సరస్వతి ఆలయం లేకపోగా… ఆ ఘనత ఒక్క కాళేశ్వరానికి మాత్రమే దక్కింది. ఎంతో చరిత్రాత్మక నేపథ్యం… మరెన్నో ప్రత్యేకతలు ఉన్న కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాల సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించడం చాలా మంచిదని చెప్తున్నారు స్థానికులు.