సాధ్యాసాధ్యాలపై పవర్ పాయిట్ ప్రజెంటేషన్
దిశ దశ, భూపాలపల్లి:
కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు శ్రీకారం చుట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. మంత్రులతో పాటు, అధికారులు, కాంట్రాకర్టతో సహా అందరి ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేపట్టాలని నిర్ణయించింది. దీంతో ప్రాజెక్టు వద్దే వాస్తవాలను వివరించాలని నిర్ణయించుకున్నట్టుగా స్పష్టం అవుతోంది. ఈ మేరకు ఈ నెల 29న రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో మేడిగడ్డ బ్యారేజ్ విజిట్ ప్రోగ్రాం చేపట్టనున్నారు.
కాళేశ్వరం వైఫల్యాలపై…
శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుండి 9 గంటలకు హెలిక్యాప్టర్ లో బయలుదేరనున్న మంత్రులు అధికారులు నేరుగా మేడిగడ్డ చేరుకుంటారు. ఇప్పటికే పలు మార్లు మేడిగడ్డ వైఫల్యంపై రివ్యూలు నిర్వహించిన మంత్రులు మరోసారి క్షేత్ర స్థాయిలో కూడా ఆరా తీసే అవకాశాలు ఉన్నాయి. బ్యారేజ్ డ్యామేజీకి కారణం ఏంటీ..? అసలేం జరిగింది అన్న వివరాలను క్షుణ్నంగా తెలుసుకుంటారని సమాచారం. ఈ సమావేశాలనికి ఒక్క మేడిగడ్డే కాకుండా అన్నారం, సుందిళ్లతో పాటు కాళేశ్వరం ప్యాకేజీలకు సంబంధించిన కాంట్రాక్టర్లందరిని కూడా 29న రావాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇరిగేషన్ ఇంజనీర్ల ముందే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కాళేశ్వరం వల్ల జరిగిన నష్టం ఎంత..? కలిగిన లాభం ఎంత అన్న వివరాలు, రాష్ట్ర ప్రభుత్వంపై పడిన ఆర్థిక భారం, విద్యుత్ అవసరాలు తదితర అంశాలపై సమగ్రంగా వివరించనున్నారు. ప్రాణహిత, చేవేళ్ల రీ డిజైన్ వల్ల రైతాంగానికి ఎంతమేర లాభం చేకూరింది..? రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన ఖర్చు ఎంత..? దిగుబడి వల్ల వచ్చే ఆదాయం ఎంత అన్న వివరాలపై కూడా ఆరా తీయనున్నట్టు సమాచారం. ముఖ్యంగా మూడు బ్యారేజీలు, మూడు పంప్ హౌజ్ ల నిర్మాణం ద్వారా ఒరిగిందేమిటీ..? అద్భుతమైన కట్టడం అంటూ చెప్పుకున్న గత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల శాశ్వత ప్రాతిపాదికన కలిగే లాభం ఉందా లేదా అనేది కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చే అవకాశం ఉన్నాయి.
ప్రాణహిత చేవెళ్ల వల్ల…
ఉమ్మడి రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రాణహిత, చేవేళ్ల ప్రాజెక్టు నిర్మాణం జరిగినట్టయితే ఎంతమేర లాభం ఉండేది..? రాష్ట్ర ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం ఎంత..? విద్యుత్ వినియోగం ఎంతమేర తగ్గేది అన్న విషయాలపై కూడా గణంకాలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో వివరించనున్నట్టు సమాచారం. కాళేశ్వరానికి, ప్రాణహిత చేవేళ్లకు ఉన్న తేడా ఏమిటీ..? అప్పటి డిజైన్ వల్ల సుమారు 70 కిలోమీటర్ల మేర గ్రావిటీ ద్వారా నీటిని ఎల్లంపల్లికి తరలించే అవకాశం ఉండేదని, ఎల్లంపల్లి నుండి ఎగువ ప్రాంతాలకు తరలించేందుకు మాత్రం సాంకేతికత అవసరం అయ్యేదన్న విషయంపై స్ఫష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా ఆయువు పట్టుగా నిలిచిన శ్రీపాద ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాం వంటి రిజర్వాయర్లు అన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించినవేనన్న విషయాన్ని గుర్తు చేయనున్నారు. కాళేశ్వరం వల్ల ఆయాకట్టు స్థిరీకరణకు సంబంధించిన వివరాలు, మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల డిజైన్ లలో లోపాలు, నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ లేవనెత్తిన అంశాలను కూడా కులంకశంగా ఈ ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. బ్యారేజీల నిర్మాణం చేపట్టిన ప్రాంతాల ఎంపిక ఏమైనా లోపాలు ఉన్నాయా..? నివేదికలు ఏం చెప్తున్నాయి..? అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు కేంద్ర జలశక్తి విభాగం వెనకా ముందు ఆలోచించకుండా అన్నింటిని ఆమోదించడం వల్ల ఫలితం అనుభవిస్తున్నదెవరూ అన్న వివరాలను కూడా ఈ సందర్భంగా అందరి ముందు ఉంచే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.
భవిష్యత్తు ఏంటీ..?
కాళేశ్వరం వల్ల భవిష్యత్తు తరాలకు అందే ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా..? ఆర్థిక భారం పెరగుతుందా క్రమక్రమంగా తగ్గే అవకాశాలు ఉన్నాయా..? అన్న వివరాలపై కూడా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులు వివరించే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో గత ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ద్వారా ఆర్థిక భారం తగ్గించి సాగు నీటిని అందుకునే అవకాశం ఉంటుందా..? లేదా కమర్షియల్ అవసరాలకే వాడుకోవల్సి ఉంటుందా అన్న విషయాలపై కూడా ఈ సందర్భంగా చర్చించనున్నారు. ప్రత్యామ్నాయ అవసరాలు తీరుతాయా లేదా ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొవల్సి వచ్చింది అన్న అంశాలపై కూడా ఈ సందర్భంగా చర్చకు రానున్నట్టు సమాచారం.