నాడు అధికార పక్షం…
నేడు ప్రతి పక్షం…
దిశ దశ, హైదరాబాద్:
అధికార ప్రతిపక్ష పార్టీలకు పాశుపతాస్త్రంగా మారిపోయిందా ప్రాజెక్టు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉచితాల హమీల వర్షం కురిపిస్తున్నా, అన్ని రాజకీయ పార్టీలు మాత్రం ఆ ప్రాజెక్టు కేంద్రీకృతంగానే రాజకీయాలు నెరుపుతున్నాయి. దీంతో వరసగా రెండో ఎన్నికల్లోనూ కాళేశ్వరం అంశమే ప్రధాన ఎజెండాగా మారిపోయింది.
రీ డిజైన్ తో…
2014లో తొలిసారి స్వరాష్ట్రానికి ఎన్నికలు జరగగా నీళ్లు, నిధులు, నియామకాల నినాదంలో భాగంగా కాళేశ్వరం నీళ్లను రాష్ట్ర మొత్తానికి తరలించడమే లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. అప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మడిహట్టి నుండి ప్రాణహిత జలాలను తరలించాలన్న సంకల్పంతో పనులను ప్రారంభించింది. 70 కిలో మీటర్ల వరకు గ్రావిటీ ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి వరకు నీటిని తరలించి అక్కడి నుండి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు నీటిని తరలించాలని నిర్ణయించారు. ప్రాణహిత చేవెళ్ల పథకాన్ని 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు రీ డిజైన్ చేశారు. దీంట్లో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బ్యారేజీలు, కన్నెపల్లి, సిరిపురం, గోలివాడ వద్ద పంప్ హౌజ్ ల నిర్మాణం చేసి ఎగువ ప్రాంతాలకు నీటిని తరలించాలన్న సంకల్పంతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. అతి స్వల్ప కాలంలోనే బ్యారేజీలు, పంప్ హౌజ్ లు, అండర్ టన్నెల్లతో పాటు ఎగువ ప్రాంతాల్లో రిజర్వాయర్లను నిర్మించి క్రెడిట్ కొట్టేయాలని దూకుడుగా వ్యవహరించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు 2018 ఎన్నికలకు ముందే పనులు చక్కబెట్టడంతో కాళేశ్వరం జలాలను ఎగువ ప్రాంతాలకు ఎత్తిపోసే ప్రక్రియను కొంత మేర ప్రారంభించింది.
2018లో ఎన్నికల నినాదంగా…
అయితే తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేసీఆర్ షెడ్యూల్ కు ముందే ఎన్నికలకు వెల్లాలని భావించారు. దీంతో 2018లో ముందస్తు ఎన్నికలు తెలంగాణలో జరిగాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించే ముఖ్యమంత్రి కేసీఆర్ నుండి మొదలు సామాన్య కార్యకర్త వరకూ ప్రచారం చేశారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో కూడా కాళేశ్వరం సక్సెస్ గురించి గులాభి శ్రేణులు చేసిన ప్రచారం అంతా ఇంతాకాదు. అంతేకాకుండా ఎన్నికలకు ముందే రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన వారికి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రాక్టికల్ గా చూపించేందుకు కూడా అధికార పార్టీ నేతలు ప్రాధాన్యత ఇచ్చారు. ఒక దశలో టూరిస్ట్ ప్లేసులుగా బ్యారేజీలు, పంప్ హౌజ్ లు మారిపోయాయంటే తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు గురించి ఏ స్థాయిలో ప్రచారం చేసుకుందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని ప్యాకేజీలు కూడా పూర్తయ్యయాని మిగతావి కూడా పూర్తయితే ఉత్తర తెలంగాణ నుండి దక్షిణ తెలంగాణ వరకు కాళేశ్వరం జలాలు సమృద్దిగా అందుతాయన్న విషయాన్ని ప్రత్యక్ష్యంగా చూపించడంలో గులాభి నేతలు సక్సెస్ అయ్యారు. ఎన్నికలప్పుడు కూడా కాళేశ్వరం అంశాన్ని ప్రధానాస్త్రంగా చేసుకున్న అధికార పక్షం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో కాళేశ్వరం గురించి చేసిన ప్రచారంతో ఒక దశలో ప్రతిపక్ష పార్టీలన్ని కూడా డిఫెన్స్ లో పడిపోయాయి. దీంతో 2018 ఎన్నికల్లో అధికార పక్షం ప్రతిపక్షాల ఎత్తులను చిత్తు చేస్తూ రెండో సారి అధికారంలోకి వచ్చింది.
ఇప్పుడు ప్రతిపక్షాల వంతు…
అయితే తాజాగా జరుగుతున్న ఎన్నికల వరకు కూడా అధికార బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరాన్ని వాడుకునే పనిలో పడిపోయింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాళేశ్వరం జలాల గురించి చెప్పుకునే ప్రయత్నం చేసింది. ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ బస్సు యాత్ర మంథని నియోజకవర్గం మీదుగా వెళ్లగా పనిలో పనిగా మేడిగడ్డ బ్యారేజీ చూసి తెలంగాణ ప్రభుత్వం చూపిన అత్యద్భుతాన్ని కనులారా వీక్షిస్తే బావుండేది కదా అని అధికార పక్ష నేతలు సెటైర్లు వేశారు. కానీ అనూహ్యంగా మేడిగడ్డ బ్యారేజీలోని 20వ పిల్లర్ కుంగిపోవడం, దాని ప్రభావం పక్కనే ఉన్న పిల్లర్లపై పడడంతో బ్యారేజీ వంతెన కుంగిపోయింది. అలాగే ప్రాజెక్టు గేట్ల వద్ద కూడా పగుళ్లు బారిన అంశం వెలుగులోకి రావడంతో కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు అందిపుచ్చుకున్నాయి. అప్పటికే కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎంలా మారిపోయిందంటూ చేస్తున్న విమర్శలకు మేడిగడ్డ పిల్లర్ కుంగిపోవడం కలిసివచ్చింది. మరో వైపున అన్నారం బ్యారేజీ గేట్లకు దిగువన బుంగ పడి బ్యారేజీ బ్యాక్ వాటర్ దిగవకు వెళ్లిపోతుండడం మరింత అవకాశం అయిపోయింది. ఇంతకు ముందు వచ్చిన భారీ వరదల్లో కన్నెపల్లి, సిరిపురం పంప్ హౌజ్ లు కూడా మునిగిపోయిన విషయాన్ని కూడా పదే పదే ఎత్తి చూపుతున్నాయి. తాజాగా కాళేశ్వరం అంశాన్ని మరింత ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ అంశాన్ని ఎత్తి చూపుతూ కాళేశ్వరం కేసీఆర్ ప్రభుత్వానికి ఏటీఎంలా మారిపోయిందని ఆరోపించారు. అలాగే మేడిగడ్డ బ్యారేజీని కూడా సందర్శించి కాళేశ్వరం బ్యారేజీ నిర్మాణంలో జరిగిన తప్పిదాలను ఎత్తి చూపేందుకు ప్రయత్నించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టును బీజేపీ నేత ఈటల రాజేందర్, కమ్యూనిస్టు నేతలు నారాయణ, చాడ వెంకటరెడ్డిలు సందర్శించారు. ఇదే అంశాన్ని ప్రజలకు వివరించేందుకు కూడా ప్రయత్నించే పనిలో ప్రతిపక్ష పార్టీల నాయకులు నిమగ్నం అయ్యారు. కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని పట్టుబట్టిన బీఆర్ఎస్ పార్టీ సక్సెక్ కాలేక పోయింది కానీ జాతీయ స్థాయిలో ఇష్యూ చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిందన్న చర్చ కూడా సాగుతోంది.
నాడు… నేడు…
2018 ఎన్నికల్లో అధికార పార్టీ తమ సక్సెస్ అంటూ చెప్పుకుని ప్రజల్లోకి వెల్లి మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని రెండో సారి ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు కాళేశ్వరంలో జరిగిన అవినీతి గురించి ఎత్తి చూపుతూ ప్రజలను తమవైపునకు తిప్పుకునేందుకు ప్రతిపక్ష పార్టీలు రంగంలోకి దిగాయి. దీంతో రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్రంగానే రాజకీయాలు నెరుపుతుండడం గమనార్హం. ఓట్లు అభ్యర్థించేందుకు అన్ని రాజకీయ పార్టీలు కాళేశ్వరాన్నే అస్త్రంగా వాడుకుంటుండడం విశేషం.