దిశ దశ, జగిత్యాల:
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వైఫల్యాలకు కారుకులైన వారిని ఊరి తీయాలని ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…
తెలంగాణ ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు తలదించుకునేలా చేసిందన్నారు. నాణ్యతా ప్రమాణాలు లోపించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, ఇందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు. లక్ష 20 వేల కోట్ల పెట్టుబడి పెడితే కనీసం లక్ష ఎకరాలకు కూడా నీరందలేదని మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడానికి కారణం ఏంటంటే ఇసుక కొట్టుకపోయిందని అంటున్నారని, సముద్రంలో కూడా నిర్మాణాలు జరుపుతున్న ఈ కాలంలో బ్యారేజ్ కుంగిపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇంజనీర్ డిజైన్ చేస్తే బావుండేది కానీ లీడర్ రూపిందిస్తే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. కాళేశ్వరం విషయంలో మాత్రం ఎంత పెద్దవాడైనా వదిలిపెట్టేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారన్నారు. బ్యారేజీ నిర్మాణం జరిపిన ఎల్ అండ్ టీకి ఖచ్చితమైన బాధ్యత ఉంటుందని తేల్చి చెప్పారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆలోచించి మాట్లాడాలని జీవన్ రెడ్డి హితవు పలికారు. కేంద్రం మెడలు వంచి తెలంగాణ తీసుకొచ్చామని పదేపదే చెప్పుకున్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హక్కులకు భంగం కల్గినప్పుడు చూస్తు ఊరుకుందని దుయ్యబట్టారు. ఏడు మండలాలతో పాటు హైడల్ ప్రాజెక్టును ఏపీకి అప్పజెప్పినప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదని అడిగారు. లోకసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతి బిల్లుకు సపోర్ట్ చేసిన వినోద్ కుమార్, ఆ పార్టీ నాయకులు ఏడు మండలాల విషయంలో ఎందుకు మాట్లాడకుండా ఉన్నారో చెప్పాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. రూ. 20 వేల కోట్ల ధాన్యాన్ని ఎలాంటి సెక్యూరిటీ లేకుండా మిల్లర్లకు అప్పగించారని 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్ల వద్ద ఉందన్నారు. అయితే తనిఖీలు చేస్తే మాత్రం ఆ ధాన్యం దారి మల్లినట్టుగా తేలిందని ఈ డబ్బును రికవరీ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. రేషన్ షాపులో స్టాకు తక్కువగా ఉంటే 6ఏ కేసులు నమోదు చేసినట్టుగానే మిల్లర్లపై కఠినంగా వ్యవహరించాలని కోరారు. మిల్లర్ల లైసెన్సులు రద్దు చేయాలని ఒకో మిల్లర్ రూ. 4 కోట్ల వరకు ధాన్యాన్ని అమ్ముకున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కమిషనర్ ల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ భాషాకు కూడా ఫిర్యాదు చేశామని జీవన్ రెడ్డి తెలిపారు. ఇసుక, మట్టి మాఫియాలపై ఉక్కుపాదం మోపాలని, సహజ వనరులను స్థానిక అవసరాలకే వినియోగించేందుకు అనుమతించాలన్నారు. అక్రమ మైనింగ్ కారణంగా గుట్టలు కూడా అంతర్థానం అయిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో ఆటోలు నడుపుకుని జీవించే వారికి ఉపాధి కోల్పోయిన విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దృష్టి పెట్టారని వారికి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా లాభం చేకూరే విధంగా చర్యలు తీసుకుంటారన్నారు. ఈ మీడియా సమావేశంలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కోరుట్ల ఇంఛార్జి జువ్వాడి నర్సింగ రావులు కూడా పాల్గొన్నారు.