దిశ దశ, హైదరాబాద్:
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మరో ట్విస్ట్ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ పనులు పూర్తయ్యాయంటూ మూడు సార్లు ఇరిగేషన్ అధికారులు సర్టిఫై చేయడానికి కారణాలు ఏంటన్న కోణంలో ఆరా తీస్తున్న క్రమంలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది.
ఎల్ అండ్ టి ఇలా…
మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన అంశంలో కాంట్రాక్టు దక్కించుకున్న ఎల్ అండ్ టి కంపెనీ ప్రభుత్వానికి రాస్తున్న లేఖల్లో పదే పదే మూడు బ్లాకులతో సంబంధం లేనట్టుగా స్పష్టం చేస్తోంది. బ్యారేజీ కాంట్రాక్టు బాధ్యతలు తీసుకున్న ఎల్ అండ్ టి ఇలా వ్యవహరించడం ఏంటీ..? మరో వైపున అధికారులు కూడా మూడు సార్లు వర్క్ కంప్లీటెడ్ అంటూ సర్టిఫై చేయడం వెనకున్న కారణాలు ఏంటీ అన్న విషయాలపై లోతుగా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే 2021లో విడుదల చేసిన 330 జీఓ, దానికి అనుసంధానంగా ఇచ్చిన మరో జీఓకు సంబంధించిన రికార్డులు లభ్యం కావడం లేదని తెలుస్తోంది. అయితే ప్రాథమికంగా ఈ జీఓల ద్వారా ఏం జరిగిందన్న విషయాన్ని అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుండి కాంట్రాక్టు అగ్రిమెంట్ తీసుకున్న ఎల్ అండ్ టీ, దాని నుండి సబ్ కాంట్రాక్టు తీసుకున్న మరో కంపెనీ, దీని నుండి మూడో స్థాయిలో సబ్ కాంట్రాక్టు బాధ్యతలు ఇతరులకు అప్పగించినట్టుగా తేల్చారు అధికారులు. అయితే మూడు బ్లాకులకు సంబంధించిన కాంట్రాక్టు పనులను చేసిన సదరు నిర్మాణ కంపెనీలు సబ్ కాంట్రాక్టులు పొందినప్పటికీ వాటికే నేరుగా బిల్లులు మంజూరు చేసినట్టుగా జీఓలు తీసినట్టుగా తెలుస్తోంది. సాధారణంగా ప్రభుత్వంతో కాంట్రాక్టు ఒప్పందం చేసుకున్న నిర్మాణ కంపెనీలతో మాత్రమే లావాదేవీలు జరపాల్సి ఉంటుంది కానీ సబ్ కాంట్రాక్టులతో మాత్రం జరిపే అవకాశాలు ఉండవని, మేడిగడ్డ విషయంలో మాత్రం అలాంటి నిభందనలను పక్కనపెట్టేందుకే ఎస్టిమేట్లను పెంచడం, బిల్లులు నేరుగా సబ్ కాంట్రాక్ట్ ఏజెన్సీలకు ఇవ్వడం కోసం ప్రత్యేకంగా జీఓలు వెలువడ్డాయని గుర్తించారు. దీంతో ఆ రెండు జీఓలకు సంబంధిచిన రికార్డులు పూర్తి స్థాయిలో దొరికినట్టయితే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. 2019లోనే ప్రాజెక్టు పూర్తయితే 2021లో అంచనాలను పెంచడం, బిల్లులు నేరుగా సబ్ కాంట్రాక్టుకు ఇవ్వడం వెనక ఆంతర్యం ఏంటన్న విషయంపై అధికారులు మల్లగుల్లాలగు పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన రికార్డులు, జీఓ ప్రతుల కోసం ఆయా శాఖలతో పాటు ముఖ్య కార్యాలయాల్లో ఆరా తీస్తున్నట్టుగా విశ్వసనీయంగా తెలిసింది.
dishadasha
1232 posts
Prev Post