ఇప్పుడిలా… అప్పుడలా…

కాళేశ్వరం దిగువ ప్రాంత దుస్థితి

దిశ దశ, భూపాలపల్లి:

‘‘తలాపున పారుతుంది గోదారి నీ చేను నీ చెలకా ఎడారి’’ అన్న నానుడికి ప్రత్యక్ష్యంగా సాక్షాత్కారిస్తోంది ఆ ప్రాంత పరిస్థితి. గోదావరి పరివాహక ప్రాంత గ్రామాల్లో నీరు లేక బీళ్లు వారిన భూములు దర్శనమిస్తున్నాయి. ఏడాదికి రెండు పంటల సంగతి దేవుడెరుగు కనీసం ఒక్క పంట కూడా పండించుకునే పరిస్థితి లేక అల్లాడిపోతున్న దిగువ గ్రామాల రైతాంగం దయనీయ పరిస్థితిపై స్పెషల్ స్టోరీ…

కాళే‘శ్వరమా’..!

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం వద్ద నిర్మించిన బ్యారేజీల కారణంగా భూపాలపల్లి, మంచిర్యాల జిల్లా వాసుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. కాళేశ్వరం జలాలు రాష్ట్రానికి ఉపయోగపడడం మాట అటుంచితే తరతరాలుగా గోదారమ్మను నమ్ముకుని జీవిస్తున్న పరివాహక ప్రాంత ప్రజల పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారిందనే చెప్పాలి. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంతో దిగువన ఉన్న ముకునూరు వరకు ప్రతి గ్రామంలో భూముల్లో పంటలు పండించుకునే పరిస్థితి లేకుండా పోయింది. వేసవిలో కూడా పాయలా పారే నీరు కూడా మేడిగడ్డ బ్యారేజీ వద్ద నిలిచిపోతుండడంతో దిగువ గ్రామాల భూములకు నీరందని పరిస్థితి తయారైందని రైతులు వాపోతున్నారు. గతంలో వేసవి కాలంలో తాగు నీటి కోసం గోదావరికి నడిచి వెల్లి నీరు తెచ్చుకుంటూ ఇప్పుడు మా భూములు కూడా నీళ్ల కోసం నోళ్లు తెరిచి ఎదురు చూస్తున్నాయని దిగువ ప్రాంత రైతులు వాపోతున్నారు. విత్తనాలు నాటినా చాలినంత నీరు లేకపోవడంతో పంటలను వదిలేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తిండిగింజలు కూడా దొరకక అన్నమో రామచంద్రా అంటు పొట్ట చేతపట్టుకుని వలస పోవల్సిన పరిస్థితికి చేరుకుంటామని మేడిగడ్డ బ్యారేజీ దిగువ ప్రాంత రైతాంగం అంటోంది.

వర్షాకాలం అయితే…

ఇకపోతే వర్షాకాలంలో సమృద్దిగా లభ్యమయ్యే జలాలను వినియోగించుకుని పంటలు పండించుకుందామని ఆశలు పడుతున్న రైతాంగాన్ని మేడిగడ్డ బ్యారేజీ గేట్లు భయపెడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే చాలు గేట్లు ఎత్తుతున్నారు అధికారులు. దిగువకు విడుదల చేస్తున్న నీటిలో పంట భూములు మునిగిపోతుండడంతో గోదావరి పరివాహక ప్రాంత భూములు జలమయం అవుతున్నాయి. దీంతో వానా కాలం వేసిన పంటలు మేడిగడ్డ నీరు వదిలినప్పుడల్లా ముంపునకు గురవుతున్నాయని, తాము అప్పులు చేసిన సాగు చేసినా వరద నీటిలో కొట్టుకపోతుండడంతో అప్పులు ఊబిలో కూరుకపోయామని రైతులు అంటున్నారు. ఇదే పరిస్థితి అన్నారం బ్యారేజీ దిగువన ఉన్న రెండు జిల్లాల పరివాహక ప్రాంత రైతులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఎప్పుడో ఒ సారి వచ్చే వరదల్లో తమ పంట భూములు ముంపునకు గురయితే నష్టం వాటిల్లేది కానీ ఇప్పుడు ప్రతి వర్షాకాలంలో గేట్లు ఎత్తడం పంటలు ముంపనకు గురి కావడం సాధారణంగా మారిపోయిందని రైతులు వివరిస్తున్నారు. దీంతో అటు వానాకాలంలో ఎగువ ప్రాంతాల్లో దండిగా వర్షాలు పడొద్దని మొక్కుతూ… ఎండకాలంలో దిగువ ప్రాంతాలకు నీరు రావాలని వేడుకుంటూ కాలం వెల్లదీయాల్సిన పరిస్థితి తయారైందని రైతాంగం ఆవేదన చెందుతోంది.

బోర్లపై ఆధారపడితే..?

ఉద్యమ కాలంలో బోరు బావులకు కేరాఫ్ తెలంగాణ అని నినదించినట్టుగానే బ్యారేజీల దిగువ ప్రాంతాల్లో పరిస్థితి నెలకొంది. ఇప్పుడు కూడా బోరు బావులపైనే ఆధారపడాల్సి వస్తోందన్న ఆవేదన అక్కడి రైతాంగంలో వ్యక్తమవుతోంది. అయితే బోరు బావులకు కూడా వానా కాలం ఎఫెక్ట్ తప్పేలా లేదని కూడా రైతులు అంటున్నారు. గేట్లు ఎత్తినప్పుడల్లా అత్యంత వేగంగా దూసుకుంటూ వచ్చే వరద నీటి ప్రవాహంలో బోర్లు కూడా కొట్టుకపోయే ప్రమాదం ఉందని దీంతో లక్షల్లో నష్టం వాటిల్లుతుందని అంటున్నారు రైతులు. అంతేకాకుండా గతంలో 60 ఫీట్ల లోపునే బోర్లలో నీరు పడేది కానీ ఇప్పుడు వేసవిలో దిగువ గోదావరిలో నీటి చుక్క కూడా లేనందున ఇప్పుడు వందల ఫీట్ల వరకూ బావులను తవ్వాల్సిన పరిస్థితి కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని దీనివల్ల తమపై మరింత ఆర్థిక భారం పడుతుందని రైతులు అంటున్నారు.

ప్రత్యామ్నాయమేది..?

గోదావరి నదిపై కాళేశ్వరం నిర్మాణం తరువాత పరివాహక ప్రాంత భూములను సస్య శామలం చేసేందుకు కనీసం ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూడడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంబట్ పల్లి నుండి మొదలు ముకునూరు వరకు సిరులు పండించే మాగాణం ఉన్నా చుక్క నీరు లేకుండా పోయినందున నీటి వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఉంది. 1989లో పల్మెలలో 900ఎకరాల ఆయాకట్టుకు నీరందించేందుకు ఏర్పాటు చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం విద్యుత్ సరఫరా లేక నాడు అర్థంతరంగా ఆగిపోయింది. ఆ తరువాత రూ.5.70 లక్షలు వెచ్చించి అన్ని వసతులు కల్పించి పంటలకు నీరందించేందుకు సర్వం సిద్దం చేయడమే కాకుండా ట్రయల్ రన్ కూడా చేశారు. కానీ లిఫ్ట్ సేవలు మాత్రం వినియోగంలోకి రావడం లేదని పల్మెల రైతులు అంటుండగా, దిగువ గోదావరిలో నీరు సమృద్దిగా లేకపోవడం వల్లే లిఫ్ట్ ఇరిగేషన్ ఉత్సవ విగ్రహంలా మారిపోయిందని తెలుస్తోంది. అయితే మేడిగడ్డ బ్యారేజీ కారణంగా ఇబ్బందులు పడుతున్న రైతాంగానికి అన్ని కాలల్లోనూ నీరందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు గేట్లు ఎత్తినప్పుడు పంటలు నాశనం కాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని స్థానిక రైతులు వేడుకుంటున్నారు.

You cannot copy content of this page