లక్షన్నర కోట్ల వరకు ఖర్చు అవుతోంది… ఏటా 13 వేల కోట్లు చెల్లించాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

 

దిశ దశ, మేడిగడ్డ:

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీ డిజైన్ చేసి కాళేశ్వరం నిర్మించి ప్రభుత్వంపై ఆర్థిక భారం పడేలా చేశారు తప్ప పెద్దగా ఒరిగిందేమీ లేదని రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద ఆయన మాట్టాడుతూ… కాంగ్రెస్ పార్టీ హయాంలో చేపట్టిన ప్రాణహిత చేవేళ్ల కోసం రూ. 38 వేల కోట్లు వెచ్చిస్తే కొత్తగా 16 లక్షల 40 వేల ఎకరాల ఆయాకట్టుకు నీరందేదని అయితే ప్రభుత్వం మారిన తరువాత మహారాష్ట్రతో సంప్రదింపులు జరిపిన బీఆర్ఎస్ ప్రభుత్వం అనూహ్యంగా రీ డిజైన్ నిర్ణయం తీసుకున్నారన్నారు. బ్యారేజ్ ఎత్తు విషయంలో మహారాష్ట్ర నుండి అభ్యంతరాలు రావడంతో ఓ వైపున సంప్రదింపులు జరుపుతూనే మరో వైపున కాలువల నిర్మాణం కూడా చేపట్టామన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూ. 80 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి ప్రపంచంలోనే అద్భుత కట్టడమని చెప్పుకుందన్నారు. మూడు బ్యారేజీలు లిఫ్టులు ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్నారు. అయితే ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుకు నిర్మాణం కోసం సిడబ్లుసి ఆమోదం పొందినప్పుడు రూ. 80 వేల కోట్లు,18 లక్షల ఎకరాల కొత్త ఆయాకట్టుకు నీరందిస్తామని, కొంతమేర స్థిరీకరణ చేపడతామని ప్రతిపాదనలు చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుకు రూ. 95 వేల కోట్లు ఖర్చు పెట్టగా మొత్తం రూ. 1.50 లక్షల కోట్ల వరకు ఖర్చు చేరనుందన్నారు. ఏటా రూ. 13 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుందని, విద్యుత్ ఛార్జీలు కూడా అదనంగా భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మంత్రి వెల్లడించారు. కాళేశ్వరం ప్రారంభిచినప్పటి నుండి ఇప్పటి వరకు 95 వేల కోట్ల ఆయాకట్టుకు మాత్రమే నీరందిందని, ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ప్రభుత్వంపై వడ్డీ భారం పడడం తప్ప మరోటి లేదని అభిప్రాయపడ్డారు.

కేసీఆర్ పై ఫైర్…

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. అక్టోబర్ 21న మేడిగడ్డలోని 7వ బ్లాకు పిల్లర్లు 5 ఫీట్ల మేర కుంగిపోయినా డిసెంబర్ 3వరకు అధికారంలో ఉన్నప్పటికీ నోరు కూడా మెదపలేదన్నారు. 45 రోజుల పాటు ఆయనే ఇరిగేషన్ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కనీసం రివ్యూ కూడా చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించామన్నారు. అయితే ప్రపంచంలోనే అధ్బుత కట్టడమంటూ పదేళ్ల పాటు పదేపదే చెప్పుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మేడిగడ్డ కుంగిపోయిన తరువాత మాత్రం ఒక్క మాట మాట్లడకపోవడం విస్మయం కల్గిస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించినట్టుగానే త్వరలో జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా చేపడ్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

You cannot copy content of this page