మేడిగడ్డ బాధిత రైతుల మళ్లీ వినతి
దిశ దశ, మహారాష్ట్ర:
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం వల్ల ముంపునకు గురయ్యే విషయంలో కూడా అధికారులు అంచనా వేయడంలో విఫలం అయ్యారా..? బ్యారేజీ బ్యాక్ వాటర్ ఎంత మేర ఉంటుంది..? అదనంగా ఎంత భూ సేకరణ జరపాలి అన్న విషయంపై అధికారులు సర్వే చేయడంలో విఫలం అయినట్టుగా స్పష్టం అవుతోంది. శతాబ్దాల క్రితం నిర్మించిన చెరువులు, కుంటల కోసం ఫుల్ ట్యాంక్ లెవల్స్, బఫర్ జోన్లను ఏర్పాటు చేశాయి అప్పటి ప్రభుత్వాలు. ఇటీవల నిర్మించిన ఎల్లంపల్లి, మిడ్ మానేరు ప్రాజెక్టుల నిర్మాణం అప్పుడు కూడా అధికారులు ఎంత మేర భూమి ముంపునకు గురవుతోందో పక్కాగా గుర్తించారు. కానీ మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో మాత్రం ముంపునకు గురయ్యే భూమి విషయంలో నేటికీ స్పష్టత రాకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. ఇప్పటికే పలు మార్లు సర్వే చేసి విడుతల వారిగా పరిహారం అందించిన ప్రభుత్వం పదే పదే సర్వేలు చేయించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ముంపునకు గురయ్యే భూముల విషయంలో తాము తీవ్రంగా నష్టపోతున్నామని పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకాలోని పలు గ్రామాల రైతులు నిరసన దీక్షలు చేపట్టిన సంగతి తెలిసిందే. పరిహారం చెల్లించిన భూమికంటే ఎక్కువ భూమి మేడిగడ్డ బ్యారేజ్ బ్యాక్ వాటర్ వల్ల ముంపునకు గురవుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిధులు ఇచ్చే విషయంలో ముందుకు రాకపోవడంతో అక్కడి ప్రభుత్వమే ప్రత్యేకంగా నిధులు కెటాయించాల్సి వచ్చింది. మహారాష్ట్ర రైతులు అసెంబ్లీ వరకు వెల్లి తమ నిరసనలు తెలిపి తమ పంథాన్ని నెగ్గించుకున్నారు. అయితే ఇంకా ముంపునకు గురయ్యే భూమి విషయంలో సర్వేలు జరిపించాలని కూడా రైతాంగం డిమాండ్ చేస్తూనే ఉంది. గతంలో పరిహారంతో పాటు అదనపు భూమి విషయంలో సర్వేలు చేయించాలన్న డిమాండ్ తో రైతులు ఆందోళణలు చేశారు. గడ్చిరోలి జిల్లా అధికార యంత్రాంగం ఎట్టకేలకు సర్వే చేయించినప్పటికీ పరిహారం మాత్రం బాధిత రైతులకు అందలేదు. గతంలో గుర్తించిన భూమి కోసం పరిహారం చెల్లించారు కానీ, అదనంగా ముంపునకు గురవుతున్న భూమి విషయంలో మాత్రం పరిహారం ఇవ్వలేదు. దీంతో మహారాష్ట్ర రైతులు మళ్లీ ఆందోళన బాట పడతామని హెచ్చరిస్త్తూ సిరొంచ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. తమ భూమి ముంపునకు గురవుతున్నా పరిహారం ఇవ్వలేదని న్యాయం చేయకపోదే నిరవధిక దీక్ష చేపడతామని మద్దికుంట గ్రామానికి చెందిన తిరుపతి తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. దీంతో మరోసారి మహారాష్ట్ర రైతులు ఆందోళన బాట పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.