kamareddy: మిస్టరీలను ఛేదించే పోలీసుల మిస్టరీ మరణాలు…

ఛేదించే పనిలో కామారెడ్డి పోలీసులు

దిశ దశ, కామారెడ్డి:

మిస్టరీగా మారిన నేరాల లొగుట్టును తేల్చే పోలీసుల మృతి మిస్టరీగా మారిపోయింది. అనూహ్యంగా అదృశ్యం అయి చెరువులో శవాలుగా తేలిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు అసలు కారణాలు ఏంటని నిగ్గు తేల్చే పనిలో పోలీసు అధికారులు నిమగ్నం అయ్యారు.

శవాలుగా తేలడంతో…

బీబీపేటలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ శృతి, ఇదే గ్రామానికి చెందిన నిఖిల్, భిక్కునూరు ఎస్సై సాయి కుమార్ బుధవారం మద్యాహ్నం అదృశ్యం అయ్యారు. కానిస్టేబుల్ శృతి, నిఖిల్ ల శవాలను ముందుగా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో గుర్తించారు. ఆ తరువాత ఎస్సై మృతదేహం కూడా ఇదే చెరువులో లభ్యం కావడంతో వీరి మరణానికి కారణం ఏంటన్నది మిస్టరీగా మారింది. బుధవారం మద్యాహ్నం నుండి గురువారం ఉదయం వరకు కూడా కొనసాగిన సస్పెన్స్ కు తెరపడింది. అప్పటి వరకు అదృశ్యం అయిన వారు ఏమయ్యారోనన్న టెన్షన్ పోలీసు వర్గాలతో పాటు, వారి కుటంబ సభ్యుల్లో నెలకొంది. అయితే ముగ్గురు కలిసి ఒకే చెరువులో చనిపోవడం వెనక దాగి ఉన్న మిస్టరీ ఏంటన్నదే పజిల్ గా మారింది. టవర్ లోకేషన్ ద్వారా చెరువు వద్ద దొరికిన కారు, సెల్ ఫోన్ల ఆదారంగా అన్వేషణ మొదలు పెట్టిన పోలీసులు ముగ్గురి మృతదేహాలను గుర్తించారు. అయితే వీరి మరణానికి కారణం ఏంటన్నదే అంతుచిక్కకుండా పోతోంది.

సాంకేతికతనే దిక్కు…

ఒకే సారి ఇద్దరు పోలీసు విభాగానికి చెందిన వారు కంప్యూటర్ ఆపరేటర్ గా  పనిచేస్తున్న మరో వ్యక్తి డెత్ మిస్టరీ వీడాలంటే పోలీసులు సాంకేతికతపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ ముగ్గురి మధ్య ఉన్న పరిచయాలే కారణమన్న వాదనలు వినిపిస్తున్నప్పటికీ ఆయా కుటుంబాలకు చెందిన వారు కానీ, ఎస్సై సాయి కుమార్, కానిస్టేబుల్ శృతితో కలిసి పనిచేస్తున్న ఇతర పోలీసు యంత్రాంగం లేదా వీరితో అత్యంత  సాన్నిహిత్యంగా ఉన్నవారు క్లారిటీ ఇస్తే తప్ప వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదు. వీరి నుండి సేకరించిన సమాచారం ఆధారం చేసుకుని దర్యాప్తు అధికారులు ఆరా తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనుమానాలను నివృత్తి చేసుకుంటూ పోలీసులు ఒక్కో సాక్ష్యాన్ని సేకరిస్తే తప్ప ముగ్గురి డెత్ మిస్టరీ కొలిక్కి వచ్చే అవకాశం లేదు. మరో వైపున ఎస్సై సాయి కుమార్ డ్రెస్ లోనే మొబైల్ ఫోన్లు కూడా లభ్యం కావడంతో వాటిని రిట్రైవ్ చేయాల్సి ఉంది.  చెరువు గట్టుపై లభ్యం అయిన మొబైల్స్ ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్టుగా సమాచారం. కాల్స్ డాటాతో పాటు వాట్సప్ చాటింగ్ సేకరించాల్సిన ఆవశ్యకత ఏర్పడినట్టుగా తెలుస్తోంది. చెరువు వద్ద దొరికిన మొబైల్స్ వాట్సప్ చాటింగ్ అలాగే ఉన్నట్టయితే ముగ్గురి మరణానికి అసలు కారణాలు ఏంటన్న విషయం ఇట్టే తేలిపోనుంది. వాట్సప్ చాట్ క్లియర్ చేసినట్టయితే సాంకేతికతను అందిపుచ్చుకుని రిట్రైవ్ చేయాల్సి ఉంటుంది. వాట్సప్ ద్వారా ముగ్గురి మధ్య జరిగిన చాటింగ్ ఏంటనేది తేలితే వీరి మరణం వెనక దాగి ఉన్న కోణం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

You cannot copy content of this page