Telangana Bjp: కార్పోరేషన్ పై కాషాయ జెండా… హైకమాండ్ ఆదేశాలే గుండె నిండా…

బండి సంజయ్ వ్యూహాత్మకత

దిశ దశ, కరీంనగర్:

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఆధిపత్యమే లక్ష్యంగా ముందుకు సాగాలని హైకమండ్ రాష్ట్రంలోని ముఖ్య నాయకులకు దిశా నిర్దేశం చేసింది. బల్దియాలపై జెండా ఎగురవేసే విషయంలో ఇప్పటి నుండి కార్యాచరణకు పూనుకోవాలని ఆదేశించింది. అధిష్టానం పక్కాగా నిర్దేశించుకున్న వాటిల్లో కరీంనగర్ కార్పోరేషన్ అత్యధిక ప్రాధాన్యత జాబితాలో ఉండడంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. నగరంలో బలమైన నాయకత్వం, ప్రభావితం చేయగలిగే లీడర్లు అవసరమని గుర్తించి ఆ దిశగా పావులు కదుపుతున్నట్టుగా స్పష్టం అవుతోంది. క్షేత్ర స్థాయిలో పార్టీపై ఉన్న క్రేజీని కూడా పరిగణనలోకి తీసుకున్న ఆయన ఇందుకు అనుగుణంగా పావులు కదపాల్సిందేనని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా కాషాయ కండువా కప్పుకునేందుకు ఎదరు చూస్తున్న ప్రత్యర్థి పార్టీల నాయకులను అక్కున చేర్చుకోవడంతో తన ఆపరేషన్ స్టార్ట్ చేసినట్టుగా అనిపిస్తోంది. స్మార్ట్ సిటీ ద్వారా కేంద్రం ఇచ్చిన నిధుల విషయంలో బీజీపీకి క్రెడిట్ దక్కకుండా వ్యవహరించిన విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న బండి సంజయ్ ఇది కేంద్ర ప్రభుత్వం ఘనత అని చెప్పించేందుకు ప్రణాళికా బద్దంగా సాగుతున్నట్టుగా అనిపిస్తోంది. ఇప్పటి వరకు స్మార్ట్ సిటీ తన ఖాతాలో వేసుకున్న బీఆర్ఎస్ పార్టీని మరింత బలహీన పర్చాలని కూడా భావించినట్టుగా తెలుస్తున్నది. ఇందులో భాగంగానే మొదట బీఆర్ఎస్ పార్టీ నుండి వలసలను ప్రొత్సహిస్తున్నారని, ప్రస్తుతం కార్పోరేషన్ పై తిరుగులేని పట్టు బిగించి ఉన్న గులాభి పార్టీని టార్గెట్ చేసుకుని వ్యూహాత్మకంగా ఎత్తులు వేసినట్టుగా ఆయన సన్నిహితులు చెప్తున్నారు.

ప్రథమ పౌరునితో…

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం… కరీంనగర్ లో ఆ పార్టీకి పెద్ద దిక్కు లేకపోవడం కూడా కలిసి వస్తుందని ఆశించిన బండి సంజయ్ బీఆర్ఎస్ పార్టీ నుండి ఫిరాయింపులను ప్రొత్సహించాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తో నగర మేయర్ సునీల్ రావు కూడా సాన్నిహిత్యం పెంచుకునే పనిలో నిమగ్నం అయ్యారు. ఇదే అదనుగాు భావించిన సంజయ్ సునీల్ రావును తనకు అనుకూలంగా మల్చుకుని పార్టీలోకి చేర్పించుకునేందుకు పావులు కదిపారు. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ క్రమక్రమంగా తగ్గిపోతున్న క్రమంలో కరీంనగర్ లో బలమైన శక్తి బీజేపీ మాత్రమేనన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచిస్తూ సునీల్ రావును మెప్పించి ఒప్పించినట్టుగా తెలుస్తున్నది. అయితే సునీల్ రావు కూడా ఇతర పార్టీల కంటే బీజేపీలో చేరితేనే అన్నింటా తనకు లాభం చేకూరుతుందని అంచనా వేసుకోవడంతో కాషాయం కండువా కప్పుకునేందుకు మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. స్మార్ట్ సిటీ నిధుల విషయంలో బీజేపీకి క్రెడిట్ దక్కించేందుకు కేంద్ర మంత్రి ఖట్టర్ టూర్ ఫిక్స్ చేసి ఇతర పార్టీల నాయకుల నోటితో బహిరంగ సభలో చెప్పించడంలో కూడా బండి సంజయ్ సక్సెస్ కాగలిగారు. కేంద్ర మంతరి ఖట్టర్ అలా హైదరాబాద్ బయలుదేరారో లేదో సునీల్ రావు కేంద్రీకృతంగా బీజేపీ చేరే మంత్రాంగం మొదలైంది. అప్పటికే అంతర్గతంగా చర్చించి మాట తీసుకున్న మేయర్ సునీల్ రావు 10 మంది సిట్టింగ్ కార్పోరేటర్లను కూడా బీజేపీలో చేర్పిస్తున్నారు.

వలసపైనే దృష్టి…

స్థానిక ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అయ్యే నాటి వరకు ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని బీజేపీలో చేర్పించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 66 డివిజన్లలో కనీసం మెజార్టీ డివిజన్లలో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ నిర్ణయించుకున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇబ్బడిముబ్బడిగా వలసలను ప్రోత్సహించకుండా పార్టీలో చేరాలనుకునే వారిని బలం, బలగాన్ని కూడా పరిగణనలోకి తీసుకునే విషయంలో రాజీ పడకూడదని కూడా భావిస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఉన్న నాయకుడు, మాజీ ఎంపీ బోయినలపల్లి వినోద్ కుమార్ బావమరిది, సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో కలిసి నడిచిన మేయర్ సునీల్ రావు బీజేపీలో చేరడం మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

You cannot copy content of this page