జాతీయ నేత ఇలాకాలో జారిపోతున్న క్యాడర్

కమలంలో సరికొత్త ముసలం

కరీంనగర్ బీజేపీలో ఏం జరుగుతోంది..?

దిశ దశ, కరీంనగర్:

బీజేపీ జాతీయ నేతలున్న ఆ జిల్లాలోనే పార్టీ శ్రేణులు పక్క పార్టీల వైపు చూస్తున్నారెందుకు..? పార్టీ సింబల్ పై గెలిచినా పార్టీలు మారేందుకు మొగ్గు చూపుతున్నారెందుకు..? రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నించిన ముఖ్యనేత ఇలాకాలోనే పార్టీ బలహీనపడే దిశగా ఎందుకు సాగుతోంది..? ఇప్పుడిదే చర్చ ఆ పార్టీలో కొనసాగుతోంది.

కార్పోరేటర్ల వలస బాట…

తెలంగాణాలో బీజేపీని అక్కున చేర్చుకున్న జిల్లాల్లో కరీంనగర్ మొదటి వరసలో నిలుస్తుంది. 1980వ దశాబ్దం నుండి ఉమ్మడి జిల్లా వాసులు బీజేపీ నేతలను గెలిపిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ ఉనికి లేని సమయం నుండి కూడా పార్టీకి మాత్రం గుర్తింపు ఉందనే చెప్పాలి. ఇటీవల కాలంలో ఈ ఊపు బీజేపీకి మరింత ఎక్కువ అయిందనడంలో అతిశయోక్తి లేదు. కానీ పార్టీ సింబల్ పై గెలిచిన క్యాడర్ మాత్రం పక్క పార్టీల వైపు చూస్తుండడమే ఆ పార్టీ ముఖ్య నాయకత్వానికి సవాల్ విసురుతోందన్నది వాస్తవం. గతంలో ఏనాడు లేని విధంగా బీజేపీ కార్పోరేటర్లు పెద్ద ఎత్తున కరీంనగర్ బల్దియాకు ప్రాతినిథ్యం వహించారు. అయితే ఇప్పటికే ముగ్గురు కార్పోరేటర్లు బీజేపీ 13మందిలో ముగ్గురు ఇప్పటికే వేరే పార్టీలోకి చేరిపోయారు. తాజాగా మరో ముగ్గురు కార్పోరేటర్లు కాషాయ జెండా వదిలేసేందుకు సమాయత్తం అవుతున్నారు. దీంతో కరీంనగర్ బల్దియాలో బీజేపీ మరింత బలహీనపడనుందన్నది వాస్తవం. అయితే కార్పోరేషన్ లో బీజేపీ ప్లోర్ లీడర్ లేకపోవడం కూడా ఆ పార్టీ నాయకత్వం చేసిన ప్రధాన తప్పిదమని చెప్పవచ్చు. పార్టీ ప్రతినిధులకు దిశా నిర్దేశం చేసే వారు లేకపోవడంతో బీజేపీలోనే కార్పోరేటర్లు ఉండేందుకు కట్టడి చేసే నాయకత్వం లేకుండా పోయింది. అందుబాటులో ఉన్న వారికి బాధ్యతలు అప్పగించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం చొరవ తీసుకోకపోవడం వల్లే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోందన్నది వాస్తవం. మరో వైపున బీజేపీ నగర అధ్యక్షుడి నియామకం విషయంలో కూడా పార్టీ తాత్సర్యం చేస్తుండడం విస్మయం కల్గిస్తోంది. కరీంనగరాన్నిఐదు భాగాలుగా విభజించి జోన్ కమిటీలను వేయడం విస్మయం కల్గిస్తోందని చెప్పక తప్పుదు. అలాగే అనుభంద కమిటీల అధ్యక్షులను మార్పులు చేర్పులు చేస్తుండడం కూడా క్యాడర్ కు మింగుడు పడకుండా తయారైంది. ఇప్పటికే పార్టీని వీడిన కార్పోరేటర్లలో ఇద్దరు దళితులు కూడా ఉండడం ఆ పార్టీ నాయకత్వానికి సవాల్ విసురుతోంది.

‘బండి’ ఇలాకాలోనే…

ఇటీవల కాలం వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి, ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బండి సంజయ్ ఇలాకాలోనే పార్టీని వీడేందుకు ద్వితీయ శ్రేణి నాయకులు ఆసక్తి చూపుతుండడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసి నలుమూలల క్యాడర్ లో జోష్ నింపిన బండి సంజయ్ తాను ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న కరీంనగర్ లో మాత్రం ఎందుకు విఫలం అవుతున్నారన్నదే అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయింది. బీజేపీ జాతీయ నాయకత్వం అండదండలు మెండుగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బండి సంజయ్ ఇలాకా గురించి అధిష్టానం వద్దకు ఈ విషయాన్ని తీసుకెళ్లేందుకు నాయకత్వం సాహసించడం లేదు. అయితే ప్రజా క్షేత్రంలో మాత్రం బీజేపీ పూర్తి స్థాయిలో విఫలం అవుతుండడం పార్టీ క్రియాశీలక కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే లీడర్, క్యాడర్ రెండూ లేకుండా పోయి, ప్రత్యర్థి పార్టీలు బలోపేతం అయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తానే బరిలో నిలుచుంటానన్న సంకేతాలు ఇప్పటికే బండి సంజయ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సెకండ్ క్యాడర్ అంతా చేజారిపోయిన తరువాత గెలిచే అవకాశం ఉంటుందా అన్న విషయాన్ని బేరీజు వేసుకోవల్సిన అవసరం ఉంది. ప్రధానంగా కరీంనగర్ లో మైనార్టీల ఓట్లు అత్యంత కీలకం అన్న విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మైనార్టేతర ఓట్లను బీజేపీకి అనుకూలంగా మల్చుకోవాలంటే క్షేత్ర స్థాయిలో క్యాడర్ అవసరమన్న విషయాన్ని గుర్తుంచుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది.

You cannot copy content of this page