కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన మైనార్టీ నాయకడు ఆ పార్టీకి రాజీనామా చేయడం కలకలం సృష్టిస్తోంది. రెండు రోజుల క్రితమే కరీంనగర్ సమీపంలోని ఖాజీపూర్ వక్ఫ్ బోర్డు భూములు, రేకుర్తిలోని నిరుపేద ముస్లింల ఇండ్ల కూల్చివేత విషయంలో ఆరోణలు చేసిన వక్ఫ్ బోర్డు మాజీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ పార్టీ నేత మోసీన్ అహ్మద్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్ నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి గంగుల కమలాకర్ ఖాజీపూర్ లోని 54 ఎకరాల వక్ఫ్ బోర్డు భూమిని కబ్జా చేశారని, రేకుర్తిలోని 35 పేద ముస్లింల ఇండ్లను బుల్లోజర్లతో కూల్చి వేయడంతో పాటు బాధితులపైనే అక్రమ కేసులు బనాయించారని మోసిన్ అహ్మద్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహ శైలికి నిరసనగా తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. మరో వారం రోజుల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన మైనార్టీ నాయకుడు రాజీనామా చేయడం సంచలనంగా మారింది.