దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అత్యంత సన్నిహితుడు చిట్టుమల్ల శ్రీనివాస్ ను కరీంనగర్ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మానకొండూరు మండలంలోకి ఓ భూమికి సంబంధించిన వ్యవహారంలో చిట్టుమల్ల శ్రీనివాస్ తో పాటు 21 మందిపై కరీంనగర్ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా చిట్టమల్ల శ్రీనివాస్ (58)తో పాటు అతని తనయుడు చెన్నైలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న చిట్టుమల్ల అచ్యుత్ చైతన్య (32), గంప నాగరాజు (48), దేశబోయిన శ్రీకాంత్ (42), దేశబోయిన గోపి (58), దేశబోయిన శ్రీనివాస్ (57)లను అరెస్ట్ చేసిన పోలీసులు కరీంనగర్ కోర్టులో హాజరు పరిచారు. మిగతా వారు పరారీలో ఉన్నట్టుగా పోలీసులు కోర్టుకు తెలియజేశారు. క్రైం నంబర్ 550/2024లో సెక్షన్ 318(4), 338, 336 (3), 340 (2), 308 (5), 61 (2), 351 (3), రెడ్ విత్ 3 (5) బీఎన్ఎస్ యాక్టు ప్రకారం కేసు నమోదు చేశారు. నీరుమల్ల శ్యాం కుమార్ అనే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. మానకొండూరులోని సర్వే నెంబర్ 1262లలోని భూమికి సంబంధించిన వ్యవహారంలో బాధితుడు శ్యాంకుమార్ ను మోసం చేయడంతో పాటు తప్పుడు డాక్యూమెంట్లు క్రియేట్ చేశారని, బెదిరింపులకు గురి చేశారని కేసు నమోదు చేశారు. నిందితులను కోర్టులో హాజరు పర్చిన పోలీసులు కేసు విచారణ ఇంకా చేయాల్సి ఉన్నందున వీరిని కస్టడి తీసుకునేందుకు కూడా పిటిషన్ దాఖలు చేయాల్సి ఉందని రిమాండ్ సిడీలో వివరించారు. కోర్టులో హాజరు పర్చిన నిందితులను జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కరీంనగర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వీరిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలిస్తున్నారు పోలీసులు.
పరారీలో ఉన్నది వీరే…
ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుల వివరాలను కూడా పోలీసులు వెల్లడించారు. దేశబోయిన జగత్ ప్రకాష్, గంప రమేష్, కొండ మురళి, వంగల సంతోష్ కుమార్, గంప లవ కుమార్, గంప రవళి, వంగల గీత, గం ఫణీంద్ర, యాంసాని రాధాకృష్ణ, ఆకుల సుదర్శన్, రేగొండ సందీప్, మాకు వెంకట శారద దేవి, బొల్లినేని సృజన్ రావు, కొత్త జైపాల్ రెడ్డి, దువ్వంతుల లక్షారెడ్డిలు పరారీలో ఉన్నారు.