కొల్యూడ్ పాలిట్రిక్స్..!

ఏ అసెంబ్లీ నియోజకవర్గానికైనా.. లోక్ సభ స్థానానికైనా… తమ అభ్యర్థులెవ్వరో నిర్ణయించి వారికి బీఫాం ఇవ్వడం ఆయా పార్టీల బాధ్యత, పని. కానీ.. ఆ ఉమ్మడి జిల్లాలో మాత్రం అధికార బీఆర్ఎస్ నేతలే… మిగిలిన పార్టీల నుండి ఎవరెవరు బరిలోకి దిగాలో నిర్ణయిస్తున్నారట.. నిర్దేశిస్తున్నారట. కొల్యూడ్ పాలిట్రిక్సే అందుకు కారణమన్నది బహిరంగ రహస్యం. మరి కులమతాల వారీగా లెక్కలతో నడుస్తున్న ఆ జిల్లా రాజకీయాలేంటో తెలుసుకోవడానికి.. ఆ జిల్లాకోసారి అలా వెళ్లొద్దామా…?

రాజకీయ శత్రువులు… వ్యక్తిగతంగా మిత్రులవ్వడం.. కలిసినప్పుడు పిచ్చాపాటీ మాట్లాడుకుని.. యోగ క్షేమాలు అడిగి తెలుసుకోవడం గతంలో పరిపాటిగా కనిపించిన ఓ మంచి సంప్రదాయం. అయితే, ఇప్పుడూ అలాగే పార్టీలకతీతంగా నేతలు పలకరించుకుంటున్నారు. ఒకరింట జరిగే వేడుకులకు ఒకరు వెళ్తారు… ఒకరి ఆహ్వానాలను ఇంకొకరు మన్నించి ఎన్ని పనులున్నా వదులుకుని వెళ్తుంటారు. అయితే, ఈ మొత్తం పరిణామాల వెనుక సామాజిక వర్గ లెక్కలుండటం ఒక కారణమైతే… ఆ కారణమే ఇప్పుడు అధికార బీఆర్ఎస్ నాయకులే ఇతర పార్టీల అభ్యర్థులనూ నిర్ణయించే స్థాయిలో డిసైడింగ్ ఫ్యాక్టర్ అవ్వడమే రాజకీయ విషాదం.

ఇప్పుడు అలాంటి కొల్యూడ్ పాలిట్రిక్స్ కు కరీంనగర్ ఓ వేదికైందన్నది బయట బలంగా వినిపిస్తున్న మాట. అనుభవం ఉండి.. ఆసక్తి చూపుతున్నవారిని దూరంగా పెట్టడం సదరు నేతల వ్యూహంలో ఓ భాగమైతే… పెద్ద చెట్టు కింద చిన్న చెట్టులాగానే ఉండే లీడర్లను పెట్టి.. పొల్టికల్ గేమ్ కు ప్లాన్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. పైగా పార్టీలకతీతంగా.. కీలక నేతలు చేతులు కలుపుతుండటం… గెలుపు గుర్రాలను రేసులో ఉండకుండా చూసుకోవడం.. ఉమ్మడి శత్రువులుగా ఉన్నవారిని మట్టి కరిపించి ఫీల్డ్ లోనే లేకుండా చేయడం కోసం పన్నుతున్న తెరవెనుక రాజకీయ పన్నాగాలు ఇప్పుడు పొల్టికల్ సర్కిల్స్ లోనూ చర్చకొస్తున్నాయి.

అసలు ఈ కొల్యూడ్ పాలిటిక్స్ రూపమెలా ఉంటుంది…?

బీఆర్ఎస్ లో ఓ కీలక నేత ఉంటాడు. అంతకుముందు కాంగ్రెస్ నుండో, బీజేపీ నుండో బీఆర్ఎస్ లోకి వచ్చిన మరో కీలకనేతకు… తన తల్లిలాంటి పార్టీని వదిలి వచ్చినందుకు ఎలాంటి అవకాశాలు దక్కకపోగా.. ఆ ప్రభావిత నేత మళ్లీ తన పార్టీలోకో.. లేక, మంచి అవకాశం కల్పించే ఇంకో పార్టీలోకో పోవాలనుకుంటాడు. కానీ, ఆ నేత ఇతర పార్టీల్లోకి వెళ్లినా… మళ్లీ తమ విజయావకాశాలను దెబ్బతీసే ప్రమాదముందని గ్రహిస్తున్న అధికార బీఆర్ఎస్ నేతలు ఆదిలోనే వాటిని అడ్డుకునే యత్నం చేస్తున్నారు. సదరు నేత కాకుండా.. ఇదిగో ఈ నేతను అభ్యర్థిగా ప్రకటించండంటూ సదరు బీఆర్ఎస్ కీలక నేతే చెబుతాడు. అందుకు రాష్ట్రస్థాయిలో కీలకనేతలుగా ఉన్న నాయకులూ తలలూపుతారు. మరి అధికారపార్టీకి ప్రత్యామ్నాయంగా ఆవిర్భావించాల్సిన ప్రతిపక్ష పార్టీలు ఎందుకు అలా తలులూపుతాయి…? తమ పార్టీ అభ్యర్థిని తాము డిక్లేర్ చేయాల్సి ఉండగా… అధికార బీఆర్ఎస్ నేతలు చేయడమేంటన్న ఉక్రోషం వాళ్లకేమాత్రం ఉండదా..? అదే కదా పవర్ పాలిట్రిక్స్ అంటే…? దానికి కావల్సినంత సమీకరణాలు ప్రత్యేకంగా జరుగుతూనే ఉంటాయి కదా..!

రాను రాను ఎన్నికల ఖర్చులు పెరుగుతున్న కాలాన.. తమకున్న పరిచయాలతో అధికార పార్టీ నాయకులు.. ప్రతిపక్ష నాయకుల బలహీనతలే ఆసరాగా ఈ పవర్ పాలిట్రిక్స్ కు పాల్పడుతున్నారన్నది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమేం లేదనుకుంటా. కానీ, తమ పార్టీలను పరుగులు పెట్టిస్తామని చెప్పి కీలక నేతలుగా ఎదిగినవారు.. సిగ్గూ, ఎగ్గూ లేకుండా… అధికార పార్టీ నేతలు చెప్పిన వారినే తమ పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దించడం.. పైగా గురుభక్తినో, తమపై, తమ పార్టీలపై పెట్టుకున్న నమ్మకానికి విలువనిస్తూ.. వారిని గుర్తించి టిక్కెట్ ఇచ్చామంటారు. బలహీన నేతలవైపు నిలబడి సమర్థిస్తూ.. తన లబ్ది చేకూర్చాలనుకుంటున్న ఆపోనెంట్ నేత గెలుపు దారిని సుగమం చేస్తూ.. పైకి మాత్రం నర్మగర్భంగా వారెంత గొప్పవారమోనన్నట్టుగా కటింగ్స్ ఇస్తూ ఉంటారు. ఈ కొల్యూడ్ పాలిట్రిక్స్ చూస్తుంటే.. మీకు అసలు వీళ్ళు కదా రంగమార్తండలనిపిస్తుందా..? హహ్హా.. అదే కదా మరి కౌటిల్య రాజకీయం అంటే..!

అంతేకాదు.. ఇప్పుడక్కడ సెటిల్మెంట్స్ దందా కూడా ఇదే స్థాయిలో నడుస్తోంది. ఫలనా అధికార పార్టీకి చెందిన కీలక ప్రజాప్రతినిధి ఇలా చేశాడంటూ.. సదరు ప్రతిపక్ష నేతనెవ్వరైనా కలిస్తే… ఆ విషయం ప్రతిపక్ష నేతే సదరు అధికార పార్టీ నేతలకు చెప్పేస్తాడన్న సంగతి తెలియని అమాయకులు మాత్రమే ఇంకా వారిని సంప్రదిస్తుంటారు. ఈ మొత్తం వ్యవహారాలను నిశితంగా పరిశీలించేవారు మాత్రం.. అబ్బా రాజకీయాలు ఎంతగా మారిపోయాంటూ ముక్కున వేలేసుకుంటారు! ఈ విషయాలను ఆయా పార్టీల ముఖ్య నేతలు గుర్తించరు.. ఎవరైనా చెప్పినా చెవికెక్కించుకోరు.. చివరాఖరకు.. ఓట్లు పోయి సీట్లు పోయాక తలలు పట్టుకునేవరకు..అలాగే వ్యవహరిస్తారు… అన్యధా శరణం నాస్తి!

ఆకాశవాణి…✍️

You cannot copy content of this page