దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ లో ప్రభుత్వ కార్యాలయాల పేర్లు చకాచకా మారిపోతున్నాయి. మొన్నటికి మొన్న ఆర్టీఏ కార్యాలయంలో ఆవరణలో ఉన్న పార్కుకు జువ్వాడి చొక్కారావు పేరిట మార్చేశారు. తాజాగా ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ పేరును కూడా మార్చేయడం సంచలనంగా మారింది.
కేసీఆర్ పేరును…
కరీంనగర్ రోడ్లు భవనాల శాఖ అతిథి గృహాన్ని పునర్నిమానం చేసింది. గత ప్రభుత్వం. దీంతో అప్పుడు జిల్లా మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ పేరును మార్చాలని నిర్ణయించారు. మార్చే ఈ పేరులో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కలిసి రావాలన్న ఆలోచనతో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌజ్ (ఇంగ్లీష్ లో KCR అని వచ్చేలా) నామకరణం చేసి ప్రారంభోత్సవం చేశారు. ఇంగ్లీష్ లో కెసీఆర్ అని కలిసి వచ్చేలా ఈ గెస్ట్ హౌజ్ మార్చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గెస్ట్ హౌజ్ పేరును ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ గా మార్పించారు. కేసీఆర్ అన్న అక్షరాలు సోమవారం తొలగించినప్పుడే బీఆర్ఎస్ నాయకులు తప్పు పట్టారు. అయితే మంగళవారం ఏకంగా ఈ సర్క్యూట్ రెస్ట్ హౌజ్ పేరును గెస్ట్ హౌజ్ గా మార్చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా వెలువడడంతో అధికారులు పేరును ఛేంజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రజల ఆస్థి ఇది… ప్రజా ప్ఱభుత్వం ప్రజా పాలన నియంత పాలన కాదిది అంటూ పేరు మార్చిన పోటోలను కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైద్యుల అంజన్ కుమార్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఆ పేరు మారుస్తారా..?
ఉద్యమ నేత కేసీఆర్ కు కరీంనగర్ అంటే సెంటిమెంట్ అన్న నినాదం రెండు దశాబ్దాలకు పైగా చెప్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఏ పని మొదలు పెట్టిన ఇక్కడి నుండే ప్రారంభిస్తారన్న విషయాన్ని ఆ పార్టీ నాయకులు కూడా పదే పదే చెప్తుంటారు. అయితే ఇదే క్రమంలో కరీంనగరాభివృద్ది కోసం కూడా కేసీఆర్ పేరు కలిసొచ్చేలా పెట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారి కరీంనగర్ కు వచ్చినప్పుడు ప్రారంభించిన ఈ పనులకు కరీంనగర్ సిటీ రెనోవేషన్(ఇంగ్లీష్ లో KCR అని వచ్చేలా) పేరు పెట్టారు. ప్రధానమైన పనులకు కేసీఆర్ అన్న పదం కలిసి వచ్చే విధంగా పెట్టేందుకే ప్రాధాన్యత ఇచ్చారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేర్లు మారుతున్నట్టుగానే కరీంనగర్ సిటీ రెనోవేషన్ పేరు కూడా మారుస్తారా అన్న చర్చసాగుతోంది.